21 ఫిబ్ర, 2009
అచ్చ తెలుగు బామ్మ కన్నుమూసింది....
’బామ్మ ’ అన్న మాటకు అసలైన అర్థం చెప్పిన తెలుగువారి బామ్మ నిర్మలమ్మ అస్తమించింది. తెలుగు సినీ ప్రపంచానికున్న పెద్ద దిక్కు దిక్కులకు దూరంగా కనుమరుగయ్యింది. తెలుగు ప్రేక్షకులకి , నిర్మలమ్మ అభిమానులకి దుఃఖాన్ని మిగిల్చింది. 59 ఏళ్ళ క్రితం ’గరుడగర్వ భంగం’ సినిమాతో తెలుగు తెరపై తొంగి చూసిన రాజమణి తొలి అడుగుతో తడబడకుండా సుమారు 800 కి పైగా చిత్రాల మైలురాళ్లని దాటి , ’ప్రేమకు ఆహ్వానం ’ చిత్రంతో నడక ఆగిపోయినా ఆ అడుగుల చప్పుడు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో వినబడుతూనే ఉంది.
ఖంగుమని మ్రోగే ఆమె స్వరం మూగబోయిందన్న నిజం జీర్ణించుకోవటం ఆమెతో అనుబంధం ఉన్న ఎందరికో పెద్ద పరీక్షగా మారింది. అలనాతి నట సార్వభౌములు ఎన్.టీ .ఆర్., ఏ.ఎన్.ఆర్. ల దగ్గరి నుండి నేటి తరం నటులు వెంకటేష్, హరీష్, బాలకృష్ణ ఇలా దాదాపు సినీ తారాగణమంతా ఏదో ఒక చోట ఈ బామ్మ నట ప్రస్థానంలో ఎదురుపడి ఆమె ఆప్యాయతాబిమానాలను రుచి చూసిన వారే. తల్లిగా అంతులేని ప్రేమను పంచాలన్నా, కొడుకు నిర్లక్ష్యానికి గురైన తల్లిగా కట్టలు త్రెంచుకున్న దుఃఖాన్ని పెదాలతో బంధించి కళ్ల ద్వారా హావభావాల ద్వారా చూపించి, చూసేవారి కంటతడి పెట్టించాలన్నా నిర్మలమ్మకే చెల్లింది. చాదస్తపు బామ్మగా ఒక ప్రక్క కుర్రవాళ్ళను సత్తాయిస్తూనే యువతరానికి ఆత్మీయతానురాగాల రుచి చూపించింది.
చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్స్ లేకుండా స్వీయ ప్రతిభతో పైకి వచ్చిన ఒక గొప్ప నటి మరణం విచారించదగ్గ విషయం. ఆమెకు నివాళులర్పించటం మన సంస్కారం !
Labels:
సినిమా ప్రపంచం
2 కామెంట్‌లు:
నిర్మల మనస్వినియైన నర్మద నది!
హావ భావముల కనుల జీవధార!
మన తెలుగు బామ్మ ఇకపయి మనకు లేరు!
వదలి వెళ్ళెను కీర్తిని వందనమ్ము!
మా బామ్మ నిర్మలమ్మకి నా నివాళులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి