Pages

25 అక్టో, 2009

ప్రతి అడుగూ ఓ ప్రశ్నే…

స్తొర్య్ ౩

 

 

ఎన్ని సాధించినా, ఎంత ఎదిగినా

అప్పుడప్పుడూ

నీలో ఒదగలేనంటుంది వెర్రి మనసు .

యాంత్రిక జీవనానికి పుట్టుబానిసవనీ

గుండెలేని భావాల గూడువౌతున్నావనీ

నిర్జీవంగా పడిఉన్న మనసు

అప్పుడప్పుడూ నిన్ను ధిక్కరిస్తుంది

మళ్ళీ నన్ను బతికించమంటూ

బ్రతిమాలుకుంటుంది

 

నిలకడలేని ఆలోచనలు

నిలబడలేని సిద్ధాంతాలమధ్య

మనసంతా అయోమయం ఆవరిస్తుంది.

ఉప్పెనలాంటి అసహనం పెల్లుబికి వస్తూ

ఉన్న ఒక్క నాలుకని

నియంత్రించుకోలేకపోతే,

తోచినట్టు దాన్ని ఆడనిస్తే

లెక్కలేనన్ని నాలుకలు ఒక్కసారిగా

ఎగబడి మీదపడి దాడి చేస్తాయి,

నిన్ను  మింగేస్తాయి

 

ప్రపంచాన్ని చూసేందుకు

నీకున్నది రెండే రెండుకళ్ళు

ఆ కళ్ళు మసకబారితే

దిక్కు తోచని  తరుణంలో

పొరపాటున దారితప్పితే పెడదారిన పడితే

ప్రతిక్షణం అదేపనిగా

నిన్ను పరిశీలించే ఎన్నెన్నో కళ్ళు

శూలాలై పొడిచేందుకు సిద్ధమౌతాయి.

 

flowers

 

అభిమానాలు అనుబంధాలు

అమృతప్రాయాలు

అన్ని రోగాలను శమింపజేసే ఔషథాలు

అనుక్షణం వాటిని వెంటపెట్టుకో

నీ ప్రయాణం లో తోడై వచ్చే బంధాలని

పవిత్రంగా కాపాడుకో

నిన్ను నువ్వుగా నిలబెట్టుకో

 

 

చూసే చూపు పలికే పలుకు

హృదంతరాలకి బదులిచ్చుకుంటూ

జాబిల్లి కురిపించే వెన్నెలలా

స్వచ్చమైన గంగా ప్రవాహంలా

సాగిపోతుంటే

విశాలమైన మనస్సాగర తీరాన

ప్రశాంత స్నేహ సౌథాన

వెలకట్టలేని కోకిల గానాలుగా

బంధాలు  ఆనందాలు

కలకాలపు కానుకలౌతాయనీ

ఎనలేని సంపదలౌతాయనీ గుర్తుపెట్టుకో….

నీ బాటను వెలుగుబాటగా మలచుకుంటూ

నీ వెలుగును ప్రపంచానికి పంచుకుంటూ ధైర్యంగా మునుముందుకు సాగిపో……….

2 అక్టో, 2009

అప్యాయతే వారిపాలిట అమృతం !

ప్రతి మనిషికీ వద్దన్నా వచ్చిపడే వృద్ధాప్యం చర్మపు ముడతలలో అపారమైన అనుభవాన్ని , దానితోపాటే చెప్పలేనన్ని భయాందోళనలని , అభద్రతా భావాన్ని వెంట తెస్తుంది.

 

నిన్నటిదాకా ప్రపంచాన్ని గెలవగలనన్న ధీమాకి బదులుగా నేడు ఏదో కోల్పోతున్న భావన మనసును కలచివేస్తుంది. సమాజంలో తన కంటూ ఓ గుర్తింపునందించిన నాజూకైన శరీరం నిస్తేజం గా మారి నిరుత్సాహానికి , నిర్లిప్తతకు మనిషిని చేరువ చేస్తుంది.

 

నిన్నటి యువకులు నేటి వృద్ధులైనట్లే నేటి యువకులు రేపటి వృద్ధులన్న సంగతి తెలిసి కూడా వృద్ధులని నిరాదరణకి గురిచేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

 

పరిస్థితులు అనుకూలించక కొందరు, తమ పొట్టనే గడుపుకోలేక కొదరు, భార్య మాట జవదాటని  భర్తలు  కొందరు భర్తని ఒప్పించలెని భార్యలు కొందరు, పైసాకి కొరగావని కొందరు , తీరికలేదని కొందరు, వీలుకాదని కొందరు కారణాలేవైతేనేం.?

                ఇంటికి పెద్ద దిక్కైన వృద్ధులని దిక్కులేని వారిని  చేస్తున్నారు.ఏ దిక్కూ లేక రోడ్లపై తిరుగుత్రూ,రైళ్లలో, బస్టాపుల్లో గుళ్ళముందు ఎక్కడ పడితే అక్కడ  ఎవైర్నైనా సరే చెయ్యి చాపి అర్థిస్తూ  మంటగలిసిన మానవత్వానికి వారు మూగశాక్ష్యాలుగా మిగిలిపోయేవారెందరో.

 

అన్నీ ఉండి ఆందరిమధ్యా ఉన్నా ఆత్మీయతలకు , అనురాగానికి దూరంగా  తియ్యటి పలకరింపుకు నోచుకోలేని వారు కొందరు.

 

ఈ రోజు అంతర్జాతీయ వృద్ధుల దినోవ్సం సందర్భంగా మీ వంతు తోడ్పాటుని మీ పరిధిలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరించండి….