
నరనరాల్ని పీడించే
భయభ్రాంతులు
అందమైన ప్రపంచాన్ని
అంతం చేసేందుకు
ఎక్కిన కొమ్మను
నరుక్కునేందుకు
వెర్రితలలు వేస్తున్న
మనిషి మూర్ఖత్వం.
నూరేళ్ళజీవితాన్ని
నేలపాలు చేస్తున్న వైనం
తలచుకుంటుంటే.......
ఉగ్రవాద భూతం
గంతలు కట్టుకుని
దారితప్పి రెచ్చిపోతోంటే...
పాలుగారే బుగ్గల
పాపాయిల్ని
పావులుగా చేసుకుని
బాల్యాన్ని చిదిమేస్తుంటే....
కర్తవ్యమేమిటంటూ
అంతరాత్మ ఘోషిస్తోంది
చేతగాని బ్రతుకు నీదంటూ..
నిస్సహాయంగా
పిచ్చిమనసు
నిట్టూర్చుతోంది
మత ఛాందసం
కలిపురుషునిగా మారి
సుకుమారమైన చేతుల్తో
మారణాయుధాలు
మోయిస్తూంటే....
బొమ్మలాటల బాల్యాన్ని
ప్రాణాల చెలగాటాలకు
ఉసిగొల్పుతుంటే......
పిచ్చి పిల్లల
తుపాకీలాటలకి పోయే
ప్రాణం ఖరీదెంతో
తెలియని
పిల్ల చేష్ఠలకి
గుండె తరుక్కుపోతోంది
కన్న బిడ్డల్ని
మానవ బాంబుల్ని
చేసే జీహాదీలు
తమ త్యాగానికి
గర్విస్తున్నారో..
కడుపుతీపి
రుచి మరచి
రక్తదాహంతో
మానవ మృగాలౌతున్నారో....
కనిపిస్తే
చెంపఛెళ్ళుమనిపించాలని
ఉంది
నిలువునా కడిగేయ్యాలనిపిస్తోంది