Pages

నివాళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నివాళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18 మార్చి, 2009

నేస్తమా ! ........... నా ప్రశ్నకి బదులు చెప్పవా ?..

తప్పు చేశావు నేస్తం తిరిగిరాని లోకాలకు పోయి దిద్దుకోలేని తప్పుచేశావు ! నువ్వు కడుపున పడ్డావని పండగ చేసుకున్న అనురాగపు జంట
బంగారు కలల పై
నిప్పుకణికలు చల్లి .............తప్పుచేశావు నేస్తం !
నవమాసాలు మోస్తూ
ఎప్పుడెప్పుడు నిన్ను కళ్ళారా చూస్తానా అని
ప్రతిక్షణం ఆరాటపడ్డ పిచ్చితల్లి
కళ్ళకు కన్నీటి కుండల్ని
కానుకలుగా ఇచ్చి......... తప్పు చేశావు నేస్తం !
గుండెలపై అడుగులేయించి
నడకలు నేర్పిన తండ్రిని
అరచేతుల్లో పెంచి ,
కనురెప్పగా కాచిన పాపానికి
వెన్నుపోటు పొడిచావు
బ్రతుకు భారం చేశావు ... తప్పు చేశావు నేస్తం !
నూరేళ్ళ జీవితాన్ని
నేలపాలు చేశావు
నీకై మేమున్నామంటూ
భరోసా ఇచ్చిన మిత్రుల్ని
చేతకాని వాళ్ళని చేశావు ... తప్పు చేశావు నేస్తం !
నిప్పురవ్వకే
విలవిల లాడే
సుకుమార దేహాన్ని
పొగలు సెగలతో
అగ్నికి ఆహుతి చేశావు...... తప్పు చేశావు నేస్తం !
గారాల పట్టిగా
ఎన్నో కళ్ళు ఎదురు చూడగా
ఏడుస్తూ వచ్చావు
నిర్దయురాలిగా
ఇన్ని కళ్ళని మాయ చేసి
ఏడ్పిస్తూ వెళ్ళావు................. తప్పు చేశావు నేస్తం !
చావడానికి చూపిన సాహసం
బ్రతకడానికి చేయలేదెందుకని ?.............
కన్నీటి సంద్రంలో మమ్మల్ని ముంచి
ఎక్కడున్నావో ... ఏం చేస్తున్నావో.....
నా ప్రశ్నకు బదులివ్వు నేస్తం................
నా ప్రశ్నకు బదులివ్వు......!