3 అక్టో, 2013

కుక్క బిస్కట్లు….

అనగనగా ఓ కుక్క
అబ్బెబ్బే బోలెడు కుక్కలు !
జాతి లక్షణం చూసుకుని
ఏదో ఎలగబెడ్తాయని
కొండంత అశతో పాపం పిచ్చి మేళాలు..
కనకపు సింహాసనాన్నెక్కించితే....  
అయ్యయ్యో ఏమైందే ....
జాతి లక్షణమే కానీ విశ్వాసం వాసన మచ్చు కైనా మిగల్లే...?
అర్థమైయ్యక తలా తాపు తన్నాకా
మొరుక్కుంటూ పొయ్యాయండోయ్ .. . 
మల్లొస్తామంటూ... ఎల్లొస్తామంటూ...
కుక్కలు తోకలూపుకుంటూ పొయ్యాయండోయ్......
తీరా ఆడదాకా పొయ్యినాక..
వెనకటి గుణం యాడికి పోతుంది మరి?
కుక్కలన్నీ ఒక్కొక్కటీ గుంటనక్కల్ల...దోరి.
పందికొక్కుల్లా  మేసి,
కొసరుగా కుక్క బిస్చ్కట్లు నమిలి... , నోట  కరచీ
మెల్ల మెల్లగ మన్ను తిన్న పాముల్లా వచ్చి 
గమ్మునున్నయి చూడండోయ్... 
గడ్డో గాదమో
ఏదైతే ఏమంట? కుక్కలు పడ్డాయాలేదా?
ప్రతికుక్కకూ ఓ రోజంటే ఇదేనా యేందీ .........
అలా అనుకుంటే .. రేపటి సినెమా ఇంకా ఇరగ్గొట్టుద్ది
భద్రం బిడ్డో .....

12 ఆగ, 2013

బ్రహ్మమొక్కటే...


ప్రకృతికెంత కష్టమొచ్చింది?
పరిణామమెన్ని సమస్యల్ని తెస్తోంది?
ఏర్లు , వాగులు కట్టలు తెంచుకుంటున్నాయి
పచ్చని చెట్లన్నీ కొట్టుకుపోతున్నాయి
ఎన్నో ప్రాణాలు అల్లాడిపోతున్నాయి
గాంభీర్యపు సాగరాల లోలోపల అన్నీ అల్లకల్లోలాలే
అడుగడుగునా సుడిగుండాలే
పాపం సముద్రాలకెంత కష్టమొచ్చింది!
ఒళ్ళంతా ఉప్పదనం తప్ప
ఏడ్వటానికో చుక్కలేదు
సముద్రాలేడ్వలేక ఏడుస్తున్నాయి

3 ఆగ, 2013

రోడ్డు పై కాగితం ముక్క

ఇంత మండుటెండల్లో ఒంటిపై
అతుకుల బిళ్ళలే'సిన
ఆ కంబళెందుకో  ?
ఎవరికీ లేని చలితో ఒంటరి పోరాటమా?
చలిచాటున
కండలు కరిగింగించే ఆకలిని
దాచుకోవటమా ?
లోలోపలి వెతల్ని, తన్నుకొచ్చే వేదనల్ని
అణచుకుంటున్నట్లు
ఆ మేకపోతు గాంభీర్యమేమిటో?

దుమ్ము పట్టిన దేహం
తెగ మాసిన తల
చూపుల్లో వైరాగ్యం
వెరసి, సాఢువుగా
పరిత్యాగిగా
తన్ను తాను దర్శించుకుంటున్నాడా?
ఆశ నిరాశలకి అతీతుడయ్యాడా?
ఆకలిని జయించి అమరుడయ్యాడా?
నిలువునా నిండిన ముసుగులోంచి
భారంగా కదిలే జత పాదాలు
ఇక తప్పదన్నట్టు
ముందుకు కదులుతుంటే
నీవెంటే నేనంటూ
అతని కాలికంటిన దుమ్ము

పెద్దోళ్ళని తాకి అపవిత్రం చెయ్యకుండా
అతను నడిచిన బాటను
శ్రద్ధగా శుభ్రం చేస్తున్న
కంబలి కొనను
ఏమాత్రం లక్ష్య పెట్టకుండా
గమ్యమెరుగని పయనంలో
గాలివాటున ఎగిరే
కాగితం ముక్కలా
అతను సాగిపోతున్నాడు.....
మండుటెండలో
వెచ్చదనాన్ని పెంచే
నల్ల కంవళిని కావళించు కుంటూ.........
కబళించిన దారిద్రయాన్ని ప్రేమించుకుంటూ....

                                                        --- Padmakala