Pages

కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12 ఆగ, 2013

బ్రహ్మమొక్కటే...


ప్రకృతికెంత కష్టమొచ్చింది?
పరిణామమెన్ని సమస్యల్ని తెస్తోంది?
ఏర్లు , వాగులు కట్టలు తెంచుకుంటున్నాయి
పచ్చని చెట్లన్నీ కొట్టుకుపోతున్నాయి
ఎన్నో ప్రాణాలు అల్లాడిపోతున్నాయి
గాంభీర్యపు సాగరాల లోలోపల అన్నీ అల్లకల్లోలాలే
అడుగడుగునా సుడిగుండాలే
పాపం సముద్రాలకెంత కష్టమొచ్చింది!
ఒళ్ళంతా ఉప్పదనం తప్ప
ఏడ్వటానికో చుక్కలేదు
సముద్రాలేడ్వలేక ఏడుస్తున్నాయి

28 సెప్టెం, 2010

పరుగో పరుగు…….

mother_tree_with_daffodils_and_shad

ఎప్పుడూ పరుగులే

ఎప్పుడూ ఉరుకులే

చంటోడి నుంచి

ముసళాళ్ల దాకా

అందరూ బిజీ… బిజీ…

ఎప్పుడు ఎవర్ని కదిపినా

“నేను చాలా బిజీ”

 

ఆయాసం రాని పరుగు

అలుపు లేని పరుగు

ఆలోచన లేని పరుగు

అర్థం లేని పరుగు

అందర్నీ దూరం చేసే పరుగు

 

కంటి నిండా కునుకు

తియ్యనివ్వని పరుగు

కడుపునిండా తృప్తిగా

తిననివ్వని పరుగు

ఎక్కడికో ఈ పరుగు

ఎందుకో ఈ పరుగు…..?

 

 

క్షణం నిలకడగా

నిలవనివ్వని పరుగు

అనుక్షణం ఆందోళన పరిచే పరుగు

అశాంతికి మూలమీ పరుగు…!

 

మీరూ పరుగు పందెంలో

పరుగెడుతున్నారా?

ఒక్కసారి ఆగి

పరిశీలించుకోండి…

మీకు తెలియకుండానే

మీరూ  అలసిపోయారు

ఆందోళన పరిచే

ఆలోచనల్ని ఓ క్షణం పాటు

బలవంతంగా  బంధించి

ప్రశాంతంగా

కనురెప్పలకి

ఓ చిన్ని జోల పాడి

ఉన్నచోటే్ హాయిగా మీ మనసును

విశ్రమించనివ్వండి

దుబుకు దుబుకున

అల్లాడే వెర్రి గుండెకి

కాస్త ఊరటనివ్వండి….

( మీకిష్టమైన అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ …….. కాస్సేపు రిలాక్స్… అవ్వండి…!)

25 అక్టో, 2009

ప్రతి అడుగూ ఓ ప్రశ్నే…

స్తొర్య్ ౩

 

 

ఎన్ని సాధించినా, ఎంత ఎదిగినా

అప్పుడప్పుడూ

నీలో ఒదగలేనంటుంది వెర్రి మనసు .

యాంత్రిక జీవనానికి పుట్టుబానిసవనీ

గుండెలేని భావాల గూడువౌతున్నావనీ

నిర్జీవంగా పడిఉన్న మనసు

అప్పుడప్పుడూ నిన్ను ధిక్కరిస్తుంది

మళ్ళీ నన్ను బతికించమంటూ

బ్రతిమాలుకుంటుంది

 

నిలకడలేని ఆలోచనలు

నిలబడలేని సిద్ధాంతాలమధ్య

మనసంతా అయోమయం ఆవరిస్తుంది.

ఉప్పెనలాంటి అసహనం పెల్లుబికి వస్తూ

ఉన్న ఒక్క నాలుకని

నియంత్రించుకోలేకపోతే,

తోచినట్టు దాన్ని ఆడనిస్తే

లెక్కలేనన్ని నాలుకలు ఒక్కసారిగా

ఎగబడి మీదపడి దాడి చేస్తాయి,

నిన్ను  మింగేస్తాయి

 

ప్రపంచాన్ని చూసేందుకు

నీకున్నది రెండే రెండుకళ్ళు

ఆ కళ్ళు మసకబారితే

దిక్కు తోచని  తరుణంలో

పొరపాటున దారితప్పితే పెడదారిన పడితే

ప్రతిక్షణం అదేపనిగా

నిన్ను పరిశీలించే ఎన్నెన్నో కళ్ళు

శూలాలై పొడిచేందుకు సిద్ధమౌతాయి.

 

flowers

 

అభిమానాలు అనుబంధాలు

అమృతప్రాయాలు

అన్ని రోగాలను శమింపజేసే ఔషథాలు

అనుక్షణం వాటిని వెంటపెట్టుకో

నీ ప్రయాణం లో తోడై వచ్చే బంధాలని

పవిత్రంగా కాపాడుకో

నిన్ను నువ్వుగా నిలబెట్టుకో

 

 

చూసే చూపు పలికే పలుకు

హృదంతరాలకి బదులిచ్చుకుంటూ

జాబిల్లి కురిపించే వెన్నెలలా

స్వచ్చమైన గంగా ప్రవాహంలా

సాగిపోతుంటే

విశాలమైన మనస్సాగర తీరాన

ప్రశాంత స్నేహ సౌథాన

వెలకట్టలేని కోకిల గానాలుగా

బంధాలు  ఆనందాలు

కలకాలపు కానుకలౌతాయనీ

ఎనలేని సంపదలౌతాయనీ గుర్తుపెట్టుకో….

నీ బాటను వెలుగుబాటగా మలచుకుంటూ

నీ వెలుగును ప్రపంచానికి పంచుకుంటూ ధైర్యంగా మునుముందుకు సాగిపో……….

24 జులై, 2009

మంచిదే… కానీ…

నోరు మంచిదైతే

ఊరు మంచిదౌతుంది

ఆలి మంచిదైతే

ఏమన్నా పడుంటుంది

ఆలి నోరు మూసుకునుంటే

ఊరు మెచ్చుకుంటుంది

కడుపుమండి తిరగబడితే

ఊరంతా ఒక్కటై కోడై కూసి

అభాగ్యురాలిని అయ్యగారి

సాయంతో  పెనం పై అట్టులా

తిరగా మరగా వేసి మరీ

కాల్చుకుని తింటుంది

పిచ్చిమాతల్లి…

తన్నినా తగలేసినా

గడపదాటనంటూ

అందరిమధ్యా

బిక్కుబిక్కు మంటూ

అనాధ గా మారినా

మా లచ్చమ్మ తల్లై

కంటిలో ఒత్తులేసుకుని

ఇంటి దీపమై కరిగిపోతుంది

జన్మ హక్కులు…..

అత్తగార్ని

ఆడిపోసుకోవటం

అల్లుడికి

కోడల్ని

సత్తాయించటం

అత్తగారికి

జన్మ హక్కులు

30 జూన్, 2009

ఏది నిజం? ఏది అభద్ధం ?

నిజాన్ని తోసుకుంటూ

అబద్ధం నాలుగడుగులు

ముందుకు దూసుకెళ్ళుతోంటే..

అబద్ధాని అసహ్యించుకుంటూ

నిజం నలభై అడుగులు వెనక్కి పోతోంది

ఏది నిజమో ఏది అభద్ధమో

అర్థం కాని అయోమయంలో

అమాయకుడు

నిజం చెప్పలేక

అబద్ధం చెప్పకుండా మనలేక

క్షణ క్షణ రణ రంగంలో

ఆయుథాలు కోల్పోయిన సైనికుడై

నిస్తేజుడై విస్తుపోయి చూస్తున్నాడు

ఏది గమ్యం?.. ఏమి గమనం?

జీవన పోరాటంలో బదులు లేని ప్రశ్నలు

నిలకడలేని సమాధానాలు

30 మార్చి, 2009

తెలుగువారి తొలిపండుగ

పసిపాప నవ్వులా
పచ్చిపాల నురువులా
సెలయేటి పరుగులా
పూలపై తుమ్మెద రొదలా........................
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
నిరాశల నిశీధిలో
స్వైర విహారం చేస్తున్నశిశిరాన్ని
ఋతువులనే బాణాలను సంధించి
కాలమనే కటకటాలలో బంధించి...........................
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
ఆశలవెల్లువలే అమృత ప్రవాహంగా
పిండారబోసిన పండువెన్నెలగా
తెలుగువారి వాకిళ్ల ముంగిళ్ళలో
ఆనందాల వెలుగులని కళ్ళాపి చల్లుతూ..........
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
గమ్య మెరుగని జీవన పయనంలో
అలుపులేని అనుదిన పోరాటానికి
పదపదమంటూ ఎదగదిలో
మదినదిలో అలజడి పుట్టిస్తూ....................
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
రమ్మనగానే రాని సంతోషాన్ని
పొమ్మనగానే పోని విచారాన్ని
పండుటాకులా నేలపాలయ్యే నిరాశని
కొంగొత్త ఆశల చివురుల్ని పూల పల్లకీలో మోసుకుంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
గెలుపులోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే
ఒక్కసారైనా ఓటమి పంచే చేదుని చవిచూడాల్సిందేనంటూ
సూరీని వెలుగు విలువ తెలియాలంటే
కాయపు కిటీకీ లనే గాజుగుడ్లకి
అంధకారపు మబ్బులు ముసరాల్సిందేనంటూ....................
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
ఎన్నికలు ఎందరికో
ఎన్నో కలల్ని కల్పించినా
గుప్పుగుప్పున తీర్చలేని
వాగ్దానాల వరాలు కురిపించినా
చెప్పేవారికి చేసేవారికి
మధ్యనున్న అంతరాన్ని
పసిగట్టి వారి పనిపట్టమంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
మమకారం కారం గా మారి
కడుపులో మంట రేపినా
అనురాగపుటుయ్యేలలో
ప్రణయ మాధుర్యాలు పంచుకున్నా
స్నేహమనే కమ్మదనం,
బాధ్యతల ఉప్పదనం,
ఎదురుదెబ్బల చేదు నిజాలతో
ప్రతిరోజూ గడపక తప్పదంటూ
బాంధవ్యాల చక్కదనాలు
షడ్రుచుల సౌభాగ్యాలు
మేమున్నామంటూ ఆహ్వానిస్తుంటే..............
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
ఏదో సాధించాలంటూ కలల అలలు
తరుముకొస్తుంటే్, పరుగెత్తీ పరుగెత్తీ
గొప్పి తగిలి ముందుకు తూలి,
బొప్పి కట్టి ,తల గిర్రున బొంగరమై తిరిగినప్పుడు
చుట్టూ ఉన్న చందమామలు గొల్లుగొల్లుమంటూ
నవ్వులబాణాలు విసిరినప్పుడు....
విత్తిన మరునాడే వృక్షం రాదనీ,
మొలకెత్తిన విత్తు మొక్కై ఫలించక మానదనీ
చెబుతూ... మునుముందుకు సాగిపొమ్మంటూ.......
కలలకైనా అలలకైనా ఓర్పు , ఓదార్పూ ఉండాలంటూ..........
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
ఆడైనా మగైనా
సామాజిక స్పృహ కావాలంటూ
నచ్చిన మార్గం కోసం
నమ్మిన సిద్ధాంతంకోసం
పుట్టిన గడ్డ కోసం
బ్రతుకమంటూ ,
నలుగురినీ బ్రతికించమంటూ.................
ఉగాది పచ్చడి తెచ్చిన సందేశాలతో..........
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
విభేదాలకు , వైషమ్యాలకు విరోధిని నేనంటూ
విరోధినామ సంవత్సరం ......
విజయపరంపరలతో విచ్చేసింది.
తేట తెలుగుమాటలతో
ఆమని కమ్మని గానాలతో
తెలుగువారి తొలి పండుగ అంబరాన్నంటే సంబరాలతో.......
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....

27 మార్చి, 2009

షడ్రుచుల సమ్మేళనం - నిత్యనూతన సంరంభం

పాపాయి నవ్వులా
పచ్చిపాల నురువులా
సెలయేటి పరుగులా
పూలపై తుమ్మెద రొదలా
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
నిరాశల నిశీధిలో
స్వైర విహారం చేస్తున్నశిశిరాన్ని
కాలమనే కటకటాలలో బంధించి వసంతమనే వేడుక వచ్చింది
ఆశలవెల్లువలే
అమృత ప్రవాహంగా
పిండారబోసిన పండువెన్నెలగా
ఆనందాల వెలుగులని కళ్ళాపి చల్లింది
గమ్య మెరుగని జీవన పయనంలో
అలుపులేని పోరాటానికి
పదపదమంటూ
ఎదగదిలో మదినదిలో
అలజడి రేపింది.
రమ్మనగానే రాని సంతోషాన్ని
పొమ్మనగానే పోని విచారాన్ని
పండుటాకులా నేలపాలయ్యే నిరాశని
కొంగొత్త ఆశల చివురులని
పూల పల్లకీలో మోసుకుంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
గెలుపులోని మాధుర్యాన్ని
ఆస్వాదించాలంటే
ఒక్కసారైనా ఓటమి పంచే
చేదుని చవిచూడాల్సిందే
సూరీని వెలుగు విలువ
తెలియాలంటే
కాయపు కిటీకీ లనే గాజుగుడ్లకి
అంధకారపు మబ్బులు ముసరాల్సిందే
ఎన్నికలు ఎందరికో
ఎన్నో కలల్ని కల్పించినా
గుప్పుగుప్పున తీర్చలేని
వాగ్దానాల వరాలు కురిపించినా
చెప్పేవారికి చేసేవారికి
మధ్యనున్న అంతరాన్ని
పసిగట్టి వారి పనిపట్టమంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
మమకారం కారం గా మారి
కడుపులో మంట రేపినా
అనురాగపుటుయ్యేలలో
ప్రణయ మాధుర్యాలు పంచుకున్నా
స్నేహమనే కమ్మదనం,
బాధ్యతల ఉప్పదనం,
ఎదురుదెబ్బల చేదునిజాలతో
ప్రతిరోజూ గడపక తప్పదంటూ
బాంధవ్యాల చక్కదనాలు
షడ్రుచుల సౌభాగ్యాలు
మేమున్నామంటూ పరుగులుతీస్తుంటే
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
ఏదో సాధించాలంటూ
కలల అలలు తరుముకొస్తుంటే
పరుగెత్తీ పరుగెత్తీ
గొప్పి తగిలి ముందుకు తూలి
బొప్పి కట్టి తల గిర్రున
బొంగరమై తిరిగినప్పుడు
చుట్టూ ఉన్న చందమామలు
గొల్లుగొల్లుమంటూ
నవ్వులబాణాలు విసిరినప్పుడు
విత్తిన మరునాడే వృక్షం రాదనీ
మొలకెత్తిన విత్తు మొక్కై
ఫలించక మానదనీ
కలలకైనా అలలకైనా
ఓర్పు , ఓదార్పూ ఉండాలంటూ
ఆడైనా మగైనా
సామాజిక స్పృహ కావాలంటూ
నచ్చిన మార్గం కోసం
నమ్మిన సిద్ధాంతంకోసం
పుట్టిన గడ్డ కోసం
బ్రతుకమంటూ ,
నలుగురినీ బ్రతికించమంటూ
ఉగాది పచ్చడి తెచ్చిన సందేశాలతో
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
విభేదాలకు , వైషమ్యాలకు విరోధిని నేనంటూ
విరోధినామ సంవత్సరం ......
విజయపరంపరలతో విచ్చేసింది.
తేట తెలుగుమాటలతో
ఆమని కమ్మని గానాలతో
తెలుగువారి తొలి పండుగ సంబరాలు తెచ్చింది

19 డిసెం, 2008

నేనింతే !

నలుగురికోసం

బ్రతుకుతాను

నన్ను నన్నుగా

బ్రతికించుకుంటాను

 

మంచిదనిపిస్తే

ముందడుగు వేస్తాను

కాదనుకుంటే్

దేవుడినైనా ఎదిరిస్తాను

 

 

బద్ధకాన్ని చూసి

అసహ్యించుకుంటాను

నాన్చుడు తత్వమంటే

నొచ్చుకుంటాను

 

 

 

చప్పుడు చేసే చప్పట్లంటే

భయపడతాను

కన్నీటిని తుడిచే చేతులకి

సలాం కొడతాను

 

 

మనసారా మెచ్చుకుంటే

శిరసు వంచి నమస్కరిస్తాను

వెన్నుతట్టి దారి చూపేవారికి

జేజేలు పలుకుతాను, జోహార్లర్పిస్తాను

 

 

వింతలోకంలో పుట్టిన అరుదైన జీవిని .....

అస్తమానం ఆలోచనల తీరాలలో విహరిస్తూంటాను....

                                                                                            ..... . . . నేనింతే    !

18 డిసెం, 2008

Let Me Say.........

Water lilies

ఎందుకో ప్రపంచం

వింతగా తోస్తున్నది

 

దృష్టి లోపం లేకున్నా....

అంతా మసక మసకగా

గజిబిజిగా కన్పిస్తున్నది

అందమయిన కళ్ళు

చూసేవన్నీ నమ్మలేకపోతున్నాయి

చూసినకళ్ళు- చెప్పేందుకు

నోరులేక కుళ్ళుకుంటున్నాయి.......

 

 

చెప్పగలిగిన పెదాలేమో

కళ్ళులేవని నొచ్చుకుంటున్నాయి

మనసులోని మాటలు

పెదాలని దాటి రానంటూ

దోబూచులాడుతున్నాయి....

 

 

అన్నీ వినే గడుసరి చెవులు

కళ్ళ చాటునుండి చిత్రాలు

విచిత్రాలు  చూసి

విపరీతాలు వినీ వినీ

దద్దరిల్లి మొద్దుబారిపోయాయి........

 

ఇన్నిటికీ మూలమైన గుండె

అన్ని భావాల్ని అందుకొని

దేనిచేతా బుద్ధిగా పనిచేయించలేక ,

చెప్పుకొనే దిక్కులేక

లబ్బుడబ్బు మంటూ

ఒంటరి పోరాటం సాగిస్తోంది...

 

 

 

బదులులేని ప్రశ్నలు ప్రతిక్షణం

కుప్పలు కుప్పలుగా

పుట్టుకొస్తుంటే ........

గుండెబరువు పెంచేస్తుంటే....

నోరువిప్పలేక, ఏమీ చెప్పలేక

కొట్టుమిట్టాడుతోంది మూగ మనసు

 

 

లోలోని స్థైర్యం ఆపద్బాంధవునిలా

ముందుకొచ్చి,

హృదయపు ఆవేదన ఆలకించి

’ఉందిలే మంచికాలం

ముందుముందునా’ అంటూ

భరోసా ఇస్తున్నా..... ......

ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు..

 

కాలం చెప్పే సమాధానం కోసం

వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను

నన్ను నేను కొత్త కోణంలో

ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాను

ఏది ఏమైనా నానైజాన్ని

కొనసాగించుకోవాలనుకుంటున్నాను.........

14 డిసెం, 2008

నా దారి.........

ఆశావాదినైన నేను

వినీలాకాశంలో విహంగాలని చూస్తూ

అద్భుతాల్ని అందుకోవాలని

గగనాన్నిఅధిరోహించాలని.........

నేల నుండి నింగికి పయనమయ్యాను

వెర్రికి వెనకాముందులేదా

అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే

నెమ్మదిగా నీళ్లు తాగమని

మరి కొందరు నా మేలుకోరి

చల్లని సలహాలిస్తుంటే ........

నాదారి పూలబాట కాదని తెలిసినా

గోదారినై ఎత్తు పల్లాలని దాటి సాగాలని ............

నాఅడుగుల వెంబడి

సుమాలు పుష్పించాలని .........

వాటిపై కొత్త దారులు కనిపించాలని.........

ఆ దారుల్లో కొత్త తరాలు

నూతనోత్తేజంతో దూసుకెళ్లాలని..........

నిరంతరం తపిస్తున్నాను

ప్రతిక్షణం గెలుపుకై ఆరాటపడుతూ

అప్పుడప్పుడూ అచేతనంగా నిలబడిపోతున్నాను

ఆ క్షణంలో........మసగబారిన

నా ఆలోచనా లోచనాలని సరిచేసి,

ఉత్సాహాన్ని ఊపిరిగా చేసి

నా బాట సాటి లేనిదంటూ....

నాలో నాపై ధీమాని కలిగించి

చెక్కు చెదరని విశ్వాసాన్ని ,

మొక్కవోని స్థైర్యాన్ని ప్రాణవాయువుగా ఇచ్చి.....

నేనెంచుకున్న రణరంగానికి

నన్ను సమాయత్తం చేసి

నా నుదుట విజయ తిలకం దిద్దే

నా నేస్తాలు భగవంతుడిచ్చిన

కోటానుకోట్ల వరాలు

దేవుడా ! నువ్వేమి ఇచ్చినా ఇవ్వలేకున్నా

నా ప్రాణాలనే నీపాదాల పై ఉంచి ప్రార్థిస్తున్నాను

ఉన్నత వ్యక్తిత్వాలని కోకొల్లలుగా

నాకు పరిచయం చెయ్యి

క్షణమొక పాఠంగా అంతులేని అనంత జ్‘నాన్ని గ్రోలి

అపారమైన విజ్నాన ఖని గా

దేదీప్యమానంగా వెలగాలని ఉంది

ఆ వెలుగు కలకాలం అందరికీ

పంచాలని ఉంది ఆరిపోయేదాకా........

నన్నర్థం చేసుకుంటే అది నా అదృష్టం

అపార్థం చేసుకుంటే అది నీ సృష్టిలోని లోపం !

29 నవం, 2008

బుసలుకొట్టే భయానకమా ! శాంతించు

ప్రాణమంటే

పరిహాసమా?

మనుషులపై

ద్వేషమా?

ప్రతీకారమే

నీ మార్గమా?

విరిచుకుపడుతున్న

పెనుభూతమా !

భీభత్స

ఉగ్రవాదమా!

చెలరేగకు

శ్రుతిమించకు

నూరుకోట్ల

ప్రజానీకమొక్కటై

వంతులుగా

వస్తాం!

నీ ఆకలి తీరుస్తాం

మూకుమ్మడిదాడి చేయకు ...

వెన్నుపోటు పొడవకు

సువిశాల భారతావనిని

సుందర భూతలాన్ని

రక్తాభిషేకాలతో

ముద్ద చేయకు

ప్రశాంత భారతిని

కల్లోలపరచకు

27 అక్టో, 2008

బస్సుపాలైన బాల్యం

paddu 1 060

కాళ్ళా గజ్జావయసు

కండెలమ్ముకుంటోంది

బలపం పట్టాల్సిన చేతులు

నాలుగు రాళ్ళ కోసం

తంటాలుపడ్తున్నాయి

కలలు కనే కళ్ళు

భవిష్యత్తును

కానలేకపోతున్నాయి.

లేలేత చెక్కిళ్లు

ఎండకు మగ్గిపోతున్నాయి

ఇంతమంది మధ్యలో

ఈ పెద్దమనిషి కూడా

పోటీ పడి మరీ

సంపాదించేయాలని

ఆరాటపడుతోంది.... !

....................పద్మకళ

7 అక్టో, 2008

విధి - మన విధి

చూపులేని కన్నులు

ఏమీ చూడలేక రోదిస్తూంటే

చూసీ ఆగలేని కన్నులు

వేధిస్తున్నాయి

చూసిందల్లా కావాలని..............

నడవలేని కాళ్ళు

తమంత తాముగా

అడుగులో అడుగేసి

ముందడుగుకై తపిస్తోంటే

నడక నేర్చిన కాళ్ళు

పెడదారుల్లో పరుగెడుతున్నాయి

చిక్కిందల్లా దక్కించుకోవాలని

చేజిక్కించుకోవాలని.................

మాటరాని నాలుక

మదిలో ఉప్పొంగే భావ పరంపరను

మౌనంగా దిగమింగేస్తుంటే

మాటకారి నాలుక

మందిని-పది మందినీ

ఆడిపోసుకొంటోంది......................................

వినికిడి లేని చెవులు

పెదాల నాట్యాలను

పదాలుగా అనువదించుకుంటుంటే

వినేవాడి చెవులు

రోజంతా వినేది,

వినాలనుకునేది వినకూడనిదే........................

ఆపదలో ఉన్న చేయి

ఆధారం కోసం

ఆశగా ఎదురు చూస్తుంటే

అందీయవలసిన చేయి

అహంకారపు

హృదయ పీఠంపైనే

ఆగిపోయి నేను - నాది

అంటూ స్వార్థపు చాలనాలు చేస్తూ

తప్పించుకు తిరుగుతోంది....................................

నిర్విరామ జీవన పయనంలో

అలుపెరుగని మన నూరేళ్ల పోరాటంలో

అస్త్రాలు లేని ఈ సైనికులని

మన ఆదరణే అండగా

ప్రోత్సాహమే ఆయుధంగా

చేయూత నిస్తూ, సహకరిస్తూ

ఆ నిండుగుండెలని మనతో

కలుపుకొని మునుముందుకు సాగి

విధి ని ఎదురొడ్డి

మన విధిని నెరవేర్చ లేమా ?................

విధాత మెప్పు పొందగ లేమా ?.........

జగజ్జేతలం కాలేమా. ?.............

........