Pages

నవదుర్గలు.. దసరా వైభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవదుర్గలు.. దసరా వైభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24 సెప్టెం, 2009

సలలితముగ మాయమ్మ శ్రీలలితమాతయై… అరుదెంచెనే భువికి ఈ వేళ ...

Durgamma..5

శ్రీలలితా ! శివ జ్యోతి సర్వ కామదా !

శ్రీగిరి నిలయా ! నిరామయా ! సర్వమంగళా !

 

 

 

అలివేణి కన్నులు కలువరేకుల్లు

విరిబోణి కురులు నీలాల ఝరులు

మారాణి  చూపులు పండువెన్నెలలు… !

 

త్రిశూల ధారిణి్వై శ్రీలలిత మాతవై

శరన్నవరాత్రులలో అల్లనల్లన మముచేర వచ్చి

కొలువుతీరిన మా ఇలవేలుపువీవె శ్రీమన్మహారాఙ్ఞి ! !

 

కుంకుమ పూజలకు మురిసేవు

ముదమార   పసుపును మోముపై పులిమేవు

త్రిశూల ధారిణివై  , దీనజనోద్ధరిణివై ఇల అవతరించేవు !

 

పాపాల తొలగించు పావన గంగవై

కమనీయ కావ్యాల వరాల గోదావరివై

కరుణించి కాపాడు కృష్ణాతరంగానివై

పలుకుతేనెల తల్లి పెన్నా ప్రవాహానివై

చల్లని దీవెనలిడు వెన్నెల కావేరివై

అభయహస్తంబుతో దర్శనమిచ్చు తుంగభద్రమ్మవై

పాశాంకుశ పుష్పబాణ చాప హస్త వై

నీ క్రీగంటి చూపుకై పరితపించే త్రిమూర్తులను

మరచి మమ్ము బ్రోవగ వచ్చితివా శ్రీచక్ర రాజ నిలయా

శ్రీలలితా  మహాత్రిపురసుందరీ పరదేవతా !

నమస్త్రే ! నమస్తే ! నమస్తే ! నమః

 

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి

శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి !

 

కళ్యాణి ! కాత్యాయనీ ! కనకదుర్గా ! కామేశ్వరీ !

కాలహంత్రీ ! పాహిమాం ! పాహిమాం !       పాహి !పాహి !

 

 july...2 039

23 సెప్టెం, 2009

వేద స్వరూపిణి శక్తి దాయినీ గాయత్రీ మాతా జయహో !

Sri Gayathri Devi

ఓం భూర్భువస్సువః తత్సద్విదుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !

 

ప్రణతులు లివే ప్రాణదాత్రీ ! శ్రీ గాయత్రీ !

పరిపాలించవే పరదేవతా ! దీవించవే దాక్షాయణీ !

 

ప్రణవ స్వరూపిణియై పంచవర్ణములతో

పంచముఖి గా ప్రభవించిన  పరమేశ్వరి !

పంచభూతములు ప్రణతులు చేయ

పంచాగ్నుల పవిత్ర హారతులు గైకొనుచు

ఇంద్రకీలాద్రి పై  మము కరుణించి కావగ వేంచేసినావమ్మా !

 

గాయత్రి, సావిత్రి , సరస్వతివై త్రిసంధ్యలలో 

త్రిమూర్త్యాత్మకంగా దర్శనమిచ్చే పరంధాత్రి

నవరాత్రి పూజలందుకొనగ నిండుగ దసరా నాలుగవనాడు

మా కన్నుల పండుగ చేయుచు అల్లపుగారెలు అందుకుని

బుద్ధి దాయనివై శక్తి ప్రదాయనివై నీదు కరుణాకటాక్షవీక్షణముల వర్షించుమమ్మా!

 

 

జై శ్రీ గాయత్రీ మాతకీ జై !

21 సెప్టెం, 2009

ప్రాణ శక్తి , ప్రేమమూర్తి …. అన్నపూర్ణాదేవీ నిను అర్చింతుమమ్మా!

Sri Annapurna Devi

 

’ అన్నపూర్ణే సదాపూర్ణే  శంకర ప్రాణ వల్లభే !

  ఙ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి ! ’

 

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయికవై

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణగ అవతరించి

అక్షయపాత్రతో ఆకలిదప్పులు తీర్చి

జీవకోటికి ప్రాణ భిక్ష పెట్టే మాతృస్వరూపిణీ ! అన్నపూర్ణమ్మా !

అన్నదానమనే మహాదానమును చేసిన

నీ అమృతమయ హస్తాల సాక్షిగా

లోకాన క్షామమును తొలగించి

మమ్ము కరుణించి దీవించి

అక్ష్రరము, అనంతమైన ఙ్ఞానములనీయగ తరలివచ్చినావా? అన్నపూర్ణమ్మా!

 

 

స్థిరమైన బుద్ది, సత్ప్రవర్తన, సచ్చీలత, ధార్మికత,

సద్వాణి సదా మాకు ప్రసాదించి దీవించవమ్మా !

తెల్లని పుష్పాల పూజింపబడే జగజ్జననీ !

దధ్యన్నం కట్టెపొంగలులు అందుకొని

ప్రేమతో మా తప్పులను మన్నించుమమ్మా !

 

అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మా !

మా మనవి ఆలించి మముబ్రోవుమమ్మా !

బంగరు తల్లీ ! బాలా త్రిపురసుందరీ.. !

Sri Bala Tripura Sundari

 

 

బంగరు తల్లీ ! బాలా త్రిపురసుందరీ !

భక్తుల కోర్కెలీడేర్చంగ .. బాలా మణివై

భవభయ హారిణి దురిత విమోచని భవానీ

ప్రాభవంబుగను నీ బిడ్డలకు మోదమందించుటకై

దసరా శుభపర్వదినములలోన శోభాయమానమైన

రెండవదినమున మా గుండెలు నిండగ కన్నుల పండుగ జేసికొనగ

మనోబుద్ధ్యహంకార చిత్తాలకధి దేవతవై అక్షరమాల ను చేబూని

షోడశ విద్యలధినాయకురాలివై అక్షమాల ధరించి

నిత్యసంతోష ప్రదాత్రివై ప్రేమతో మేము పెట్టే పాయసానికై

పాయసాన్న ప్రియవై అరుదెంచావా తల్లీ !

 

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమ:

20 సెప్టెం, 2009

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

Kanakadurgamma

 

 

 

వైభవంబుగ దసరా వచ్చినది

శరన్నవరాత్రుల సంరంభములకై

విజయవాటిక వేదికయైనది

వాడ వాడలా ఆనంద కర్పూర నీరాజనాలతో

భక్త జనావళి గొంతెత్తి పిలువగా

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవియై

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

తొలిరోజు కన్నుల పండుగ చేసింది

ధగధగద్ధాయమానమైన ముకుపుటక ను ధరించి

కదలి వచ్చిన కనకదుర్గమ్మ పసిడి చాయ మోముపై

పండువెన్నెల చిరునవ్వులు చిందిస్తూ

ఆబాల గోపాలాన్ని చల్లని చూపులతో దీవించింది

సింహ వాహనా రూఢియై శంఖు , చక్ర , గదా, శూల ,

పాశ, మహా ఖడ్గ , పరిఘాది ఆయుధాలతో శక్తి స్వరూపిణియై

అవతరించి అన్యాయాన్ని, అధర్మాన్ని అంతం చేస్తానని విజృంభించింది

పులిహోర ప్రసాదంతో ప్రసన్నురాలై , పసుపు అక్షతలు, పూలతో పూజలందుకుని

సుదూర తీరాల చేర వచ్చిన బిడ్డలను ప్రేమతో సాదరంగా మందస్మితయై పలకరించింది.

 

కనకదుర్గమ్మా ! అమ్మా కనికరించమ్మా!………..