పాపాయి నవ్వులా
పచ్చిపాల నురువులా
సెలయేటి పరుగులా
పూలపై తుమ్మెద రొదలా
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
నిరాశల నిశీధిలో
స్వైర విహారం చేస్తున్నశిశిరాన్ని
కాలమనే కటకటాలలో
బంధించి వసంతమనే వేడుక వచ్చింది
ఆశలవెల్లువలే
అమృత ప్రవాహంగా
పిండారబోసిన పండువెన్నెలగా
ఆనందాల వెలుగులని కళ్ళాపి చల్లింది
గమ్య మెరుగని జీవన పయనంలో
అలుపులేని పోరాటానికి
పదపదమంటూ
ఎదగదిలో మదినదిలో
అలజడి రేపింది.
రమ్మనగానే రాని సంతోషాన్ని
పొమ్మనగానే పోని విచారాన్ని
పండుటాకులా నేలపాలయ్యే నిరాశని
కొంగొత్త ఆశల చివురులని
పూల పల్లకీలో మోసుకుంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
గెలుపులోని మాధుర్యాన్ని
ఆస్వాదించాలంటే
ఒక్కసారైనా ఓటమి పంచే
చేదుని చవిచూడాల్సిందే
సూరీని వెలుగు విలువ
తెలియాలంటే
కాయపు కిటీకీ లనే గాజుగుడ్లకి
అంధకారపు మబ్బులు ముసరాల్సిందే
ఎన్నికలు ఎందరికో
ఎన్నో కలల్ని కల్పించినా
గుప్పుగుప్పున తీర్చలేని
వాగ్దానాల వరాలు కురిపించినా
చెప్పేవారికి చేసేవారికి
మధ్యనున్న అంతరాన్ని
పసిగట్టి వారి పనిపట్టమంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
మమకారం కారం గా మారి
కడుపులో మంట రేపినా
అనురాగపుటుయ్యేలలో
ప్రణయ మాధుర్యాలు పంచుకున్నా
స్నేహమనే కమ్మదనం,
బాధ్యతల ఉప్పదనం,
ఎదురుదెబ్బల చేదునిజాలతో
ప్రతిరోజూ గడపక తప్పదంటూ
బాంధవ్యాల చక్కదనాలు
షడ్రుచుల సౌభాగ్యాలు
మేమున్నామంటూ పరుగులుతీస్తుంటే
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
ఏదో సాధించాలంటూ
కలల అలలు తరుముకొస్తుంటే
పరుగెత్తీ పరుగెత్తీ
గొప్పి తగిలి ముందుకు తూలి
బొప్పి కట్టి తల గిర్రున
బొంగరమై తిరిగినప్పుడు
చుట్టూ ఉన్న చందమామలు
గొల్లుగొల్లుమంటూ
నవ్వులబాణాలు విసిరినప్పుడు
విత్తిన మరునాడే వృక్షం రాదనీ
మొలకెత్తిన విత్తు మొక్కై
ఫలించక మానదనీ
కలలకైనా అలలకైనా
ఓర్పు , ఓదార్పూ ఉండాలంటూ
ఆడైనా మగైనా
సామాజిక స్పృహ కావాలంటూ
నచ్చిన మార్గం కోసం
నమ్మిన సిద్ధాంతంకోసం
పుట్టిన గడ్డ కోసం
బ్రతుకమంటూ ,
నలుగురినీ బ్రతికించమంటూ
ఉగాది పచ్చడి తెచ్చిన సందేశాలతో
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
విభేదాలకు , వైషమ్యాలకు విరోధిని నేనంటూ
విరోధినామ సంవత్సరం ......
విజయపరంపరలతో విచ్చేసింది.
తేట తెలుగుమాటలతో
ఆమని కమ్మని గానాలతో
తెలుగువారి తొలి పండుగ సంబరాలు తెచ్చింది
5 కామెంట్లు:
మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు..!
విత్తిన మరునాడే వృక్షం రాదనీ
మొలకెత్తిన విత్తు మొక్కై
ఫలించక మానదనీ
Chala Bagundhi...
ఓరినాయనో,
ఇది వరద, కాదు సముద్ర౦, కాదు కాదు ఉప్పెన, అబ్బె కాదు ఇది ప్రభ౦జన౦.
ప౦డగ౦టే కొత్తబట్టలూ తీపిచిరుతిళ్ళు అనుకునేవారి అమాయకత్వానికి గా౦డీవ౦.
చుట్టూ రాజకీయ౦, కుళ్ళూ కుత౦త్ర౦ అని ఇ౦ట్లో కూర్చునేవారి ఆవేశోధృతికి గ౦డికొట్టడ౦.
సమాజ౦ చూడువేలు చివర లేదని, మనతో కలిసినదే అని చెప్పే నవ్యభగవద్గీత సారా౦శ౦.
మీ కవిత కోసమైనా రోజుకో ఉగాది రావాలనిపి౦చేలా చేసే ఇ౦ద్రుని వజ్రఖడ్గ౦.
నా వ్యాఖ్యను అతిశయమని కొట్టీపారేయక౦డి. ఇది మీ కవితావేశ౦ నా మనసుకిచ్చిన ఉదయ౦.
మీకు నా కవిత నచ్చినందుకు, అభినందించినందుకు ధన్యవాదాలు.ఆనంద్ గారూ!
మీ కవితావేశం బావుంది!
సామాజిక స్పృహను కూడా కవితలొ జొప్పించి మంచి పనే చేసారు.
ఆక్కడక్కాడ కవితా నిర్మాణం కేవలం వాక్యాల్లాగా తోచింది.
సైజు గురించి కాకుండా ప్రతి లైనులో కవిత్వం జొప్పించామా లేదా అన్నది ఒకసారి కాదు కాదు వంద సార్లు పునశ్చరణ చేసుకున్నాకే మనం కవితను ప్రకటిస్తే అది కలకాలం విరాజిల్లి చదువరికి గుర్తుంటుంది.
ఈ నా వ్యాఖ్యలు ఒక సహృదయ పాఠకుడిగ, మీ శ్రేయోభిలాషిగానే చేస్తున్నాను సుమా, రంధ్రాన్వేషనగా అనుకోకండి. మీలో చిక్కని కవిత్వం చెప్పే సత్తా ఉంది, ప్రస్తానం కొనసాగిస్తునే ఉండండి, కళ గారు..
మీ ఈగ హనుమాన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి