Pages

20 జన, 2009

   ’ఇంటిని చూడు ఇల్లాని చూడు’ అని  పెద్దలు ఊరికే అనలేదు. ముంగిట్లో మెరిసే ముగ్గుని బట్టి ముదిత మనసు తెలిసిపోతుంది.

                 ముగ్గు వెయ్యటంలో ఒక్కో అతివది ఒక్కో శైలి.

సరిగ్గా పరిశీలిస్తే ముగ్గు పోతలో , గీతలో మనిషి మనస్తత్వం , పనితీరు, నైజం, ఆసక్తి, అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది.

గీత సన్నగా గీయగల్గటం , చిన్న చిన్న కళా రూపాలు, పువ్వులు, ఆకృతులు స్పష్టంగా గీయగలగటం అనేవి చాలా తక్కువ మందికి మాత్రమే చేతనైన నైపుణ్యాలు.

ముగ్గు కి సమతూకం చాలా ముఖ్యమైన అంశం.ఎటు నుంచి ఎటు చూసినా ముగ్గు ఒకేలా కనపడాలి. ఒక ప్రక్క పెద్దగా మరోప్రక్క కుంచిం చుకు పోయినట్లుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

 

చుక్కల ముగ్గులు పెట్టటం ఒక కళ. చుక్కల ముగ్గులు ఎలా పుట్టయో మీకు తెలుసా ?

ఏ ఆధారం లేకుండా ముగ్గుపెడితే ముగ్గుకి ఒక రూపు రేఖ రాదని,ఈ ఆడాళ్ళు ముగ్గులు పెడుతూ పెడుతూ ఇల్లు , వళ్ళు మరచి  ఆంధ్రా నుంచి ఆగ్రా దాకా..... అలా పోతూనే ఉంటారని ముందుచూపుతో చుక్కలనే పరిధులని పెట్టారన్న మాట. పాపం ఆ పరిధుల్లో నే పడి ఇన్నాళ్ళు మన అమ్మమ్మలు,  అమ్మలు చుక్కల ముగ్గులతో సరిపెట్టుకున్నారు. కానీ మనం కాస్త ఎక్కువ తిన్న బాపతు కదా. అందుకే ఈతరం అమ్మాయిలు ఎక్కువగా చుక్కల ముగ్గుల కంటే కళాకృతుల కే (డిజైన్స్) ఎక్కువ మొగ్గు చూపుత్తున్నారు. ఆ మాటకొస్తే చుక్కల ముగ్గు ఎవరైనా ఇట్టే  పెటేస్తారు. కానీ చుక్కలు లేకుండా ముగ్గు వెయ్యటం లోనే అసలు పనితనం ఉంది . అందుకోసం ఎంతో సృజనాత్మకత ఉండి తీరాలి.   

 అల్లిబిల్లి లతలు అల్లటం అతి కొద్ది మందికే  చేతనైన ఒక అద్భుతమైన  కళ. అందమైన పువ్వులు , లతలు, ఆకులు, రకరకాల రూపాలతో కళాకృతులు రూపొందించగలగటం

అసలైన ప్రతిభకు నిదర్శనం.

ముగ్గుల గురించి నన్ను మాట్లాడమంటే మీ చెవులు చిల్లు పడొచ్చు, ( ప్రస్తుతానికి చదువుతున్నారు కాబట్టి మీ కళ్ళు బైర్లు కమ్మచ్చు ) మీకు నాపై కడుపుమంట పుట్టొచ్చు.

 అదుగో అప్పుడే మొదలైపోయింది మీ మంట. దాన్ని చల్లార్చటానికి మీ విసుగుని , చీకాకుని, కోపాన్ని బుగ్గి పాలు చేయటానికి సరదాగా ఓ ముగ్గుల పోటీ పెట్టనా ?

          ఓయ్ ! ఏందమ్మో! నీ కత అని నిట్టుర్చకండమ్మా !

ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడ ముగ్గులు పెట్టి మీ కబుర్ల పెట్టె ( కంప్యూటర్ ఇది  నా భాషేనండోయ్ ! ) పై మీ ప్రతాపం చూపేరు. ( ఒకవేళ చూపినా పర్లేదు. పెయింట్ కెళ్ళో మరెక్కడికైనా వెళ్ళో మీరు మీ ముగ్గు గీసి నాబ్లాగులో పెట్టాలనుకుంటే దానికీ ఓ దారి ఉంది. కానీ ఇక్కడ కాదు. )

( రేపు సాయంత్రం సరిగ్గా  నాలుగు గంటలకు నా బ్లాగులో నిర్వహించబోయే ముగ్గుల పోటీ కి రండి. వివరాలు తర్వాతి పోస్టులో రేపటికల్లా ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం :

మీ పని న్యాయ నిర్ణయం.

నేను ఇప్పుడు పెట్టే ముగ్గులోంచి ఒక చక్కని ముగ్గుని ఎంఫిక చేసి ఓ బుల్లి వ్యాఖ్య ఇస్తే చాలు.

సరే మరి. ఆలస్యం అమృతం విషం......

ముదితల ముగ్గులు ముగ్ధ మనో హరంగా ముస్తాబై మీకోసం ఎదురుచూస్తున్నాయి. ముందుకు పదండి......... ఆ నాకిప్పుడు కొంచెం పనుందని జారుకునేరు.......

   మడిసన్నాక కూస్తింత కళా  పోషనుండాలి మరి..........

 

ముగ్గులు (5)

 

 

paddu10 042

 

paddu10 039

 

 

 saakshi1 162

 

saakshi1 167

 

కన్నుల పండువగా ఉన్నాయికదా!

అందుకే మరి ఇది కొత్త బంగారులోకం !

ఈ లోకం లో వింతలు , విశేషాలతో పాటు కంటికి కనిపించని ఎన్నో సున్నితమైన అంశాలని స్పృశిస్తూ ..... మీ మనసును ఆహ్లాద పరుస్తూ ..... రోజువారీ ఒత్తిడులనుంచి దూరంగా కనీసం కొద్ది నిముషాల పాటైనా మిమ్మల్ని విడిపించి ... మనశ్శాంతిని మీ పెదాలపై ఓ చల్లని చిరునవ్వు పువ్వుని పూయించే చిరు ప్రయత్నమే........... ఈ కొత్త బంగారులోకం ఆశయం........

4 కామెంట్‌లు:

సిరిసిరిమువ్వ చెప్పారు...

బ్లాగులో ముగ్గుల పోటీ--బ్రహ్మాండంగా వుంది అవుడియా.

ఏ ఆధారం లేకుండా ముగ్గుపెడితే ముగ్గుకి ఒక రూపు రేఖ రాదని,ఈ ఆడాళ్ళు ముగ్గులు పెడుతూ పెడుతూ ఇల్లు , వళ్ళు మరచి ఆంధ్రా నుంచి ఆగ్రా దాకా..... అలా పోతూనే ఉంటారని ముందుచూపుతో చుక్కలనే పరిధులని పెట్టారన్న మాట :) బాగా చెప్పారు.

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఇంతకీ మీరు పెట్టిన ముగ్గులు ఎక్కడా? కనపడటంలెదు.

రమణ చెప్పారు...

ముగ్గులు డవున్ లోడ్ అవ్వటం లేదండి , మీ టపా చదువుతుంటే నా చిన్నపుడూ మా అమ్మ గారు ఎడమ చేతితో వేసే చక్కని ముగ్గులు గుర్తుకు వచ్చాయి.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

ముగ్గు కానరాదు వెదక వెదక
మళ్ళి లోడుచేసి మాకు చూపించుమా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి