ముక్కోటి దేవతల సాక్షిగా ఒక్కటైన బంధం మూడుపువ్వులు, ఆరుకాయలుగా పదికాలాల పాటు చల్లగా వర్థిల్లాలని ఇంటిల్లపాదీ ఆశీర్వదిస్తారు. అత్తవారింట్లో మొదటి అడుగు పెట్టే వేళ అమ్మాయి నోటికి తాళం వేసి చెవులతో కష్టమయినా, నష్టమయినా , సుఖమయినా , దుఃఖమయినా అన్నీ నీ భర్త ఇంట్లోనే అంటూ పుట్టిల్లు ఎన్నో సుద్దులు చెప్పి సాగనంపుతుంది. ఎవ్వరేమన్నా మారు మాట్లాడకుండా మౌనంగా భరించమని సహనాన్నే ఆభరణంగా అలంకరించి పంపుతుంది.
.
ఆమె అదృష్టవశాత్తూ మంచి కుటుంబంలో పడితే సరే. లేకపోతే దుర్వ్యసనపరుడైన భర్త , ఆవేశపరులైన కుటుంబసభ్యులు అత్తింటి అత్యాశలు, ఆరళ్ళు అన్నీ ఆమెపై దాడి చేస్తే ? భరించలేని కష్ట్టాలు క్షణక్షణగండాలుగా మారి బ్రతుకు దుర్భరమయితే ? పుట్టింటికి పయనం. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఆమెకి స్వాగతం లభిస్తుందా? కనీసం ఆదరణ దొరుకుతుందా ? అంటే చెప్పలేం. ఫలితమే ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు, వరకట్నపు చావులు. ఇటువంటి పరిస్థితుల్లో రోజురోజుకీ మహిళలపై పెరిగిపోతున్న దౌర్జన్యానికి అదుపుగా ఆటకట్టుగా ఆడపడుచులను ఆదరించే బలం కొండంత అండ గా నిలిచే గొప్పవరం , గృహహింస నుండి మహిళలను కాపాడే ’రక్షణ చట్టం 2005'.
మన సమాజంలో సహజంగా నెలకొన్న వివక్షత , ఆచారాలు , సంప్రదాయాలు, పద్ధతులవల్ల కుటుంబాలలో స్త్రీ , పురుషుల మధ్య అసమానతలు సర్వసాధారణమైపోయాయి. మితిమీరిన ఆవేశం, అహంకారం స్త్రీలపై హింసకు దారితీస్తున్న ప్రస్తుత తరుణంలో వారికి రక్షణ కల్పించి , మానసిక స్థైర్యాన్ని , బ్రతుపై విశ్వాసాన్ని కల్పించే దిశగా ఈ చట్టం తోడ్పడుతుంది.
ఏయే చర్యలు గృహహింస పరిధిలోకి వస్తాయి?
శారీరకంగా గానీ , మానసికంగా గానీ , మాటలు ,చేతల ద్వారా ఉద్వేగపర్చటం , బాధపెట్టడం , ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయటం ( డబ్బు లాక్కోవటం ..), స్త్రీ ఆరోగ్యాన్ని కుంటుపరచే చర్యలకి పాల్పడటం వంటి పనులు గృహహింస పరిధిలోకి వస్తాయి.
ఈ చట్టపరిధి లోకి ఎవరెవరు వస్తారు ?
పుట్టుక ద్వారా , పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసి ఉంటున్నవారు ,ఒకే ఇంటిలో కలిసి ఉంటున్న స్త్రీ , పురుషులెవరైనా సరే ఈ చట్టపరిధిలోనికి వస్తారు.
గృహహింసపై సమాచారాన్ని ఎవరు ఇవ్వవచ్చు ?
బాధితురాలు స్వయంగా కానీ , బంధువులు, ఇరుగుపొరుగువారు, ఎవరైనా సరే రక్షణాధికారికి సమాచారం అందించవచ్చు.
ఎవరికి /ఎలా తెలియజేయాలి ?
జిల్లా స్థాయిలో స్త్రీ అభివృద్ధి సంక్షేమశాఖ తరపున పనిచేసే రక్షణాధికారికి సమాచారం అందించవచ్చు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకుల అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోను శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ చట్ట అమలుకు రక్షణాధికారిగా వ్యవహరిస్తారు. సమస్యను బాధితురాలు నేరుగా కానీ , ఇతరుల సహాయంతో గానీ తెలియజేయవచ్చు.ఫోన్ కాల్ ద్వారా కూడా పరిస్థితి ని చెప్తే వెంటనే స్పందించి సిబ్బంది బాధితురాల్ని కలుస్తారు. ఆమెనుండి లిఖిత రూపంలో పిటిషన్ తీసుకుంటారు. తర్వాత వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. మహిళను హింసించటం వల్ల భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలు, చట్టపరమయిన ఏర్పాట్లు, జరిమానాలు, శిక్షలు వివరిస్తారు. చాలా వరకు కేసులు కౌన్సిలింగ్ స్థాయిలోనే పరిష్కృతం అవుతుండగా మొండి కేసులు , ఎంతచెప్పినా వినని వారిపై ’గృహ ఘటన నివేదిక ’ రూపంలో మేజిస్ట్రేటుకు (కోర్టుకు) ఫైలును అందించి దాని నకలును బాధితురాలికి అందజేస్తారు. కోర్టుకు దరఖాస్తు అందిన ౩ రోజుల్లో మొదటి వాదన , 60 రోజుల్లో తుది తీర్పు వెలువడుతుంది.
ప్రతిబంధకాలు:
సమాజంలో స్త్రీలహోదా , గౌరవం తదితర అంశాలు ఎన్ని కష్టాలయినా మౌనంగా హింసను భరించడానికి కారణమవుతున్నాయి. తన సమస్యను బయట పెట్టటం వల్ల కుటుంబ జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని , పిల్లల భవిష్యత్తు పాడవుతుందని చాలా మంది గృహహింసా రక్షణ చట్టాన్ని ఉపయోగించుకొనే సాహసం చేయటం లేదు. మసిపూసి మారేడుకాయ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళ వల్ల ఈ చట్టం దురుపయోగం అవుతుందేమోనని భయపడేవాళ్లూ లేకపోలేదు.
అడ్డంకులెన్ని ఉన్నా నిలువనీడ కరవవుతున్న పరిస్థితినుండి స్త్రీలను ఈ చట్టం కాపాడుతుంది. దీనివల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ సొంత ఇల్లయినా , అద్దె ఇల్లయినా ఆమెను బయటికి పొమ్మనే అధికారం ఎవ్వరికీ లేదు. దానితోపాటు ఆర్థిక , ఆరోగ్యపరమయిన నష్టాల్ని భర్తీ చేయాల్సి రావటం , పిల్లల పోషణ ఇతర ఖర్చులకు నెలనెలా గానీ ఏకమొత్తం గానీ డబ్బు చెల్లించేలా ప్రతివాదిని ఆదేశిస్తుంది.
ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్షతోపాటు రూ.20,000 లు. జరిమానా విధిస్తుంది.
ఈ చర్యలు భార్యాభర్తల మధ్య తగవులు హింసకు దారితీయకుండా ఎంతవరకు అడ్డుకట్టవేస్తున్నాయనేది ప్రశ్నార్థకమే. ఇదివరలో లాగా మనకెందుకులే అని ఊరుకోకుండా సమస్య తీవ్రమనిపిస్తే ఎవరైనా సరే బాధితుల పక్షాన రక్షణ కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే ఈ చట్టం మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది.
ప్రతిచిన్న విషయాన్నీ పెద్దదిగా చేసుకుని భర్తలని సాధించే భార్యామణులకి కూడా ఈ చట్టం గొడుగుపట్టే అవకాశాలున్నాయని కొందరు , దీన్ని అదనుగా తీసుకుని మగవారిని ముప్పుతిప్పలు పెట్టే మహిళల సంగతేమిటని కొందరుప్రశ్నిస్తూనే ఉన్నారు.
తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుసుకుని ఎవరి అంతరాత్మకు వారు తలవంచాల్సిన పరిస్తితి రాకుండా నడచుకోగలిగితే , సహనాన్ని, ఓర్పుని కలిగి సర్దుబాటు ధోరణి అలవర్చుకుంటుంటే ఏ చట్టం తోనూ పనిలేదు.....