Pages

16 మార్చి, 2009

ఊర్వశి శారద తో ముఖాముఖి

తల్లిగా, చెల్లిగా, భార్యగా, అత్తగా, పోలీసు అధికారిణిగా, లాయర్ గా, నర్సుగా, కలెక్టర్ గా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి, ఆయా పాత్రలకే వన్నె తెచ్చిపెట్టిన కళా విశారద తెలుగు వారి కృష్ణా తీరపు సినీ ఆడపడుచు ఊర్వశి శారద. అటు సాంప్రదాయక పాత్రలు, పౌరాణిక పాత్రలతో పాటు ఇటు కాలానుగుణంగా వచ్చే మార్పులను ఆకళింఫు చేసుకుంటూ కొత్త తరహా పాత్రలను ఆలవోకగా నటించ గలగటం ఆమె కే సొంతం. మనుషులు మారాలి, శారద చిత్రాల్లో ఆమె ప్రతిభ ఎంతటి కఠినాత్ములనైనా కరిగించగలగటం ఆమె నట విశ్వ రూపానికి తార్కాణం.అనితరసాధ్యమైన ప్రతిభా పాటవాలకి జాతీయ స్థాయిలో ౩ సార్లు ’ఊర్వశి’ అవార్డు లభించటమే ఏ ఇతర మటీమణులకు దక్కని ఏకైక సత్కారం. గత కాలపు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన నటిగా , రాజకీయవేత్తగా , కొద్ది కాలంపాటు పారిశ్రామిక వేత్తగా , సామాజిక సేవా దృక్పథం గల మహిళగా ఊర్వశి శారద పంచుకున్న అనుభవాలు:

కళ: మీరు చేసిన సినిమాలన్నిటిలో మీ కిష్టమైన సినిమా ఏది?

శారద: శారద

కళ: మీ ఫేవరేట్ హీరో ఎవరు? ఎవరి నటనను ఎక్కువగా అభిమానిస్తారు? శారద: కమల్ హాసన్ నటన అద్భుతంగా ఉంటుంది. కళ: మొదటిసారి నటనలోకి రంగప్రవేశం ఎలా చేశారు? శారద: పదేళ్ల వయస్సులో రక్త కన్నీరు డ్రామా ద్వారా నటనలోకి ప్రవేశించాను. కళ: పెద్దయ్యాక ఏమి సాధించాలని అనుకునేవారు? శారద: చిన్నప్పుడు మా స్కూలు హెచ్. ఎం. పూర్వ విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మాకు పరిచయం చేస్తుంటే నేనూ ఏదో ఒకరోజు గొప్ప దాన్నయి అలా మెప్పుపొందాలని అనుకునేదాన్ని. ప్రత్యేకించి ఇలా అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కళ: నటనలో మిమ్మల్ని ప్రోత్సహించిన వారెవరు? శారద: నా ప్రతిభను గుర్తించి మంచి నటిగా నేను స్థిరపడటానికి ప్రోత్సహించిన వ్యక్తి మా అమ్మగారు. కళ: ఒక పారిశ్రామిక వేత్తగా అనుభవాలు? శారద: మిత్రుల సలహాపై కొంతకాలం చాక్లెట్ పరిశ్రమ బాధ్యతలు తీసుకున్నాను. పరిశ్రమ నడపాలంటే ఎంతో శ్రమ, సమయాలను కేటాయించి ఆ పనిలో నిమగ్నం కావాలి. కళ: సినీ క్రేజుతో ఉన్న నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి? శారద: తల్లిదండ్రుల తర్వాత నిజయమైన అండ చదువు. జీవితానికి వెన్నెముకగా నిలుస్తుంది. ప్రతి దశలో నూ మిమ్మల్ని నిలబెట్టేది, మీకు గుర్తింపు తెచ్చేది చదువు మాత్రమే. సినిమాలు కేవలం ఎంటర్ టైన్మెంటు కోసమే చూడాలి. మంచి సందేశం ఉంటే స్వీకరించాలి. అంతే కానీ సినీ వ్యామోహంలో పడి తాత్కాలికమైన అందం , ఆకర్షణల మీద నమ్మకంతో కలలు కని గడపదాటితే జీవితం చినిగిన విస్తరి అవుతుంది. దానివల్ల సంఘంలో గౌరవం పోతుంది. కళ: చిత్ర సీమలో నాడు-నేడుల వారధిగా మీరు గమనించిన తేడాలేమిటి? శారద: మారుతున్న ప్రపంచంతో పాటు సినీ ఫీల్డ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ రోజుల్లో సినీ తారలు ముఖ్యంగా ఆడవాళ్ళు బయట కనిపిస్తే శిరసు వంచి నమస్కరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.సినిమా రంగంలో మహిళలని ఎంతో గౌరవించేవారు. ఈ రోజుల్లో ఆ గౌరవాన్ని పొందేవాళ్ళని వేళ్ళపైనే లెక్క పెట్టవచ్చు. ఆ రోజుల్లో ఐటమ్ సాంగ్స్ చేయటానికి హీరోయిన్స్ ఒప్పుకోకపోవటం వల్ల ఒక్కరో ఇద్దరో ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి పాత్రలు చెయ్యనివాళ్ళ కంటే చేసే వాళ్ళే ఎక్కువ. కళ: ఒక రాజకీయ నాయకురాలిగా మీ గురించి చెబుతారా? శారద: పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే ఎంపీ అవ్వటం జరిగింది. నాకున్న పరిచయాలు, చొరవవల్ల నా నియోజక వర్గం లో చేయగలిగిన పనులు నిర్వర్తించాను. నాకు పదవీ వ్యామోహం , పదవీ కాంక్ష లేవు. కాకపోతే మనం చేయదలచుకున్న మంచి పనులకి అధికారం అవసరమవుతుందన్న మాట అందరికీ తెలిసిన విషయమే. కళ: ప్రస్తుత కాలంలో ’మహిళా సాధికారత’ కు ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ కోణంలో తనను తాను రక్షించుకోవటాన్కి ఆడపిల్లలు ఏమి చేయాలి? శారద:మోసకారుల మాటలు, పొగడ్తలకి పొంగిపోయి మభ్యపడకూడదు. మగవారితో ప్రతి విషయంలో పోటీ అనవసరం. ఎవరి మటుకు వాళ్ళు చెయ్యదలచుకున్న పనిని ధైర్యంగా చెయ్యాలి. ఒక్కోసారి అమాయకులయిన అబ్బాయిలని ఆటపట్టించటం లాంటి పనులు ముందుముందు కష్టాలని తెచ్చిపెడతాయి.సంతానాన్ని ఒకరితో పరిమితం చేసుకుని

ఎన్ని ఒత్తిడులున్నా వారికి మంచి భవిష్యత్తునివ్వాలి.

రోజూ కనీసం ఒక్క నిముషం ధ్యానం చేయటం వల్ల ఙ్ఞాపక శక్తి, ఆలోచనా విధానం మెరుగుపడతాయి.

కళ: పారిశ్రామిక వేత్తగా, నటిగా, రాజకీయ నాయకురాలిగా, ఒక మహిళగా మీ భవిష్యత్ ప్రణాళీక ఏమిటి?

శారద: భగవంతుడిచ్చన శక్తి ని వృథా చెయ్యకుండా నలుగురికీ ఉపయోగపడాలి. సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సేవ చెయ్యాలి నూటికి ఒక్కశాతమైనా చేయగలిగే చాలు. మానవ సేవ , ఆధ్యాత్మిక త రెండూ కలి పి భవిష్యత్ జీవనం ఫల వంతం చేసుకోవాలనుకుంటున్నాను.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి