Pages

26 డిసెం, 2008

పోటీల మాటున పిల్లల అగచాట్లు

      పెద్ద పెద్ద వేదికలమీద, బుల్లి తెరలమీదా వచ్చీరానీ మాటల వయసులో ముద్దులు కురిపించే చిన్నారులు గానకోకిలలై రాగాలు తీస్తుంటే ఆబాలగోపాలమూ పరవశిస్తుంది.

      వివిధ కార్యక్రమాల కోసం, పోటీల కోసం రేయింబవళ్ళు శ్రమించి సంగీత సామ్రాట్టులు, సినీ విరాట్టుల్ని సైతం అబ్బురపరచి వారి మన్ననలనందుకుంటున్నారు నేటి తరం చిన్నారులు.

     కారణాలు ఏవైనా ఏ రోజుల్లో సంగీతం నేర్చుకునే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంగీతాన్ని కేవలం ఒక కళగా నేర్చుకుని ఆస్వాదించి కచేరీలు ఇచ్చే వారికంటే దాని ఆధారంగా సినీ పరిశ్రమకి చేరువై నిలదొక్కుకోవాలని ఆరాటపడేవారి సంఖ్య బాగా పెరుగుతోంది.

        వివిధ ఛానెళ్ళు నిర్వహించే పోటీలకోసం తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తమ పిల్లల్నితయారుచేస్తున్నారు. ఇందుకోసం ముందస్తుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. నియమబద్ధంగా సంగీతం తరగతులను ఏర్పాటు చేసి అటు సంప్రదాయ సంగీతంతో పాటు ఇటు లలిత సంగీతం ,సినీ గీతాలను అతి తక్కువ సమయంలో పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తున్నారు.

       ఈ రోజుల్లో టీ.వీ. షోల్లో ఎన్నో పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్న చిన్నారుల ప్రతిభ వెనుక కనిపించని తపన, శ్రమ . ఒత్తిడి ఉన్నాయన్నమాట తెలిసిందే. ఇందుకోసం ముక్కుపచ్చలారని వయసులో పిల్లలు పడుతున్న యాతన అంతాఇంతా కాదు. హాయిగా ఆడుతూ పాడుతూ నచ్చినట్టు విహరించాల్సిన వయస్సులో ఒక ప్రక్క చదువుల హోరు, మరో ప్రక్క కాంపిటేషన్ల జోరు. దేన్లోనూ వెనుకబడటానికి వీలులేదు.

           మనసున్నా లేకున్నా మనసుపెట్టి తీరాల్సిందే. లేకపోతే చీవాట్లు తప్పవు.

          బాగా పాడావు అన్న మెచ్చుకోలుతెచ్చే ఆనందం కన్నా ఎందుకంత కంగారు పడ్డావు ? పోటీకి ముందు బాగానే పాడావు కదా! ఇలా చేస్తే నువ్వడిగింది కొనిపెట్టను అంటూ ఇచ్చే పెద్దల హెచ్చరికలు పిల్లల మనసుల్ని గాయపరుస్తున్నాయి.

         అంత కష్టపడి నేర్చుకొని ప్రైజులు సాధించినా చిన్నప్పుడు ప్రోత్సహించిన తల్లిదండ్రులే 15, 16 ఏళ్ళు వచ్చే నాటికి ఒక్కసారిగా పోటీలు,పాటలు బంద్ అనీ ఎమ్సెట్టు ,ఐఐటీ అంటూ దారి మళ్ళించుకోమంటారు.ఒక్కసారిగా కొత్త తరహా పోటీలో కొత్త పాఠాలు మనసుకి  ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఊరటని ఇచ్చే అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పడ్డ మానసిక సంఘర్షణ వల్ల అటు చదువులోనూ ఇటు నేర్చుకున్న కళలోనూ ఎటూ నెగ్గుకురాలేక రెంటికీ చెడ్డ రేవడులయ్యే పరిస్థితి తలెత్తుతోంది. చిన్న  చిన్న పిల్లలతో ఎలాంటి పాటలనైనా పాడించటం , పాటలోని మాటలకు అర్థం తెలియని వాళ్ళు నిలువెత్తూ పరవశిస్తూ లయబద్ధంగా ఊగిపోతూ లీనమైపోవటం పెద్దల్ని ఆందో ళనకి గురిచేస్తున్నాయి.

            అభ్యంతరకర పదజాలాన్ని, దూషణల్ని కూడా పాటలుగా మారుస్తున్న నేటి రచయితలు కొందరు ఆమాటలు పిల్లల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూఫుతాయన్న విషయం గ్రహించాలి. దుమ్ము లాగినట్తుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్ట్టుందే లాంటి పదజాలం పిల్లల్లో అయాపనులు హీరోయిజానికి చిహ్నాలుగా చెరగని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు.

             ఈ తరం దురదృష్టమో లేక కొత్త సంగీత దర్శకుల అదృష్టమో ఏమైనా సరే మంచి సాహిత్యమున్న పాటలకంటే లేని పాటలకే చక్కటి మ్యూజిక్ కంపోజిషన్ కుదురుతుంది. అందువల్ల ఈ రోజుల్లో వస్తున్న ఐటమ్ సాంగ్స్ పాడాటానికి పిల్లలు ఏ మాత్రమూ సంకోచించటం లేదు. ఆయా పాటల ప్రభావం భవిష్యత్తులోనూ , ప్రస్తుత ప్రవర్తనలోనూ ఉంటుందన్న విషయాన్ని సభ్యసమాజం హెచ్చరిస్తూనే ఉన్నా లక్ష్యపెట్టకపోవటం విచారించవలసిన విషయం.

       ఇవన్నీ నేను కొత్తగా ఛేదించిన కోణాలు కాదు, నేను మాత్రమే ఆవిష్కరించిన అక్షర సత్యాలూ కాదు.

     మీలాగే రెండుకళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్న మామూలు మనిషిగా కళ్ళముందు నడుస్తోన్నఅయోమయ ప్రపంచాన్నిమార్చలేని అసహాయత అనే బూజు దులిపి నిరాశల నిశీధిలో  పట్టుదల  అనే ఓ  ఆశాదీపాన్ని పట్టుకొని అడుగడుగునా నాదారికి అడ్దుతగిలి నన్ను బంధించాలనుకునే ముళ్ళకంచెలను నెమ్మదిగా దాటుకుంటూ , ప్రోత్సాహమనే ఊపిరితో ప్రాణం నిలుపుకుంటూ నా తల్లిదండ్రులు నన్నో చెత్తబుట్టలోని సరుకుగా తలచి చింతించకూడదని ఈ సువిశాల ప్రపంచంలో నాకంటూ ఓచిన్న స్థానాన్ని సంపాదించే దిశగా సాగిపోతున్నాను.

           నా బాట మీకు నచ్చితే  అభినందించలేకున్నా ఆశీర్వదించండి. నాదారి సరికాదని మీకనిపిస్తే నిర్మొహమాటంగా సూచించండి .....ఆలోచిస్తాను. అవసరమనిపిస్తే నన్ను నేను మలచుకుంటాను.

3 కామెంట్‌లు:

రమణ చెప్పారు...

మంచి విషయం రాసారు. పిల్లలు మనస్పూర్తి గా ఇష్టపడి ,ఆనందిస్తూ సంగీతాన్ని నేస్చుకుంటున్నరా లేదా అని గమనించడం తల్లి తండ్రుల బాధ్యత.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

బ్లాగు లందున నేర్పరి బాగు గాను
పద్మ కవితల యందున పట్టి తాను
సర్వ కళలను సాధించి నేర్వ బూనె
మొల్ల వచ్చెను బెజవాడ కల్ల గాదు

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

బ్లాగు లందున నేర్పరి బాగు గాను
పద్మ కవితల యందున పట్టి తాను
సర్వ కళలను సాధించి నేర్వ బూనె
మొల్ల వచ్చెను బెజవాడ కల్ల గాదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి