పసిపాప నవ్వులా
పచ్చిపాల నురువులా
సెలయేటి పరుగులా
పూలపై తుమ్మెద రొదలా........................
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
నిరాశల నిశీధిలో
స్వైర విహారం చేస్తున్నశిశిరాన్ని
ఋతువులనే బాణాలను సంధించి
కాలమనే కటకటాలలో బంధించి...........................
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
ఆశలవెల్లువలే అమృత ప్రవాహంగా
పిండారబోసిన పండువెన్నెలగా
తెలుగువారి వాకిళ్ల ముంగిళ్ళలో
ఆనందాల వెలుగులని కళ్ళాపి చల్లుతూ..........
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
గమ్య మెరుగని జీవన పయనంలో
అలుపులేని అనుదిన పోరాటానికి
పదపదమంటూ ఎదగదిలో
మదినదిలో అలజడి పుట్టిస్తూ....................
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
రమ్మనగానే రాని సంతోషాన్ని
పొమ్మనగానే పోని విచారాన్ని
పండుటాకులా నేలపాలయ్యే నిరాశని
కొంగొత్త ఆశల చివురుల్ని పూల పల్లకీలో మోసుకుంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది
గెలుపులోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే
ఒక్కసారైనా ఓటమి పంచే చేదుని చవిచూడాల్సిందేనంటూ
సూరీని వెలుగు విలువ తెలియాలంటే
కాయపు కిటీకీ లనే గాజుగుడ్లకి
అంధకారపు మబ్బులు ముసరాల్సిందేనంటూ....................
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
ఎన్నికలు ఎందరికో
ఎన్నో కలల్ని కల్పించినా
గుప్పుగుప్పున తీర్చలేని
వాగ్దానాల వరాలు కురిపించినా
చెప్పేవారికి చేసేవారికి
మధ్యనున్న అంతరాన్ని
పసిగట్టి వారి పనిపట్టమంటూ
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
మమకారం కారం గా మారి
కడుపులో మంట రేపినా
అనురాగపుటుయ్యేలలో
ప్రణయ మాధుర్యాలు పంచుకున్నా
స్నేహమనే కమ్మదనం,
బాధ్యతల ఉప్పదనం,
ఎదురుదెబ్బల చేదు నిజాలతో
ప్రతిరోజూ గడపక తప్పదంటూ
బాంధవ్యాల చక్కదనాలు
షడ్రుచుల సౌభాగ్యాలు
మేమున్నామంటూ ఆహ్వానిస్తుంటే..............
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
ఏదో సాధించాలంటూ కలల అలలు
తరుముకొస్తుంటే్, పరుగెత్తీ పరుగెత్తీ
గొప్పి తగిలి ముందుకు తూలి,
బొప్పి కట్టి ,తల గిర్రున బొంగరమై తిరిగినప్పుడు
చుట్టూ ఉన్న చందమామలు గొల్లుగొల్లుమంటూ
నవ్వులబాణాలు విసిరినప్పుడు....
విత్తిన మరునాడే వృక్షం రాదనీ,
మొలకెత్తిన విత్తు మొక్కై ఫలించక మానదనీ
చెబుతూ... మునుముందుకు సాగిపొమ్మంటూ.......
కలలకైనా అలలకైనా ఓర్పు , ఓదార్పూ ఉండాలంటూ..........
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
ఆడైనా మగైనా
సామాజిక స్పృహ కావాలంటూ
నచ్చిన మార్గం కోసం
నమ్మిన సిద్ధాంతంకోసం
పుట్టిన గడ్డ కోసం
బ్రతుకమంటూ ,
నలుగురినీ బ్రతికించమంటూ.................
ఉగాది పచ్చడి తెచ్చిన సందేశాలతో..........
వసంతమనే వేడుక వచ్చింది
కొత్త ఉషస్సుల కానుకలు తెచ్చింది
విభేదాలకు , వైషమ్యాలకు విరోధిని నేనంటూ
విరోధినామ సంవత్సరం ......
విజయపరంపరలతో విచ్చేసింది.
తేట తెలుగుమాటలతో
ఆమని కమ్మని గానాలతో
తెలుగువారి తొలి పండుగ అంబరాన్నంటే సంబరాలతో.......
వసంతం వచ్చింది
కొత్త ఉషస్సులు తెచ్చింది.....
2 కామెంట్లు:
"తెలుగు కళ" లందు నేర్పరి తెలిసి కొనగ
తేట తెలుగున కవితలు వూట వోలె
రచన సాగగ నామది రమ్య రీతి
పొంగి పొరలెను మనసంత గంగ "సాక్షి"
"తెలుగు కళ" లందు నేర్పరి తెలిసి కొనగ
తేట తెలుగున కవితలు వూట వోలె
రచన సాగగ నామది రమ్య రీతి
పొంగి పొరలెను మనసంత గంగ "సాక్షి"
కామెంట్‌ను పోస్ట్ చేయండి