21 ఫిబ్ర, 2009

అచ్చ తెలుగు బామ్మ కన్నుమూసింది....

’బామ్మ ’ అన్న మాటకు అసలైన అర్థం చెప్పిన తెలుగువారి బామ్మ నిర్మలమ్మ అస్తమించింది. తెలుగు సినీ ప్రపంచానికున్న పెద్ద దిక్కు దిక్కులకు దూరంగా కనుమరుగయ్యింది. తెలుగు ప్రేక్షకులకి , నిర్మలమ్మ అభిమానులకి దుఃఖాన్ని మిగిల్చింది. 59 ఏళ్ళ క్రితం ’గరుడగర్వ భంగం’ సినిమాతో తెలుగు తెరపై తొంగి చూసిన రాజమణి తొలి అడుగుతో తడబడకుండా సుమారు 800 కి పైగా చిత్రాల మైలురాళ్లని దాటి , ’ప్రేమకు ఆహ్వానం ’ చిత్రంతో నడక ఆగిపోయినా ఆ అడుగుల చప్పుడు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో వినబడుతూనే ఉంది. ఖంగుమని మ్రోగే ఆమె స్వరం మూగబోయిందన్న నిజం జీర్ణించుకోవటం ఆమెతో అనుబంధం ఉన్న ఎందరికో పెద్ద పరీక్షగా మారింది. అలనాతి నట సార్వభౌములు ఎన్.టీ .ఆర్., ఏ.ఎన్.ఆర్. ల దగ్గరి నుండి నేటి తరం నటులు వెంకటేష్, హరీష్, బాలకృష్ణ ఇలా దాదాపు సినీ తారాగణమంతా ఏదో ఒక చోట ఈ బామ్మ నట ప్రస్థానంలో ఎదురుపడి ఆమె ఆప్యాయతాబిమానాలను రుచి చూసిన వారే. తల్లిగా అంతులేని ప్రేమను పంచాలన్నా, కొడుకు నిర్లక్ష్యానికి గురైన తల్లిగా కట్టలు త్రెంచుకున్న దుఃఖాన్ని పెదాలతో బంధించి కళ్ల ద్వారా హావభావాల ద్వారా చూపించి, చూసేవారి కంటతడి పెట్టించాలన్నా నిర్మలమ్మకే చెల్లింది. చాదస్తపు బామ్మగా ఒక ప్రక్క కుర్రవాళ్ళను సత్తాయిస్తూనే యువతరానికి ఆత్మీయతానురాగాల రుచి చూపించింది. చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్స్ లేకుండా స్వీయ ప్రతిభతో పైకి వచ్చిన ఒక గొప్ప నటి మరణం విచారించదగ్గ విషయం. ఆమెకు నివాళులర్పించటం మన సంస్కారం !

17 ఫిబ్ర, 2009

జనవరి 2009 - ఇండియన్ వింగ్స్ అసోసియేషన్ - చీరాల బహుమతి పొందిన రెక్కలు ( నా కవిత...)


మల్లెతీగ సంపాదకులు శీ కలిమిశ్రీ, శ్రీ సుగమ్ బాబు, శ్రీ శివారెడ్డి,నేను , శ్రీ శ్రీనివాస్ గౌడ్
' ఇండియన్ వింగ్స్ అసోసియేషన్ ' - చీరాల వారి ఆధ్వర్యంలో జరిగిన రెక్కలు కవితా పోటీలలో నేను రాసిన రెక్కలకు ద్వితీయ బహుమతి లభించింది. బహుమతి పొందిన రెక్కలు:
నమస్కరిస్తే
నష్టం లేదు
ప్రణమిల్లితే
ప్రాణం పోదు
బేడా ఖరీదు చెయ్యవు ~
భేషజాలు
------------------------------------ ఈ కవిత రాయడానికి నాకు లభించిన స్ఫూర్తి : చాలా మంది తామే గొప్ప వాళ్ళమని గర్విస్తూ ఉంటారు. తాము గొప్ప వాళ్ళమనుకోవటం ఎంత మాత్రమూ తప్పు కాదు. తాము మాత్రమే గొప్ప అనుకోవటం తో పాటు ఇతరులను తక్కువగా భావించి, తమ గొప్ప తనాన్ని చాటుకోవాలనుకోవటం క్షమించరాని నేరం. గొప్ప వాళ్ళు, మహాను భావులు , మహనీయులు లోకంలో కోకొల్లలు. నిత్యం మనకి ఎదురు పడే పెద్దవాళ్లని , చిన్నవాళ్లైన విఙ్ఞానవంతులని గౌరవించటం మన సంస్కారం . ఎవరైనా ఎదురుపడితే నమస్కరించటం మన భారతీయ సంప్రదాయం . కొందరు ఇతరులకి నమస్కరించటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ముందుగా నమస్కరించటం వల్ల తమ ప్రతిష్ఠకి భంగం కలుగుతుందనీ, ఎదుటి వారి కంటే తమ స్థాయి పడిపోతుందనీ అనవసరమైన భయాలతో , అహంకారంతో ఉండే వారిని ఉద్దేశ్యించి ఈ రెక్కలు రాశాను. భేషజాలు లేని మనస్తత్వానికి ప్రతిచోటా ఆదరణ లభిస్తుందని నాకు తెలిసిన చిన్న విషయాన్ని కవితగా మలచాను. ఈ కవిత ని బహుమతి కి ఎంపిక చేసిన తొలి తెలుగు రెక్కల కవి శ్రీ సుగమ్ బాబు గారికి , మలి రెక్కల కవి శ్రీ పి. శ్రీని వాస్ గౌడ్ గారు తదితర న్యాయనిర్ణేతలకి ధన్యవాదాలు. తోచిన భావాలకి అక్షర రూపం పెట్టటం మాత్రమే నాకు తెలుసు. మహా పండితులున్న కవితా సామ్రాజ్యంలో కవయిత్రి అనిపించుకోవాలనుకోవటం పెద్ద సాహసమే అనుకుంటున్నాను. నేను అంత సాహసం చెయ్యటం లేదు కానీ నా కవిత కి లబించిన బహుమతి తో పాటు పొందిన ఇంకొక గొప్ప బహుమతి ఇచ్చిన ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ శివారెడ్డి గారి చేతుల మీదుగా మొట్టమొదటి బహుమతి (కవితలకి) అందుకోవటం నా అదృష్టం గా భావిస్తున్నాను.

10 ఫిబ్ర, 2009

సంవిధాన సరస్వతి - బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ముఖాముఖి

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. ఈ గడ్డపై వందలాది మతాలు , జీవన రీతులు ప్రజల మధ్య సోదరభావాన్ని , సమైక్యతను చాటిచెబుతున్నాయి. వేదాలు, పురాణాలను అధ్యయనం చేసి తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పంచిపెట్టే మహత్తర బాధ్యతను చేపడుతున్న మహనీయులు పూజ్యనీయులు. వారం రోజులపాటు ఆదిత్య హృదయం ప్రవచనాలందించడానికి విజయవాడ కు విచ్చేసిన సరస్వతీ పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ముఖాముఖి చేసే అవకాశం నాకు కలగటం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ప్రశ్న: పాశ్చాత్య వ్యామోహం నానాటికీ పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ కోసం మన కర్తవ్యం ఏమిటి?
సామవేదం వారు: గొప్ప గొప్ప భావాలు, సంస్కారాలు పాశ్చాత్యుల నుంచి అయినా నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. కానీ మనవైన సంస్కృతీ మూలాలు నశించకుండా జాగ్రత్త పడాలి.

ప్రశ్న: మొక్కై వంగనిది మ్రానై వంగదంటారు పిల్లల్ని సత్ప్రవర్తన గల వ్యక్తులుగా తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
జవాబు: నైతికత , ఆథ్యాత్మిక సంస్కారాలు పెద్దయ్యాక చూసుకుందాం అనుకోవటం సరికాదు. ఆథ్యాత్మికత వృద్ధుల విషయం కాదు. జీవిత చరమాంకంలో చేపట్టాల్సిన అంశం కానేకాదు. సంస్కృతి - ఆధ్యాత్మికతలు జీవితానికి సంబంధించిన సమగ్ర జీవన విధానాలు. జీవితం ఆరంభం లోనే జీవించటం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు. పనిగట్టుకుని పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు.

ప్రశ్న: రోజు రోజుకీ హింస పెరిగిపోతున్న పరిస్థితుల్లో యువత పయనించాల్సిన మార్గం ఏది?
జవాబు: విద్యా బోధనలో నైతికతకు ప్రాధాన్యత రాను రానూ తగ్గించటమే అన్ని అరిష్టాలకీ మూలకారణం. విలువలను బోధించే మానవ నాగరికతా సంబంధ గ్రంథాలను మత గ్రంథాలుగా భావించి బోధించకపోవటం విచారకరం. హింసని హీరోయిజంగా చూపటమే ముఖ్య లక్ష్యంగా సినిమాలు , సీరియళ్ళు యువతపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. పూర్వం ’ విద్యాదదాతి వినయం ’ అనేవారు . విద్యకి ప్రథమ ప్రయోజనం సంస్కారం. అంతిమ ప్రయోజనం సంపాదన. ప్రథమ ప్రయోజనాన్ని విద్యావ్యవస్థ విస్మరించకూడదు. తమ పిల్లలు కొత్తగా కనిపించాలనేది పెద్దల తాపత్రయం. అలా చెయ్యలేకపోతే వెనుకబడినట్లు భావించటం వల్ల విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పబ్ సంస్కృతి , ఆకర్షణలు , వ్యామోహాలను పెంచే వాతావరణం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి ఏకైక ఔషథం ఆథ్యాత్మిక యోగ జీవితం. దీన్ని పెంచటం కోసం సమాజంలో ప్రతిఒక్కరూ పూనుకోవాలి.

ప్రశ్న: ’పరమత సహనం’ అన్న పదానికి స్పష్టమైన అర్థం చెప్పండి. ప్రతి వ్యక్తీ పరమత సహనం కలిగి ఉండి , భావాన్ని చాటుతూ ఉన్నత జీవనాన్ని గడపాలంటే ఏమి చేయాలి?
జవాబు: ఎవరి మతంలో వారు బ్రతుకుతూ ఇతర మతాలను బ్రతకనివ్వటమే పరమత సహనం. సృష్టిలో ఏదో ఒక్క మతమే గొప్పది కాదు. ప్రతి మతమూ ప్రజాహితమే. ఎవరి తల్లి వారికి గొప్ప అయినప్పటీకీ ఇతర స్త్రీలను మాతృభావనతో చూడటం ఉత్తమ సంస్కారం. ఇదే సిద్ధాంతాన్ని మతాల పట్ల కూడా అన్వయించాలి. ఎవరు ఏ మతంలో పుట్టారో చనిపోయే వరకు అదే మతంలో బ్రతకాలి. ఇతర మతాలను గౌరవించాలి. తమ వదలకుండా ఇతర మతాలలోని గొప్ప భావాలను ఆమోదించవచ్చు. దీనికోసం మతం మారాల్సిన పనిలేదు. కొన్ని మతాలకి ప్రత్యేకత నిచ్చి మరికొన్ని మతాలను ఉపేక్షిస్తే అది కాలక్రమంలో అల్లకల్లోలాలకు దారితీస్తుంది.

ప్రశ్న: మనిషి జీవితంలో ఆథ్యాత్మికత ఎందుకు అవసరం ?
జవాబు: మానవ నాగరికతకు పరిపూర్ణత ఆథ్యాత్మికత . పశు స్థాయిలో జన్మించిన మానవుడు సంస్కారాలతో మనిషిగా ఎదిగి దివ్యజీవిగా పరిణమించడానికి ఆథ్యాత్మికతే శరణ్యం. ఆథ్యాత్మికత లేని జీవితాలలో శాంతి కరువవుతుంది. స్వార్థం పెరుగుతుంది. కామక్రోధాది ఉద్రేకాలను నిగ్రహించుకోలేము. ఆథ్యాత్మికత ఉన్న వారికి రజో గుణ , తమో గుణ ప్రకోపాలు తగ్గి, సహనం , త్యాగం వంటి సాత్విక గుణాలు అలవడతాయి. ఇది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రశ్న: ’మన జీవితం దైవ నిర్ణయం ’ అని ప్రతి పనినీ భగవంతునిపై శరణాగతి భావనతో వదలివేయాలా? లేకపోవటానికి మన పుట్టుకను అర్థవంతం చేసుకోవటాన్కి (జన్మ సార్థక్యానికి) ప్రతి క్షణమూ మానవ ప్రయత్నం చేయాలా?
జవాబు: విధి నిర్ణయం గురించి మనకు అనవసరం . మానవ ప్రయత్నం పైనే మన దృష్టిని కేంద్రీకరించాలి. విధి నిర్ణయం అనే మాటను అనుభవం లో తీసుకోవాలి కానీ ఆచరణలో తీసుకోరాదు. పురుష ప్రయత్నాన్ని సఫలీకృతం చేయటానికి దైవ శక్తిని ప్రార్థిస్తాం. సుఖ దుఃఖాల అనుభవాలలో చెక్కుచెదరకుండా నిలిచేందుకు విధి నిర్ణయం అనే మాట మనో నిబ్బరానికి సహకరిస్తుంది.

ప్రశ్న: విద్యలన్నిటిలోనూ గొప్ప విద్య ఏది?
జవాబు:’అథ్యాత్మ విద్యా విద్యానాం’ అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమాత్ముని తెలుసుకునే విద్యే అసలైన విద్య. ఆథ్యాత్మికత తర్కానికి, యుక్తికి లొంగనిది. సాధన , ఉపాసన వల్లనే సాధ్యమవుతుంది.

ప్రశ్న: ఉత్తమమైన సంస్కారం ఏది?
జవాబు: ఏది ఇతరులు చేస్తే మనకు బాధ కలుగుతుందో దానిని మనం ఇతరులకు చెయ్యకుండా ఉండటం అత్యుత్తమ సంస్కారం.

శ్రీ షణ్ముఖ శర్మ గారు, శ్రీమతి పుష్పలత గారు

సూర్యుడు ఎంతో గొప్పవాడని , జ్వలించే అగ్ని గోళమైనా తన ప్రతాపాన్ని అల్ప ప్రాణులపై చూపకుండా ప్రతి ప్రాణిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే వెచ్చదనాన్ని ఇచ్చి కాపాడుతాడని చెప్పారు సామవేదం వారు. అలాగే అసామాన్యమైన పాండిత్యాన్ని , వేద విఙ్ఞానాన్ని తమ లోనే దాచుకుని నేనడిగిన సామాన్యమైన ప్రశ్నలకి నాకు అర్థమయ్యే భాషలో వివరంగా చెప్పి ఆ మాటలలోనే ఎంతో గొప్ప సారాంశాన్ని సమాజానికి అందించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.