నిన్న మిట్ట మధ్యాహ్నం మండుటెండ. నేషనల్ హై వే మీద మంచి సెంటర్లో రద్దీ బాగా ఉన్న ఆంజనేయస్వామి గుడిపక్క ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అతన్ని దాటుకుంటూ కొందరు , నిట్టూరుస్తూ కొందరు, పట్టీ పట్టనట్టుగా పట్తించుకోకుండా పోయేవాళ్ళు కొందరు.
అరె కళ్లముందు ఒక మనిషి స్పృహ లేకుండా నడిరోడ్డుపై పడిఉంటే .. అసలేమీ స్పందన లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇక ఉండబట్టలేక పక్క వాళ్ళని అడిగితే .. వాళ్ళు అతన్ని తిట్టటం మొదలెట్టారు. "తిన్నది అరక్క పీకల్దాకా తాగి రోడ్డు మీద పడ్డాడంటూ.." . తాగుడు ని అసహ్యించుకోవచ్చు. తాగిన వాడ్ని అసహ్యించుకోవచ్చు. కానీ తాగిన మత్తులో దీనంగా చెత్త చెదారం, మురికి మీద పడి ఉన్న మనిషిని చూసి కనీసం అక్కడినుండి కాస్త పక్కకు జరపాలని కూడా ఎందుకు అనిపించదు వీళ్ళకి అనుకున్నాను. వాళ్ళని వీళ్ళని అడగటం మొదలు పెట్టాను. బాబూ ఎవరైనా కాస్త అతన్ని పక్కకి నీడకి లాగండి. ఎండకి చచ్చి పోతాడు . "అంటూ పక్కన నా సహోద్యోగి నా కోసం ఎదురు చూసీ చూసీ నాపై అసహనం వ్యక్తం చేశారు. నీకు అంత ఆవేదన అవసరమా? అతను కావాలని చేసుకున్నదానికి అంత జాలిపడనవసరం లెదంటూ....

ఏమో ! ఎవరి మాటలూ నా చెవికెక్కటం లేదు. ఎలా ? ఏం చెయ్యాలి? చూస్తూ చూస్తూ అతన్ని అలా వదిలి వెళ్ళాలనిపించలేదు. ఏమైనా సరే అనుకుంటూ .. ఒకరిద్దరిని అడిగాను. పక్కనే గుడిలోనున్న ఇద్దరిని అడిగి చూశా పాపం వాళ్ళకి అతనిపై కంటే నాపై జాలి వేసిందో ఏమో అతన్ని తిడుతూ నా గోల పడలెక వచ్చారు. మొత్తానికి ఈడ్చి ఈడ్చి అతన్ని గుడి వెనుకనున్న నీడలోకి లాగారు. హమ్మయ్య అనుకుంటూ .. చల్ల బడ్డ కళ్ళతో బస్టాప్ కి పరుగుతీసాను. నేను చేసిన పనిని తల్చుకుని ఎంతో తృప్తితో ఇంటికొచ్చి మితృలకి విషయం చెబితే ... విచిత్రం . వాళ్ళు ఒక నవ్వు నవ్వి.. తాగిన వాళ్ళు ఎండలో ఉన్నా చచ్చిపోరు. అని నా అమాయకత్వానికి ఓ చిన్న చురక వేశారు. ఒక్క క్షణం కళ్ళు మూసి మళ్ళి అనుకున్నాను. లేదు నేను చేసింది సరిఅయినదే. ప్రాణం పోదుకదా అని మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అక్కడ ఆ స్థితిలో ఉంటే వదిలేస్తామా? చెప్పండి? ఇంతా మీకు చెప్పింది.. నన్ను మెచ్చుకోమని కాదు. ఈ మాటలు గుర్తుంచుకుని సాటి మనిషి అసహాయస్థితిలో ఉన్నప్పుడు స్పందించమని. దయచేసి ప్రాణాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనుషులు చేసిన తప్పులకు అతని ప్రాణాలు కాపాడి తర్వాత తగిన శిక్ష వెయ్యండి అంతే కానీ చిన్న తప్పుకి పెద్ద శిక్ష వెయ్యకండి. "To Err is Human , To Forgive is Divine" " తప్పు చేయటం మానవ సహజం. క్షమించటం దైవత్వం." నిజంగా మీకు మనసుంటే మీ జీవితంలో కనీసం ఒక్క వ్యక్తిని అతనికున్న వ్యసనాన్నుండి విముక్తుడ్ని చెయ్యండీ. మంచి మాటలతో....... నమస్కారం!
