26 డిసెం, 2008

వినూత్న ప్రపంచ విధాతలు కంప్యూటర్లు

ఆటవిక జీవనంతో ప్రారంభమైన మానవుని ప్రయాణం విశ్వాంతరాళానికి చొచ్చుకుని పోయి అరచేతిలో భూగోళాన్ని, కళ్ల ముందు అంతరిక్షంతో పాటు అనంతమైన విఙ్ఞానాన్ని ఆవిష్కరించే గొప్ప స్థాయికి చేరుకుంది. మనిషి సామర్థ్యాలన్నిటినీ రంగరించి అతని మేథస్సును మథించి చేసిన ఎన్నో ఆవిష్కరణలు నేటి సాంకేతిక విప్లవానికి మూల స్థంభాలయ్యాయి.

     ప్రస్తుత కాలపు వైఙ్ఞానిక విప్లవానికి, అధునాతన విజయాల పరంపరకి ప్రధానపాత్ర పోషిస్త అన్ని రంగాలలోనూ క్రియాశీలక మైన పాత్ర పోషిస్తున్నాయి కంప్యూటర్లు. విద్య, వైద్య, వాణిజ్య,ఆవ్యాపార రంగాలతో పాటు ప్రస్తుత ఆధునిక సమాజంలో కంప్యూటర్ల వినియోగం లేకుండా రోజు గడిచే ప్రసక్తే లేదు. చిన్న చిన్న పాఠశాలలు కూడా ఒకటవ తరగతి నుండీ పిల్లలకు కంప్యూటర్ ఓనమాలు నేర్పిస్తున్నాయనటంలఆఆ అతిశయోక్తిలేదు.

             కంప్యూటర్ కోర్సులు, డిగ్రీలు చేసే విద్యార్థుల సంఖ్యకూడా రోజు రోజుకీ పెరుగుతునే ఉంది. నగరంలో 150 కి పైగా ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు నిత్యం నెటిజన్లతో కళకళలాడుతూ ఉండటం అన్ని వర్గాల వారూ కంప్యూటర్ల వినియోగించటానికి కంప్యూటర్ల ద్వారా కొత్త కొత్త విషయాలను నేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నారన్న సంగతిని తేటతెల్లం చేస్తున్నది.

ఒక రోజువారీ  సామాజిక  అవసరంగా కంఫ్యూటర్లు:

దూరప్రాంతాలలో ఉన్న ఆప్తులు, స్నేహితులతో పాటు విదేశాలలోని కుటుంబీకులు, సన్నిహితులతో అతి తక్కువ ధరలకే గంటలపాటు మాట్లాడుకునె అవకాశం అన్ని వర్గాలవారికి ఆన్లైన్ విధానం అందించిన గొప్పవరం.

ఏ ఫోన్ అయినా నిముషానికి ఒక రూపాయి చొప్పున గంటకి 60 రూపాయల ఖర్చయితే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో యూజర్ చార్జీ 10 నుండి 20 రూపాయిలమధ్య మాత్రమే చెల్లించి ప్రశాంతంగా మూడు రెట్లు ఎక్కువ సమయం మాట్లాడుకునే వీలు కల్పిస్తుంది.

ఆన్ లైన్ చెల్లింపులు - బ్యాంకింగ్ విధానాలు:

ఒక బ్యాంకుకున్న వివిధ శాఖల కార్యకలాపాలు సమీకృతం చేసి, ప్రతిచోటా బ్యాంకు సేవలను ఖాతాదారుడు ఒకే విధంగా అందించే సౌలభ్యాన్ని ఈసేవలు అందిస్తున్నాయి. అంతేకాకుండా పనుల ఒత్తిడిలో లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్లైన్ విధానంలో చెల్లింపులు , జమలు చేసుకునే విధానం ప్రస్తుత కాలంలో బహుళ జనాదరణ పొందుతోంది. కాకపోతే ఈ విధానంలో కార్యకలాపాలు చేయాలనుకున్నవారు హ్యాకర్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

హ్యాకర్లంటే ఎవరు?

         మనకి తెలియకుండా మన పాస్వర్డు కనిపెట్టి మన కంప్యూటర్ల లోకి చొరబడి మన సమాచారాన్ని చోరీ చేసేవారు హాకర్లు. అందుకని ఇంటర్నెట్ సెంటర్లకి వెళ్ళినపుడు మనం సరిగ్గా సైన్ అవుట్ అయ్యామా లేదా ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. పీ.సీ. లకి అటువంటి వారినుండి రక్షణ కల్పించే సాఫ్ట్ వేరి ను జోడించుకోవాలి.

                  ఆన్ లైన్ ద్వారాఅ బ్యాంకింగ్ కార్యకలాపాలు చేయగోరువారు సంబంధిత బ్యాంకువారిని సంప్రదించి వారి సూచనల మేరకు ఒకసారి పాస్ వర్డ్ పొందితే ఎక్కడున్నా సరే ఆన్ లైన్ ద్వారా బ్యాంకింగ్ సదుపాయాలను పొందవచ్చు. కాలంతో పరుగులు తీస్తున్న నేటితరానికి  ఈ పద్ధతి ఎంతో సమయాన్ని పొదుపు చేస్తుందనే చెప్పాలి.

ఆన్ లైన్  ద్వారా ఉజ్వల భవిష్యత్తు:

గతంలో చాలా పరీక్షలకి దరఖాస్తు చేయాలంటే తిరిగి తిరిగి దరఖాస్తు పత్రం సంపాదించి, స్టాంపులు అతికించి, పోస్టు చేసి, ఎక్నాలెడ్జ్మెంటు వచ్చేదాకా ఎదురుచూపులు చూడాల్సివచ్చేది. కానీ నేడు చాలా వరకు ఉన్నత స్థాయి పరీక్షలకోసం వివిధ విశ్వవిద్యాలయాలు ఉద్యోగాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీలు ఆన్ లైన్ విధానాన్ని ఆశ్రయిస్తున్నాయి. దరఖాస్తు పూర్తిచేసి సమర్పించిన కొద్ది క్షణాల్లోనే చేరినట్లు సమాచారం అందటం అభ్యర్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ఈ - లెర్నింగ్:

వివిధ రకాల కంఫ్యూటర్ లాంగ్వేజీలు, కొత్త కొత్త కోర్సులు, అంతర్జాతీయ అధ్యాపకుల సలహాలు, సూచనలు, గెస్ట్ లెక్చరర్ల ను వీడియోలుగా చిత్రీకరించబడి విద్యార్థులకు ఎంతో విఙ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఉదా: ieee.org  ఈ వెబ్ సైట్లో నమోదుచేసుకున్న విద్యార్థులకు  దేశవ్యాప్తంగా విద్యాపరమైన సమాచారంతో పాటు  అవసరమైన వీడియో పాఠాలను కూడా అందిస్తారు

 ఆన్లైన్ షాపింగ్:

నిత్యావసర వస్తువులతో పాటు బంధువులు మిత్రులకు ఇచ్చే పుట్టిన రోజు కానుకలు, పుష్పగుచ్చాలు ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేస్తే స్థానికంగానే కాక దేశ విదేశాలకు కూడా క్షణాల్లో వస్తువులు చేరిపోతాయి.

కొన్ని ముఖ్యమైన  లింకులు:

ఉద్యోగాల వేటకోసం ఉపయుక్తమైన ప్రసిద్ధ లింకులు:

naukri.com

monster.com

timesjobs.com

సినిమా సంబంధ విషయాల వివరాలు అందించే లింకులు:

kottaga.com

thatstelugu.com

torenz.com

5జి. బి. ఉచిత  మెమరీ ని  అందించే వెబ్సైట్లు:

youtube

e snips

ఈ లెర్నింగ్ కి సహకరించే వెబ్ సైట్లు:

iee.org

http://questionpaper.in

www.indiastudycenter.com

అన్ని రకాల తెలుగు లింకుల కోసం :

http://www.geocities.com

కొత్త సంవత్సరం కొత్త ఈ- డైరీ మనకోసం ప్రత్యేకంగా సృష్టించుకోవాలంటే :

http://diary.com : వందలకొద్దీ డబ్బు వెచ్చించి డైరీ కొనుక్కునే కంటే ఇంట్లోని కంప్యూటర్ ద్వారా ఈ లింకుకువెళ్ళి పర్సనల్ గా డైరీ సృష్టించుకుని, మనసులో ని మాటలను భద్రపరచుకోవచ్చు. దీని కోసం పైసా ఖర్చు పెట్టనక్కరలేదు. పైగా మన అనుభూతులకి జతగాఫోటోలు కూడా జోడించుకోవచ్చు.

కొత్తగా బ్లాగును సృష్టించుకోవాలంటే :

http://blogspot.com

తెలుగులో టైప్ చేసుకోవాలంటే:

www.lekhini.org

ఈ పేపర్  ద్వారా ప్రధాన పత్రికలతో పాటు, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పొందవచ్చు.

గ్రీటింగ్స్:

వందలు వేలల్లో గ్రీటింగ్ కార్డులకి డబ్బులు వృథా చెయ్యకుండా సెర్చింజను సహాయంతో రకరకాల గ్రీటింగ్ లను సందర్భాను సారంగా ఎంచుకుని సన్నిహితులకు క్షణాల్లో ఉచితంగా కావలసినన్ని ఎలక్ట్రానిక్ గ్రీటింగులు ఎంతో ఆకర్షణీయంగా మనకు నచ్చినట్టు రూపొందించుకొని పంపించుకోవచ్చు.

ఈ - తెలుగు :

జపాన్ , చైనా ల మాదిరి కంప్యూటర్ వినియోగం అంతా మన మాతృ భాష తెలుగులోకి మార్చి అన్ని వర్గాల ప్రజలకు కంప్యూటర్ ఇచ్చే అధ్బుత ఫలితాలను అందించే ఉద్దేశ్యంతో మన తెలుగువారు ఎంతగానో కృషి చేస్తున్నారు.

 

RFID:

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ  : అతి చిన్న పరిమాణంలో ఉన్న  దీనిని పిల్లల చొక్కాల గుండీలకి , జేబుల్లోనూ , చెవిపోగుల్లోనూ అమర్చటం  ద్వారా వారి కదలికలపై అనుక్షణం నిఘా ఏర్పరుస్తారు. కిడ్నాపులు, దౌర్జన్యాలనుండి పిల్లలకి రక్షణ ఇవ్వటంతో పాటు అనుక్షణం వారి శరీరంలో కలిగే మార్పుల్ని సైతం ఇవి కనిపెట్టి ఎప్పటికప్పుడు సందేశాలిస్తాయి.

     ఒక్కసారి సమయం కేటాయించి దీనికి పనిచెప్తే పిల్లలకి అన్నం తినమంటూ సంకేతాలివ్వటం , మందులువేసుకోమని హెచ్చరించటం , వాళ్ళు ఆపని చేసిందీ లేనిదీ ఎప్పటికప్పుడు యజమానికి నివేదించటం లాంటి పనులు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది.అమెరికా వంటి దేశాల్లో దీనిని పిల్లల కేర్ తో పాటు కుక్కల పరిరక్షణకు కూడా వినియో గించటం విశేషం.

పైగా దీని నిర్వహణా ఖర్చు కూడా చాలా తక్కువ . మన కరెన్సీలో నెలకు రూ.100 మాత్రమే ఖర్చు అవుతుందని, రాబోయే1, 2 సంవత్సరాల్లో ఈ సౌకర్యం మనదేశానికి కూడా అందబోతుందని మన ఎన్.ఆర్.ఐలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భూమి చుట్టూ తిరుగుతున్న 24 శాటిలైట్లు అనుక్షణం కన్ను వేసి కిడ్నాపర్ల దాడి నుంచి RFID ద్వారా రక్షణను ఇస్తుండటం విశేషం.

   మన జీవన సరళిలో కంప్యూటర్లు ప్రతి దశలోనూ తప్పనిసరి అవసరాలై  కూర్చున్నా, వాటిని సమర్థవంతంగా వినియోగించుకో వటం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందన్న నిజం మనం గ్రహించాలి.

 

     మిత్రులారా ! నాకు తెలిసిన  విషయానికి తోడుగా నాకు కొత్త కొత్త విషయాలు అందించిన నా మిత్రులకు ధన్యవాదాలు.

మీరు కూడా కంప్యూటర్ల విషయంలో మీకు తెలిసిన విషయాలు ఇక్కడలేనివి చిన్నవైనా , పెద్దవైనా వ్యాఖ్యల రూపంలో నేరుగా పెట్టగలరని ఆశిస్తున్నాను.నాతో పాటు నా బ్లాగు చదివే ప్రతిఒక్కరూ ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ వ్యాసం నుండి స్వీకరిస్తే  అదే నాకు పదివేలు.

           పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోగలగడం ఒక అదృష్టం.

     చిన్న వాళ్ళకు దారి చూపగలగటం గొప్ప ఔదార్యం.

ఉత్సాహపరిచే వాళ్లకంటే నీరుగార్చే మహాత్ములు నిండుగా ఉన్న ఈ ప్రపంచంలో నన్ను నన్నుగా గుర్తించి ప్రోత్సహించే మహాశయులకు వందనం.

పోటీల మాటున పిల్లల అగచాట్లు

      పెద్ద పెద్ద వేదికలమీద, బుల్లి తెరలమీదా వచ్చీరానీ మాటల వయసులో ముద్దులు కురిపించే చిన్నారులు గానకోకిలలై రాగాలు తీస్తుంటే ఆబాలగోపాలమూ పరవశిస్తుంది.

      వివిధ కార్యక్రమాల కోసం, పోటీల కోసం రేయింబవళ్ళు శ్రమించి సంగీత సామ్రాట్టులు, సినీ విరాట్టుల్ని సైతం అబ్బురపరచి వారి మన్ననలనందుకుంటున్నారు నేటి తరం చిన్నారులు.

     కారణాలు ఏవైనా ఏ రోజుల్లో సంగీతం నేర్చుకునే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంగీతాన్ని కేవలం ఒక కళగా నేర్చుకుని ఆస్వాదించి కచేరీలు ఇచ్చే వారికంటే దాని ఆధారంగా సినీ పరిశ్రమకి చేరువై నిలదొక్కుకోవాలని ఆరాటపడేవారి సంఖ్య బాగా పెరుగుతోంది.

        వివిధ ఛానెళ్ళు నిర్వహించే పోటీలకోసం తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తమ పిల్లల్నితయారుచేస్తున్నారు. ఇందుకోసం ముందస్తుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. నియమబద్ధంగా సంగీతం తరగతులను ఏర్పాటు చేసి అటు సంప్రదాయ సంగీతంతో పాటు ఇటు లలిత సంగీతం ,సినీ గీతాలను అతి తక్కువ సమయంలో పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తున్నారు.

       ఈ రోజుల్లో టీ.వీ. షోల్లో ఎన్నో పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్న చిన్నారుల ప్రతిభ వెనుక కనిపించని తపన, శ్రమ . ఒత్తిడి ఉన్నాయన్నమాట తెలిసిందే. ఇందుకోసం ముక్కుపచ్చలారని వయసులో పిల్లలు పడుతున్న యాతన అంతాఇంతా కాదు. హాయిగా ఆడుతూ పాడుతూ నచ్చినట్టు విహరించాల్సిన వయస్సులో ఒక ప్రక్క చదువుల హోరు, మరో ప్రక్క కాంపిటేషన్ల జోరు. దేన్లోనూ వెనుకబడటానికి వీలులేదు.

           మనసున్నా లేకున్నా మనసుపెట్టి తీరాల్సిందే. లేకపోతే చీవాట్లు తప్పవు.

          బాగా పాడావు అన్న మెచ్చుకోలుతెచ్చే ఆనందం కన్నా ఎందుకంత కంగారు పడ్డావు ? పోటీకి ముందు బాగానే పాడావు కదా! ఇలా చేస్తే నువ్వడిగింది కొనిపెట్టను అంటూ ఇచ్చే పెద్దల హెచ్చరికలు పిల్లల మనసుల్ని గాయపరుస్తున్నాయి.

         అంత కష్టపడి నేర్చుకొని ప్రైజులు సాధించినా చిన్నప్పుడు ప్రోత్సహించిన తల్లిదండ్రులే 15, 16 ఏళ్ళు వచ్చే నాటికి ఒక్కసారిగా పోటీలు,పాటలు బంద్ అనీ ఎమ్సెట్టు ,ఐఐటీ అంటూ దారి మళ్ళించుకోమంటారు.ఒక్కసారిగా కొత్త తరహా పోటీలో కొత్త పాఠాలు మనసుకి  ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఊరటని ఇచ్చే అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పడ్డ మానసిక సంఘర్షణ వల్ల అటు చదువులోనూ ఇటు నేర్చుకున్న కళలోనూ ఎటూ నెగ్గుకురాలేక రెంటికీ చెడ్డ రేవడులయ్యే పరిస్థితి తలెత్తుతోంది. చిన్న  చిన్న పిల్లలతో ఎలాంటి పాటలనైనా పాడించటం , పాటలోని మాటలకు అర్థం తెలియని వాళ్ళు నిలువెత్తూ పరవశిస్తూ లయబద్ధంగా ఊగిపోతూ లీనమైపోవటం పెద్దల్ని ఆందో ళనకి గురిచేస్తున్నాయి.

            అభ్యంతరకర పదజాలాన్ని, దూషణల్ని కూడా పాటలుగా మారుస్తున్న నేటి రచయితలు కొందరు ఆమాటలు పిల్లల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూఫుతాయన్న విషయం గ్రహించాలి. దుమ్ము లాగినట్తుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్ట్టుందే లాంటి పదజాలం పిల్లల్లో అయాపనులు హీరోయిజానికి చిహ్నాలుగా చెరగని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు.

             ఈ తరం దురదృష్టమో లేక కొత్త సంగీత దర్శకుల అదృష్టమో ఏమైనా సరే మంచి సాహిత్యమున్న పాటలకంటే లేని పాటలకే చక్కటి మ్యూజిక్ కంపోజిషన్ కుదురుతుంది. అందువల్ల ఈ రోజుల్లో వస్తున్న ఐటమ్ సాంగ్స్ పాడాటానికి పిల్లలు ఏ మాత్రమూ సంకోచించటం లేదు. ఆయా పాటల ప్రభావం భవిష్యత్తులోనూ , ప్రస్తుత ప్రవర్తనలోనూ ఉంటుందన్న విషయాన్ని సభ్యసమాజం హెచ్చరిస్తూనే ఉన్నా లక్ష్యపెట్టకపోవటం విచారించవలసిన విషయం.

       ఇవన్నీ నేను కొత్తగా ఛేదించిన కోణాలు కాదు, నేను మాత్రమే ఆవిష్కరించిన అక్షర సత్యాలూ కాదు.

     మీలాగే రెండుకళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్న మామూలు మనిషిగా కళ్ళముందు నడుస్తోన్నఅయోమయ ప్రపంచాన్నిమార్చలేని అసహాయత అనే బూజు దులిపి నిరాశల నిశీధిలో  పట్టుదల  అనే ఓ  ఆశాదీపాన్ని పట్టుకొని అడుగడుగునా నాదారికి అడ్దుతగిలి నన్ను బంధించాలనుకునే ముళ్ళకంచెలను నెమ్మదిగా దాటుకుంటూ , ప్రోత్సాహమనే ఊపిరితో ప్రాణం నిలుపుకుంటూ నా తల్లిదండ్రులు నన్నో చెత్తబుట్టలోని సరుకుగా తలచి చింతించకూడదని ఈ సువిశాల ప్రపంచంలో నాకంటూ ఓచిన్న స్థానాన్ని సంపాదించే దిశగా సాగిపోతున్నాను.

           నా బాట మీకు నచ్చితే  అభినందించలేకున్నా ఆశీర్వదించండి. నాదారి సరికాదని మీకనిపిస్తే నిర్మొహమాటంగా సూచించండి .....ఆలోచిస్తాను. అవసరమనిపిస్తే నన్ను నేను మలచుకుంటాను.

20 డిసెం, 2008

Swami Vivekananda _ A symbol of Confidence

స్వామి వివేకానంద భారతదేశ చరిత్రలో

ధృఢ చిత్తానికి, చెక్కుచెదరని విశ్వాసానికి అన్ని కాలాలకు చూపగల ఒకే ఒక ఆదర్శ రూపం.

 

ఎన్ని వర్క్ షాపుల్లో శిక్షణ పొందినా రాని ఆత్మ విశ్వాసం , ఉత్తేజం వివేకానంద సాహిత్యం చదివితే  చాలు మన సొంతం అవుతుందన్న మాట అక్షర సత్యం.

ఈ రోజు ఒక సమావేశంలో వివేకానందుని గురించి తెలుసుకున్న

విషయాలు.

వివేకానంద అమృతవాక్కులు.

 

 • బానిస భావాలకి స్వస్తి చెప్పు . నీకు నువ్వే యజమానివన్న సత్యాన్ని గుర్తెరుగు.
 • దేశంలో ఉన్న ఉన్నత మేధస్సులో అతి తక్కువ శాతం మాత్రమే వినియోగంలో ఉంది.మేధో మధనం చెయ్యాలి.
 • నాకు అనుచరునిగా మారమని  ఎవరినీ కోరను కానీ మనుషుల ఆలోచనా విధానం మారాలని బలంగా కోరతాను.
 • నీలోని ఙ్ఞాన భాండాగారాన్ని కదిలిస్తే అద్బుతాలు నీకు దాసోహమవుతాయి.
 • దేశ సంస్కృతి  గురించి గొప్పలు చెప్పుకోవటం కంటే పరిశీలించి , ఆచరించి అనుభావాన్ని పొందాలి.
 • ఆంతరంగికంగా ఉన్న పరిపూర్ణ శక్తుల ను బయటికి తెచ్చి, నడిపించేదే విద్య.
 • మతం లక్ష్యం భూమిపై   ప్రతిమనిషిలోనూ దైవత్వాన్ని స్థాపించటం  కానీ దైవత్వం సిద్ధించాలంటే ముందు మానవత్వాన్ని నిలుపుకోవాలి.
 • అయస్కాంతం ఇనుము కు ఆకర్షితం కాదు . ఇనుమే అయస్కాంత శక్తికి ఆకర్షించబడుతుంది.
 • నీ స్థితికి నువ్వే కారకుడివన్న సంగతి మరచిపోయి ఇతరులని నిందించకు.
 • శిల, శిల్పం రెండూ నువ్వే. నీ ప్రయత్నమే నిన్ను నీవు కోరుక్కున్నట్లుగా మలచుతుంది.
 • తమ దగ్గరి మకరందం గ్రోలమని ఏ పుష్పమూ తేనెటీగని ఆహ్వానించదు. అలాగే నువ్వు శక్తిమంతుడవన్న నిజం ఎవ్వరికీ చెప్పుకో వాల్సిన పనిలేదు. నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తే సమాజమే నిన్ను గుర్తిస్తుంది.

రెక్కలు

పెదవి దాటాక
నీ మాటలే
నీపై తిరుగుబాటు
చెయ్యగలవు
 
 
జాగ్రత్తగా ప్రయోగించాలి
ఆయుధాల్ని
 
------------------------------------
 
అంతస్థుల్లో
బందీలకి
స్నేహమంటే
స్వార్థం
 
ఆగర్భ దారిద్ర్యం
స్నేహితులు లేకపోవటం
 
 
-----------------------------------
 
 
ఆదిలో
ఆరాటం
ఆతర్వాత
తిరస్కారం
 
 
కలకాలం సాగవు
నకిలీ స్నేహాలు
 
-----------------------------------
 
కోరుకున్నవన్నీ
దక్కవు
ప్రాప్తమున్నవేవీ
ఆగవు.
 
నీపాలిట కల్పవృక్షం
ధీమా !
 
---------------------------------
 
 
చప్పట్లు
సత్కారాలు
రావాలి
మనస్పూర్తిగా
 
బలవంతంగా వచ్చేవి
బలిపశువులు
 
 
-----------------------------

19 డిసెం, 2008

నేనింతే !

నలుగురికోసం

బ్రతుకుతాను

నన్ను నన్నుగా

బ్రతికించుకుంటాను

 

మంచిదనిపిస్తే

ముందడుగు వేస్తాను

కాదనుకుంటే్

దేవుడినైనా ఎదిరిస్తాను

 

 

బద్ధకాన్ని చూసి

అసహ్యించుకుంటాను

నాన్చుడు తత్వమంటే

నొచ్చుకుంటాను

 

 

 

చప్పుడు చేసే చప్పట్లంటే

భయపడతాను

కన్నీటిని తుడిచే చేతులకి

సలాం కొడతాను

 

 

మనసారా మెచ్చుకుంటే

శిరసు వంచి నమస్కరిస్తాను

వెన్నుతట్టి దారి చూపేవారికి

జేజేలు పలుకుతాను, జోహార్లర్పిస్తాను

 

 

వింతలోకంలో పుట్టిన అరుదైన జీవిని .....

అస్తమానం ఆలోచనల తీరాలలో విహరిస్తూంటాను....

                                                                                            ..... . . . నేనింతే    !

18 డిసెం, 2008

Let Me Say.........

Water lilies

ఎందుకో ప్రపంచం

వింతగా తోస్తున్నది

 

దృష్టి లోపం లేకున్నా....

అంతా మసక మసకగా

గజిబిజిగా కన్పిస్తున్నది

అందమయిన కళ్ళు

చూసేవన్నీ నమ్మలేకపోతున్నాయి

చూసినకళ్ళు- చెప్పేందుకు

నోరులేక కుళ్ళుకుంటున్నాయి.......

 

 

చెప్పగలిగిన పెదాలేమో

కళ్ళులేవని నొచ్చుకుంటున్నాయి

మనసులోని మాటలు

పెదాలని దాటి రానంటూ

దోబూచులాడుతున్నాయి....

 

 

అన్నీ వినే గడుసరి చెవులు

కళ్ళ చాటునుండి చిత్రాలు

విచిత్రాలు  చూసి

విపరీతాలు వినీ వినీ

దద్దరిల్లి మొద్దుబారిపోయాయి........

 

ఇన్నిటికీ మూలమైన గుండె

అన్ని భావాల్ని అందుకొని

దేనిచేతా బుద్ధిగా పనిచేయించలేక ,

చెప్పుకొనే దిక్కులేక

లబ్బుడబ్బు మంటూ

ఒంటరి పోరాటం సాగిస్తోంది...

 

 

 

బదులులేని ప్రశ్నలు ప్రతిక్షణం

కుప్పలు కుప్పలుగా

పుట్టుకొస్తుంటే ........

గుండెబరువు పెంచేస్తుంటే....

నోరువిప్పలేక, ఏమీ చెప్పలేక

కొట్టుమిట్టాడుతోంది మూగ మనసు

 

 

లోలోని స్థైర్యం ఆపద్బాంధవునిలా

ముందుకొచ్చి,

హృదయపు ఆవేదన ఆలకించి

’ఉందిలే మంచికాలం

ముందుముందునా’ అంటూ

భరోసా ఇస్తున్నా..... ......

ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు..

 

కాలం చెప్పే సమాధానం కోసం

వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను

నన్ను నేను కొత్త కోణంలో

ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాను

ఏది ఏమైనా నానైజాన్ని

కొనసాగించుకోవాలనుకుంటున్నాను.........

16 డిసెం, 2008

నాకు నచ్చిన మాటలు

 • నిద్రలో వచ్చేవి కలలు కావు నిద్రలేకుండా చేసేవే అసలైన కలలు
 •  
 • అనుకుంటే ప్రతిరోజూ ప్రత్యేకమైనదే ఆస్వాదిస్తే ప్రతిక్షణమూ మధురమైనదే
 •  
 • చూడగలిగితే ప్రతివ్యక్తిలోనూ వైవిధ్యం పొందగలిగితే జీవితం అద్భుతాల సమాహారం
 •  
 • అందమైన ప్రకృతిని సృష్టించిన దేవుడే అయోమయంలో వింతజంతువుల్ని సృష్టిస్తాడు నరమానవుల మధ్య నున్న కౄరజీవుల్నుండి నారాయణుడు కూడా రక్షణ కల్పించలేడేమో కదా !

15 డిసెం, 2008

Be What U R

 

This is the message I got from my friend.As I feel these are the golden words I put them here. Go ahead....

Be understanding to your perceived enemies.

 • Be loyal to your friends.

 • Be strong enough to face the world each day.

 • Be weak enough to know you cannot do everything alone.

 • Be generous to those who need your help.

 

 

 

 

 • Be frugal with that you need yourself.

 • Be wise enough to know that you do not know everything.

 • Be foolish enough to believe in miracles.

 • Be willing to share your joys.

 • Be willing to share the sorrows of others.

 

 

 • Be a leader when you see a path others have missed.

 • Be a follower when you are shrouded by the mists of uncertainty.

 • Be first to congratulate an opponent who succeeds.

 • Be last to criticize a colleague who fails.

 • Be sure where your next step will fall, so that you will not tumble.

 

 

 

 • Be sure of your final destination, in case you are going the wrong way.

 • Be loving to those who love you..

 • Be loving to those who do not love you; they may change.

 • Above all, Be yourself.

14 డిసెం, 2008

నా దారి.........

ఆశావాదినైన నేను

వినీలాకాశంలో విహంగాలని చూస్తూ

అద్భుతాల్ని అందుకోవాలని

గగనాన్నిఅధిరోహించాలని.........

నేల నుండి నింగికి పయనమయ్యాను

వెర్రికి వెనకాముందులేదా

అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే

నెమ్మదిగా నీళ్లు తాగమని

మరి కొందరు నా మేలుకోరి

చల్లని సలహాలిస్తుంటే ........

నాదారి పూలబాట కాదని తెలిసినా

గోదారినై ఎత్తు పల్లాలని దాటి సాగాలని ............

నాఅడుగుల వెంబడి

సుమాలు పుష్పించాలని .........

వాటిపై కొత్త దారులు కనిపించాలని.........

ఆ దారుల్లో కొత్త తరాలు

నూతనోత్తేజంతో దూసుకెళ్లాలని..........

నిరంతరం తపిస్తున్నాను

ప్రతిక్షణం గెలుపుకై ఆరాటపడుతూ

అప్పుడప్పుడూ అచేతనంగా నిలబడిపోతున్నాను

ఆ క్షణంలో........మసగబారిన

నా ఆలోచనా లోచనాలని సరిచేసి,

ఉత్సాహాన్ని ఊపిరిగా చేసి

నా బాట సాటి లేనిదంటూ....

నాలో నాపై ధీమాని కలిగించి

చెక్కు చెదరని విశ్వాసాన్ని ,

మొక్కవోని స్థైర్యాన్ని ప్రాణవాయువుగా ఇచ్చి.....

నేనెంచుకున్న రణరంగానికి

నన్ను సమాయత్తం చేసి

నా నుదుట విజయ తిలకం దిద్దే

నా నేస్తాలు భగవంతుడిచ్చిన

కోటానుకోట్ల వరాలు

దేవుడా ! నువ్వేమి ఇచ్చినా ఇవ్వలేకున్నా

నా ప్రాణాలనే నీపాదాల పై ఉంచి ప్రార్థిస్తున్నాను

ఉన్నత వ్యక్తిత్వాలని కోకొల్లలుగా

నాకు పరిచయం చెయ్యి

క్షణమొక పాఠంగా అంతులేని అనంత జ్‘నాన్ని గ్రోలి

అపారమైన విజ్నాన ఖని గా

దేదీప్యమానంగా వెలగాలని ఉంది

ఆ వెలుగు కలకాలం అందరికీ

పంచాలని ఉంది ఆరిపోయేదాకా........

నన్నర్థం చేసుకుంటే అది నా అదృష్టం

అపార్థం చేసుకుంటే అది నీ సృష్టిలోని లోపం !

12 డిసెం, 2008

ఏమిటీ గోల?

          పగలంతా పనులతో అలసిపోయి రాత్రి పదిగంటలకి అనుకోకుండా టి.వి. ముందు చిక్కాను. ఏదో  డాన్స్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ వస్తోంది. హుషారుగా ఉందికదా అని కాస్సేపు ఛానెల్ మార్చకుండా ఉంచి చూస్తున్నాను.

            చూడటం అంటే పూర్తిగా దానికే అంకితం అనుకునేరు. అంతసీన్ లేదు ఆ కార్యక్రమానికి.అసలే కార్యక్రమానికుంది కనక. ఎప్పుడు చూసినా చెత్త సీరియల్స్, సుత్తిగోల.....సిస్టం ముందు కూర్చుని నా వర్క్ చేసుకుంటూనే  మ్యూజిక్ మీద , డాన్స్ మీద మమకారం వదలుకోలేక  మధ్య మధ్యలో ఓ చూపేస్తున్నాను. ఎగురుతున్నారు, గెంతుతున్నారు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ. ఎంతైనా డాన్స్ పోటీ కదా !

saakshi1 057

         saakshi1 037

                         saakshi1 056

 

    ఆ మాతల్లి యాంకర్ ఒకతి పూనకం వచ్చినట్టు తెగ ఊగిపోతోంది.ఒక్కో పాట అవ్వగానే మళ్ళీ దానిపైన మొదటి నుండీ వివరణ ఒకటి. అరిగిపోయిన రీల్ లాగా......అబ్బో ఆ మాస్టర్లేమిటో వాళ్ళ వేషాలేమిటో .........అన్నీ ఆలోచిస్తే ఉన్న చిన్న బుర్ర కాస్తా చితికిపోతుంది.

     కాలో ,చెయ్యో లేకున్నా ఏ వికలాంగుల కోటాలోనో ఎక్కడోచోట ఉద్యోగం చెయ్యొచ్చు గానీ మరీ బుర్రలేకపోతే ఎవరు ఉద్యోగం ఇస్తారు చెప్పండి? అందుకే వాళ్ళ చావు వాళ్ళు చస్తారులే అనుకుని పట్టించుకోకుండా పాటలు వింటూ పనిచేసుకుంటున్నాను.

         సందడి గా సాగే కార్యక్రమంలో ఏదో అపశ్రుతి వినిపించి ఏమిటాని చూశాను.ఒక్కసారి ఒళ్ళుమండింది. మీరేమనుకోనంటే ఓ మాట. లాగిపేట్టి రెండు పీకాలనిపించింది ఆ ప్రోగ్రాం ఎడిటర్ని, యాంకర్ని.......

                    కారణం ఏమిటో ? అబ్బ ఇంతకీ ఏమైంది? ఇందాకటి దాకా బానే ఉన్నారుగా .....అనుకుంటూ నా పని ఆపి కాసేపు చూస్తే అప్పుడర్థమయింది. ఇంకేముంది ఏదో  జడ్జిమెంటు ను గురించి తన్నుకు ఛస్తున్నారు. అంతకు ముందు జడ్జీల కాళ్లకి మొక్కిన  వాళ్ళే  అకస్మాత్తుగా జడ్జీలపై నోళ్ళేసుకుని పోట్ల్లా డటం పనికిమాలిన రాద్దాంతం  చెయ్యడం పైగా దానికి ఓ కవరేజీ .ఎందుకొచ్చిన గోల కానీ కట్టేద్దామని అనుకుంటే ఈలోపు జడ్జీల అలుకలు.

ఛఛా ఛా వెధవ గోల...అనవసరంగా టి.వి. పెట్టి తలనొప్పి తెచ్చుకున్నానేమో అనిపించింది

మొత్తానికి జడ్జీలకేమయిందో గానీ విసుక్కుని గుడ్బాయ్ చెప్పేసి షో మధ్య లోనే తుర్రుమన్నారు. ఇక మన యాంకరమ్మ మాత్రం చాలా నిదానంగా చెప్తోంది...........

"ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఊంది. ఈ వేడి చల్లా రంలంటే , మరో వారం రోజులు ఆగాల్సిందే" యెంకమ్మ ముగింపు.

అంతటితో ఆగితేనా ? వాళ్ళేలా తిట్టుకుంటున్నారో ఎలా వాదించుకుంటున్నారో సీన్స్ చూపిస్తున్నారు.

            ధగ ధగ మెరుపులు, మ్యూజిక్ బాజాల మధ్య ఎంతో అట్టహాసంగా ప్రారంభమవుతున్న రియాల్టీ షోలు ఈ మధ్య జనాల్ని ఆకట్టుకోవానులనుకునో తాపత్రయంతో  విసుగుతెప్పించే ఉద్వేగాలని , అనవసరమైన హావ భావాలని చూపుతూ ప్రేక్షకుల సహనాన్నిపరీక్షిస్తున్నాయి.

 

        అసలు ప్రేక్షకులంటే ఎవరు? వీళ్ళ అడ్డమయిన గోలాచూసి అయ్యయ్యో అంటూ సానుభూతి చూపుతారనా ? లేకపోతే ఇలాంటి కార్యక్రమాల కోసం వీళ్ళు పాపం ఇంత ఇదిగా కష్టపడిపోతున్నారని జాలిపడి ఆయా ఛానెళ్ళు విరగబడి చూస్తారనా ?

     బ్రహ్మాండంగా పాడినచిన్న చిన్నపిల్లలను పోటీల పేరుతో రెచ్చగొట్టి గెలవలేదని ఊరడించి   షో ఎఫెక్ట్స్ కోసం ఏడిపించి ....

రెండుమూడు రోజుల ముందునుంచీ పబ్లిసిటీ.....చిన్నారి ఎందుకేడ్చిందో తెలుసుకోవాలంటే తప్పక చూడండి...అంటూ.

       ఇంతకీ నాదో చిన్న  అనుమానం. నేనొక్క దాన్నే అలాంటి కార్యక్రమాలు చూస్తున్నానా అని . లేకపోతే ఎవ్వరికి లేని గోల నాకెందుకు ?

 

          సర్లెండి ఎప్పటికైనా మీకూ విసుగురాకపోతుందా? కాదు కాదు వాళ్లు ( టీ.వీ.వాళ్ళు) మీకు విసుగుతెప్పించకపోతారా?

 

          మీరూ నాలా స్పందించకపోతారా? 

నేను మిమ్మల్ని శభాష్ అనకపోతానా?

11 డిసెం, 2008

రెక్కలు

వేలాది సైన్యం ఓ ప్రక్క తోడుగా నేస్తం మరోప్రక్క

సైన్యం వెనుదిరిగినా స్నేహం నిన్ను వీడదు....................................

-----------------------------------------------------------------

స్నేహితుడే అయినా చెయ్యి చాచకు

నీ ’ఇన్ ’ధనం ఆత్మాభిమానం

........................................ ౨.

--------------------------------------------------------------------------------------------

నీలో తాను తనలో నీవు మనుషులిద్దరు ఆలోచన ఒక్కటి

ఒకే దారిలో పయనిస్తుంది నిజమైన స్నేహం................................3

-----------------------------------------------------------------------

చెయ్యిచాపటం సులువు స్నేహం నిలుపుకోవటం కష్టం

అవాంతరాల్ని అధిగమించేదే అసలైన స్నేహం...............................౪.

-------------------------------------------------------------------------

చెడుకు చేరువవ్వటం మంచికి దూరమవ్వటం

పూడ్చలేని అగాథాలు...............................................౫.

-----------------------------------------------------------------------------------------

కొనుక్కున్న సన్మానాలు అనవసరపు ఆర్భాటాలు

ఖాళీ డబ్బాలో రాళ్ళమోతలు............................౬.

----------------------------------------------------------------------------

తియ్యగా మాట్లాడుతూ చుట్టుకుంటాయి ఎన్నెన్నో బంధాలు

ఇందరిలో నీ వారెందరో ?.....................................౭.

------------------------------------------------------------------------

స్వప్నాలకి చిరునామా విశ్రాంతికి వీలునామా

ఖర్చులేని రీచార్జ్ నిద్ర....................................................౮.

----------------------------------------------------------------------------

దాస్తే దాగదు ప్రతి కదలికా బైటపడేస్తుంది

ఛీత్కారాలు, జేజేలు వ్యక్తిత్వానికే...............................౯.

-----------------------------------------------------------------------------

నీ పై నీకు నమ్మకాన్ని గౌరవాన్ని నాటినవాడు

కల్పతరువు గురువు.......................................౧౦.