30 జూన్, 2009

ఏది నిజం? ఏది అభద్ధం ?

నిజాన్ని తోసుకుంటూ

అబద్ధం నాలుగడుగులు

ముందుకు దూసుకెళ్ళుతోంటే..

అబద్ధాని అసహ్యించుకుంటూ

నిజం నలభై అడుగులు వెనక్కి పోతోంది

ఏది నిజమో ఏది అభద్ధమో

అర్థం కాని అయోమయంలో

అమాయకుడు

నిజం చెప్పలేక

అబద్ధం చెప్పకుండా మనలేక

క్షణ క్షణ రణ రంగంలో

ఆయుథాలు కోల్పోయిన సైనికుడై

నిస్తేజుడై విస్తుపోయి చూస్తున్నాడు

ఏది గమ్యం?.. ఏమి గమనం?

జీవన పోరాటంలో బదులు లేని ప్రశ్నలు

నిలకడలేని సమాధానాలు

27 జూన్, 2009

అత్యవసర పరిస్థితి అంటె… తెలుసా మీకు?( 108 ఆవేదన)

ఓ మితృలారా ! నన్ను గుర్తుపట్టారా?

మీ సిఎమ్మ్ గారూ…  కుయ్ కుయ్ అంటూ…కూసి మరీ  నన్ను పిలుస్తారు..

జనం నన్ను చూసి ఎంతో గౌరవంతో దారిచ్చి నన్ను అందరికంటే ముందే పంపిస్తారు.

నా వల్ల సాయం పొంది, ప్రాణాలు దక్కించుకున్న వారు నన్ను నడిచే దేవాలయం అంటూంటారు.

తమ దాకా వచ్చేసరికి నన్నాడిపోసుకున్న వాళ్ళు సైతం నాకు జోహార్లు చెప్పి లెంపలేసుకున్నారు.

 

ప్రాణాల మీద కొచ్చిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కోదేవుణ్ణి తలచుకుంటే అందరూ కలిసి తల్చుకునేది మాత్రం నన్నే.

 

                                                       MOBLILE HUMANITY

గుర్తు పట్టారా? నేనే మీ 108 వాహనాన్ని.

మీరు గమనించారో లేదో .. ఈ మధ్య నా మనసు చెప్పలేనంత ఆవేదనతో భారమౌతోంది.

కారణం మీకు తెలియంది కాదు. తెలిసినా తెలియక పోయినా చెప్పటం నాధర్మం.

మీరు అందుకు ఎలా స్పందిస్తారో నాకనవసరం.

ఎందుకంటే మందులు సృష్టించి హెచ్చరించటం వరకే పరిశోధకుల వంతు. వాటిని సద్వినియోగ పరచుకోలెకపోతే ఆ నష్టానికి  ఎవరూ బాధ్యులు  కాదు.

నా విషయంలో కూడా ఈ మధ్యకాలంలో మీరు ప్రవర్తిస్తున్న తీరు ఇలాగే ఉందన్న సంగతి ఇప్పుడు మీకు నేను చెప్పదలచుకున్నాను. మీకు తప్పనిపించినా ఒప్పనిపించినా చెప్పక తప్పదు.

ఒకవేళ నేను ఇప్పుడు చెప్పకపోతే  ఇప్పుడు ఇన్ని ముప్పు తిప్పలు పెడుతున్న మీరే రేపు నన్ను తప్పుపడతారు.

అవును మరి నరుడి నాల్కకి ఎముక లేదు కదా!

మీ సమస్య లు తీర్చడానికి నేనొస్తే నాకు మీరు సమస్యగా మారి నన్ను సమస్యల వలయం లోకి నెట్టేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే:

108 నిన్న మొన్నటి దాకా చాలా ధైర్యంతో పరుగులు తీస్తూ, ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఎందరినో అత్యవసర వైద్యం అందించింది. అలగే ఇప్పుడూ , ఇకపైనా చెయ్యాలనే ఉన్నా మీరు చేసే పనులు భవిష్యత్తులో నా మర్యాదని మంటగలుపుతాయనే భయంతో వణికిపోతున్నాను.

 

ఎందుకంటారా? అదీ చెబుతాను. గతంలో ఎవరైనా చావు బ్రతుకుల మధ్య కొట్తు మిట్తాడుతుంటే వెంటనే నన్ను పిలిస్తే  ఆఘమేఘాల మీద పరుగెత్తే దాన్ని. చెమటలు కక్కు కుంటూ మా పైలట్లూ, ఈఎమ్టీలూ తినీ తినకా , తినేవారు ఎక్కడివక్కడ పడేసి ’అమ్మో ప్రాణం !” అనుకుంటూ హడలిపోయేవారు.

ఆ ప్రాణం నిలబడితే కానీ నేను , నా సిబ్బంది గాలి పీల్చుకు నే వాళ్లమే కాదు.

జనం కూడా నేను ఎక్కడైనా ఆగితే చాలు. ఏమైందాని వింతగా చూసేవారు.

        కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీ అమాయకత్వమో/ అతి తెలివితేటలో తెలియదుకానీ

నన్ను నా సేవల్ని చాలా తేలికగా / చవకగా వస్తున్నాయని భావించి కాబోలు;

ఇష్టమొచ్చినట్తు వాడుకుంటూ అసలు సమస్యల్లో ఉన్నవారికి చేరనీయకుండా అడ్దుకుంటున్నారు.

ఎంత గవర్నమెంటు సొమ్మయితే మాత్రం మరీ అంత దుబారా చేసేస్తారా మీరు?

 

చిన్న చిన్న గాయాలు తగిలినా, కాస్త ఒంట్లో నలతగా ఉన్నా సరే.. 108 అంటూ పొలికేక ( ఫోన్ కాల్) తో నన్ను నన్ను గాభరా పెట్టేస్తున్నారు. ఒక సైకిల్ , ఒక మోటార్ సైకిల్ గుద్దుకుని చిన్నగా మోకాలు చిప్ప పగిలినా /కాస్త తలతిరిగి కళ్ళు తిరిగి పడ్డా /  కాలో చెయ్యో వాచి సలపరం చేసినా / ఇలాగే చిన్న సమస్యలకే  నన్ను పిలుస్తూ,  అది మా హక్కు నువ్వున్నదెందుకంటూ నన్నే ప్రశ్నిస్తున్నారు.

 

ఆటో ఖర్చు కలిసివస్తుందని కొందరు, దర్జాగా ప్రయాణం చెయ్యొచ్చని కొందరు, ఉచితంగా కట్లు కట్టి, ఇంజక్శన్ ఇస్త్తారని కొందరు… పర్యవసానం విలువైన ఓ ప్రాణం ఎక్కడో సహాయం అందక నేల రాలిపోతుంది.

మీకు నా సేవలు ఉచితమే కావచ్చు. కానీ ప్రతీ కాల్ కీ ప్రభుత్వం దాదాపు 3 , 4 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నదన్న సంగతి మీకు తెలియదు. మీరు తెలుసుకోవాలనుకోరు.

ఆ భారం మర్లా ధరలు , పన్నుల రూపంలో మీకే.

పైగా నిధులు అనవసరపు కాల్స్ తో దుర్వినియోగం చేశారంటూ నా వాళ్ళకె విమర్శలు.

పోనీ అనుమానం ఉన్న కాల్స్ కి వెళ్ళకుండా మానేద్దమనుకుంటే తెల్లారి మీరే మళ్ళీ పేపరోళ్ళకి చాడీ లు చెబుతారు. 108 సకాలానికి రాలేదని.. అప్పుడు మాకు పైనుండి చీవాట్లు.

ఇక మా సిబ్బందికే మో ఇలాంటి కేసులు చూసీ చూసీ విసుగెత్తిపోతోంది. ఏం చేస్తాం తప్పదుకదా అనుకుంటూ అయిష్టంగా వాళ్ళు వెనుదిరిగుతూంటే నా మనసు చివుక్కుమంటోంది.

నా భయమేమిటంటే.. ఈ తంతు ఇలాగే జరిగితే 108 కి ఇతర టాక్సీలకి తేడా ఏమిటిలే అని జనం నిర్లక్ష్యం చేస్తారనీ..  చూసి చూసి ఎప్పడైనా నేనూ నా సిబ్బంది ’ నాన్నా పులి’  కథలాగా స్పందించలేకపోతామేమో ..

మీ  తప్పుకి ఎవరికో శిక్ష పడుతుందేమో… జనం ఆ ఏముందిలే… అయితే అన్ని కేసులూ ఎమర్జెన్సీలు కావు’ అంటూ నా దారికి అడ్దుగా నిలబడతారేమో నని .

    ఆలోచించండి……

ఆలోచించండి…

ఆలోచించండి…

ఈ తప్పు మీరు చేసి ఉండకపోవచ్చు .. కానీ చేస్తున్న వారిని చూసి కూడా  మందలించకపోతే ఆ తప్పులో మీకూ భా గం ఉన్నట్టే.

             ఇది మీ సొత్తు. దాన్ని పొదుపుగా అవసరమైనప్పుడే వాడుకోండి.

గుర్తుంచుకోండి    108 విలాస వస్తువు కాదు. మీరు కావాలనుకున్నప్పుడు విహరించడానికి.

విలువైన ప్రాణాలను కాపాడే ఓ అరుదైన వస్తువు!

 

24 జూన్, 2009

abcdefghijkl

abcd abceabce

22 జూన్, 2009

వెబ్ ఆల్బమ్స్....

నిన్న ఒక కరిగిపోయిన కల. రేపు ఆశల చేపలు చిక్కుకున్న వల. నేడు మన కళ్ళముందున్నా కనురెప్పపాటులో కనుమరుగైపోతుంది.నిన్నటి అనుభవాలను , నేటి అనుభూతులను మధురస్మృతులుగా పదిలం చేసుకోవటానికి ఫోటోగ్రఫీ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది

" కాలం , ప్రవాహం ఎవరికోసమూ ఆగవు." కాలాన్నీ , ప్రవాహాన్నీ ఆపే శక్తి మనిషి కి లేకపోయినా మనిషి సృష్టించిన ఫోటోలకు ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే.

.ఎప్పుడో ఒకప్పుడైనా దాదాపు అందరూ ఫోటోలపై మోజు పడేవారే. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చుని గడచిన కాలంలోని రూపురేఖలను ఫోటోల లో చాటుగా చూసుకుని మురిసిపోనివారుండరు. మొన్న మొన్నటి వరకూ ఫోటోలు అంటే కేవలం డబ్బున్న వాళ్ళే అంత ఖర్చుపెట్టగలరు అన్న అపోహ నుండి జనం బయటికి వస్తున్నారు.

.

జీవితమనే పుస్తకంలో తిరిగిరాని ఎన్నో మధురానుభూతుల్ని తిరగేసి, కళ్లముందు మన గతాన్ని చూపిస్తాయి ఫోటోలు. పాత సినిమాల్లోని మాంత్రికుడి అద్దం ఎక్కడెక్కడి చిత్రాలనో చూపించినట్టు ఈ కాలంలో కంప్యూటర్లు ఇప్పటికిప్పుడు తీసిన ఫోటో క్షణాల్లో... అతికొద్ది నిముషాల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా సరే..కావాలనుకున్న వారి కళ్ల ముందుంచుతుంది. స్వాములవారి దివ్య దృష్టికి మించిన అద్భుతమైన దృష్టిని పొంది వెబ్ ఆల్బమ్స్ వినూత్న సృష్టికి విధాలౌతౌన్నాయి.

ఫోటోలు తీయించుకుని ఆల్బమ్లలో భద్రంగా దాచుకొని గుర్తిచ్చిన్నప్పుడల్లా చూసుకుంటూండటం , మధ్యమధ్యలో పిల్లల తాకిడికి అవి పాడైతే మళ్ళీ జాగ్రత్తగా కుట్టటం , వాళ్ళని విసుక్కోవటం ఇవన్నీ పాతకాలం పద్ధతులు.

ఇదివరలో ఎవరయినా చుట్టాలు బంధువులు ఇంటికొస్తే వాళ్లున్నంత సేపు ఎక్కడెక్కదివో ఫోటో ఆల్బమ్స్ తెచ్చి చూపించేవాళ్లం.

కానీ నేటి పద్ధతులు చాలా మారిపోయాయి. సమాచార రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులలో భాగంగా ఇంటర్నెట్ పుణ్యమాని ఫోటోలు పదికాలాలపాటు పదిలంగా ఉంచే బాధ్యతను వెబ్ ఆల్బమ్లు స్వీకరించాయి. దూరప్రాంతాల్లో ఉన్న మిత్రులతో మధురస్మృతులు పంచుకోవడానికి వెబ్ ఆల్బమ్స్ మంచి మార్గాలు. ఇంటి నుండి ఉద్యోగాలు , చదువులకోసం దూరం గా వెళ్లినప్పుడు మనవాళ్లపై బెంగ పెట్తుకున్నప్పుడు వెబ్ ఆల్బమ్స్ చుట్టలై పలకరిస్తాయనటంలో అబద్ధం లేదు.

ఆఫీసు విషయంలోను , వృత్తి రీత్యా సమాచారం పంపించే ఈ మెయిళ్ల మాదిరిగానే ఫోటోలు ఇతరులకి పంపడానికి వెబ ఆల్బమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం ఇంటర్నెట్లో మన పేరుమీద అకౌంట్ తెరుచుకునే వీలు కల్పిస్తున్నాయి చాలా వెబ్సైట్స్. ఈ మధ్య కాలంలో మామూలుగా మెయిల్ ద్వారా ఫోటోలు పం పించే వారి కంటె వెబాల్బమ్సే విరివిగా ఉపయోగిస్తున్నవారే ఎక్కువ.
.
ఒక్కో పొటో మెయిల్ చెయ్యాలంటె చాలా సమయం పట్టటం వల్ల సమయం తో పాటు ఒకే చోట ఫోటోలు స్లైడ్ షోలా గా చూసే వీలు ఉండటం వల్ల వీటికి రాను రానూ వీటి వినియోగం పెరుగుతోంది.వెబ్ ఆల్బమ్స్ సౌకర్యాన్ని అందించే వెబ్సైట్లు ఇప్పుడు కోకొల్లలుగా ఉన్నాయి.
సాధారణం గా ఎక్కువమంది వినియోగిస్తున్న వెబ్ ఆల్బమ్ పీకాసా వెబ్ ఆల్బమ్ . పీకాసా తో పాటు ఫ్లిక్కర్, నేవీ, పిక్చర్ ట్రయల్ వంటి వెబ్సైట్లు వెబ్ ఆల్బమ్స్ ని ఆఫర్ చేస్తున్నాయి

దాదాపు అన్ని వెబ్సైట్లూ ఉచిత, మరియు ఖరీదుకు వెబ్ ఆల్బమ్ సర్వీసులను పిసి వాడకం దారులకు అందిస్తున్నాయి .

ఎక్కువ స్స్టోరేజీ స్పేస్ , ఫ్రీ ప్రింటింగ్ , బెటర్ షేరింగ్ , ప్రకటనలు లేకుండా ఆల్బమ్ ని అందించటం వంటి ఫీచర్ల ద్వారా ఉచిత వాడకం దార్లకంటే ప్రీమియం వాడకం దార్లకు అదనంగా కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి.

ఫోటో లని అప్లోడ్ చేసే విధానంలో ఒక వెబ్సైట్ కీ మరో వెబ్సైట్ కీ చాలా తేడాలున్నా మొత్తానికి అన్ని వెబ్సైట్లూ యూజర్ల సంఖ్య పెంచుకోవటం కోసం, కొత్తవారిని ఆకట్టుకోవటం కోసం ఉచిత ఫోటో ప్రింట్ ట్రయల్స్ వంటి అదనపు తాయిలాలు ఎరగా పెడుతున్నాయి.

ఎలా క్రియేట్ చేసుకోవాలి?

కంప్యూటర్ ఇంట్లో / కార్యాలయాల్లో ఉన్నవారు, లేని వారూ కూడా ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే వెబ్ ఆల్బమ్స్ ని సద్వినియోగ పరచుకోవచ్చు.

ఇంట్లో కంప్యూటర్ లెని వారు కూడా పెన్ డ్రైవ్ ల ద్వారా వారి ఫోటోలను ( కేవలం డిజిటల్ ఫోటోలు మాత్రమె) ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళీ

అక్కడున్న పీసీ లలో నుండి వివిధ వెబ్సైటలకు వెళ్ళి నచ్చిన దానిలో ఫోటోలు అప్లోడ్ చేసుకోవచ్చు.

ఎలా : ఒకవేల మీ ఇంట్లో కానీ , ఇంటర్నెట్ కేఫ్లో కానీ వెబ్ ఆల్బమ్స్ ఆల్రెడీ ఇన్స్స్టాల్ అయ్యి లేకపోతే .. గూగుల్ సెర్చింజనుకు వెళ్ళి వెబ్ ఆల్బమ్స్ అని వెదికితే వివిధ వెబ్సైట్లు కనిపిస్తాయి.

నచ్చిన వెబ్సైట్ను ఎంచుకుని ఆ వెబ్సైట్ అందించే వెబ్ ఆల్బమ్ని డౌన్లోడ్ చేసుకోవాలి.

తర్వత వెబ్సైట్లోకి ప్రవేశించి రిజిస్టర్ చేసుకోవాలి. అది సాధరణంగా ఒక సెక్యూరిటీ మెయిల్ ఐడి ని అడుగుతుంది. అందుకు మీకున్న ఏదో ఒక మెయిల్ ఐడిని అక్కడ టైప్ చెయ్యాలి.ఉదాహరణకి ఫ్లిక్కర్ కి యాహూ అకౌంట్ తో యాక్సెస్ చెయ్యవచ్చు .

పికాసాకు జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఆ వెబ్ సైట్ మీకు url ( Uniform Resource Locator ) ని ఇస్తుంది.ఆ url మీ వెబ్ ఆల్బమ్ చిరునామా అన్నమాట.

మీ మిత్రులకు, ఆప్తులకు మీ ఆల్బమ్ చూపించాలనుకుంటె మీరు పొందిన url చిరునామా ఇవ్వాలి. ఒక సారి url పొందిన తర్వాత మీపర్సనల్ ఇన్ఫర్మేషన్ నీ , మీ ఫ్రెండ్స్ జాబితాని కూడా మీ అకౌంట్లో చేర్చుకొవచ్చు.

అందులోని షేరింగ్ ఆప్షన్ ద్వారా మీ ఫోటోలను వారితో పంచుకోవచ్చు. దూరప్రాంతాలలో ఉన్న వారు మీ ఫోటోలను వీక్షించవచ్చు. అందువల్ల ఎప్పుడైనా ఫోటోలు ఎవరికైనా మెయిల్ చెయ్యల్సి వచ్చినపుడు ఎక్కువ సమయం వృథా అవుతుందన్న చింత లెదు.

జాగ్రత్తలు: మనం ఎప్పటికప్పుడు మన ఫోటోలని వెబ్ ఆల్బమ్స్లో పెట్టినంత మాత్రాన మన ఫోటో ఆల్బమ్ లో పెట్తినంత మాత్రాన మన ఫోటోలు శాశ్వతం గా ఉంటాయన్న నమ్మకంతో మన పీసీ లోని ఫోటోలను డిలీట్ చెయ్యటం కూడా శ్రేయస్కరం కాదు. అంతర్జాలం ( ఇంటర్నెట్) కు ఎప్పుడు ఏ సమస్య ఏర్పడుతుండో ఊహించటం కూడా అసాధ్యం .
ఏ సర్వీస్ ని బడితే ఆ సర్వీస్ ని నమ్ముకుని అన్ని ఫొటోలూ అప్ లోడ్ చేసి పిసిలో నుండి తొలగించకూడదన్న విషయాన్నిన్ గుర్తుంచుకోవాలి.
కొన్ని సర్వీసులు మధ్యలోనే చేతులు ఎత్తేయవచ్చు అప్పుడు తీపిగుర్తులుగా దాచుకున్న ఫొటోలు పోతాయి
కాబట్తి తగినన్ని డీ.వీ.డీలలో ముందు జాగ్రత్తగా మన ఫోటోలను భద్ర పరుచుకోవటం మంచిది.
వెబ్సైట్ల ను ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా స్తోరేజీ స్పేస్ ఎంత అందిస్తోందీ తెలుసుకోవాలి.పికాసా, ఫ్లిక్కర్ వంటి రిలయబుల్ సర్వీసులను నమ్ముకోవటం శ్రేయస్కరం.
వందలాది వెబ్ ఆల్బమ్ సదుపాయాన్ని అందించే సర్వీసులు ఉన్నా
ప్రస్తుతం ఉన్న వాటిలో పికాసా, ఫ్లిక్కర్, ఫొటో బకెట్ వంటివి అత్యధిక వాడకం దార్లను కలిగిఉన్నాయి.
అలాగె ఫోటో ఆల్బమ్లోకి మన ఫోటోలను అప్లోడ్ చేసే విధానం లోకూడా ఒక్కొ వెబ్సైట్ ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంది.
ఉదాహరణకి పికాసాలో సింగిల్ డ్రాగింగ్ ద్వారా ఫోటోలను త్వరితం గా అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉన్నట్తు ఇతర వెబ్సైట్లో కూడా అలాంటివి ఉన్నాయెమో చూసుకోవాలి.
పికాసాతో సింగిల్ డ్రాగ్ తో ఫొటోలను అప్ లోడ్ చేసుకునే సదుపాయం తో పాటు బల్క్ గా పెద్ద మొత్తంలో ఫొటోలను ఒక దాని తర్వాత ఒకటి అప్ లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నాయి
వెబ్ ఆల్బమ్స్ ప్రత్యేకతలు:
ఫొటోలను ఒక దాని తర్వాత ఒకటి ప్లే అయ్యే విధంగా స్లైడ్ షోగా చూసుకోవచ్చు
అలా స్లైడ్ షో గా ప్లే అయ్యేటప్పుడు పలు ట్రాన్షిషన్ ఎఫెక్టులు కూడా వస్తాయి
వెబ్ ఆల్బమ్ లో మీరు అప్ లోడ్ చేసిన ఫొటోని చూసేవారు .
ఆ ఆల్బమ్ లోనే ఉండే జూమ్ స్లైడర్ బార్ ని తగిన విధంగా మూవ్ చేసి ఫోటోని మరింత పెద్దది చేసుకుని చూడవచ్చు.
అక్కడి నుండే ఫోటోలని మెయిల్ కూడా చేసుకోవచ్చు.ఒక వేళ ఇంటర్నెట్ లెని వాళ్లకు మన ఆల్బమ్ లోని ఫోటో లు చూపొంచాలంటె
స్లైడ్ షో గా వివిధ ఎఫెక్ట్లతో కూడిన ఫోటోలని సీ.డీ. గా మార్చుకుని వాటిని సీ.డీ.ప్లేయర్స్ ద్వారా కూడా టీ.వీ. లలో చూసి ఆనందించవచ్చు.
కాలానుగుణంగా వెబ్ ఆల్బం లో రోజు రోజుకీ కొత్త కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఫోటో ప్రింటింగ్:

ఉచిత యూజర్ ఒక్కో ప్రింట్ కి కొంత మొత్తం చెల్లిస్తే వారి పోస్టల్ అడ్రస్ కి ఫొటోని ప్రింట్ తీసి పంపించే సదుపాయం కొన్ని సైట్లలో ఉంది.

ఫోటోషాప్ అవసరం లేకుండా ఆన్లైన్లోనే పిక్చర్ ని నేరుగా ఎడిట్ చేసుకోవటం, పిక్చర్ షేరింగ్ వంట్ అంశాలలో వెబ్సైట్లు ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి. http://www.zoomin.com/ వంటి వెబ్సైట్లు ఇంతకుముందే మనం ఇతర ఫోటో వెబ్ ఆల్బమ్స్ లో దాచుకున్న ఫోటో లని మనం కోరుకున్న మరో ఆల్బం లోకి చేర్చే బాధ్యతను తీసుకుంటున్నాయి.

కొన్ని ప్రసిద్ధ వెబ్ ఆల్బమ్స్ చిరునామాలు:

http://picasaweb.google.com/home

http://www.flickr.com

http://www.myphotoalbum.in

http://www.picturetrail.com

http://www.photoape.com

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

14 జూన్, 2009

కాస్త దయచూపండి

నిన్న మిట్ట మధ్యాహ్నం మండుటెండ. నేషనల్ హై వే మీద మంచి సెంటర్లో రద్దీ బాగా ఉన్న ఆంజనేయస్వామి గుడిపక్క ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అతన్ని దాటుకుంటూ కొందరు , నిట్టూరుస్తూ కొందరు, పట్టీ పట్టనట్టుగా పట్తించుకోకుండా పోయేవాళ్ళు కొందరు.

అరె కళ్లముందు ఒక మనిషి స్పృహ లేకుండా నడిరోడ్డుపై పడిఉంటే .. అసలేమీ స్పందన లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇక ఉండబట్టలేక పక్క వాళ్ళని అడిగితే .. వాళ్ళు అతన్ని తిట్టటం మొదలెట్టారు. "తిన్నది అరక్క పీకల్దాకా తాగి రోడ్డు మీద పడ్డాడంటూ.." . తాగుడు ని అసహ్యించుకోవచ్చు. తాగిన వాడ్ని అసహ్యించుకోవచ్చు. కానీ తాగిన మత్తులో దీనంగా చెత్త చెదారం, మురికి మీద పడి ఉన్న మనిషిని చూసి కనీసం అక్కడినుండి కాస్త పక్కకు జరపాలని కూడా ఎందుకు అనిపించదు వీళ్ళకి అనుకున్నాను. వాళ్ళని వీళ్ళని అడగటం మొదలు పెట్టాను. బాబూ ఎవరైనా కాస్త అతన్ని పక్కకి నీడకి లాగండి. ఎండకి చచ్చి పోతాడు . "అంటూ పక్కన నా సహోద్యోగి నా కోసం ఎదురు చూసీ చూసీ నాపై అసహనం వ్యక్తం చేశారు. నీకు అంత ఆవేదన అవసరమా? అతను కావాలని చేసుకున్నదానికి అంత జాలిపడనవసరం లెదంటూ....

ఏమో ! ఎవరి మాటలూ నా చెవికెక్కటం లేదు. ఎలా ? ఏం చెయ్యాలి? చూస్తూ చూస్తూ అతన్ని అలా వదిలి వెళ్ళాలనిపించలేదు. ఏమైనా సరే అనుకుంటూ .. ఒకరిద్దరిని అడిగాను. పక్కనే గుడిలోనున్న ఇద్దరిని అడిగి చూశా పాపం వాళ్ళకి అతనిపై కంటే నాపై జాలి వేసిందో ఏమో అతన్ని తిడుతూ నా గోల పడలెక వచ్చారు. మొత్తానికి ఈడ్చి ఈడ్చి అతన్ని గుడి వెనుకనున్న నీడలోకి లాగారు. హమ్మయ్య అనుకుంటూ .. చల్ల బడ్డ కళ్ళతో బస్టాప్ కి పరుగుతీసాను. నేను చేసిన పనిని తల్చుకుని ఎంతో తృప్తితో ఇంటికొచ్చి మితృలకి విషయం చెబితే ... విచిత్రం . వాళ్ళు ఒక నవ్వు నవ్వి.. తాగిన వాళ్ళు ఎండలో ఉన్నా చచ్చిపోరు. అని నా అమాయకత్వానికి ఓ చిన్న చురక వేశారు. ఒక్క క్షణం కళ్ళు మూసి మళ్ళి అనుకున్నాను. లేదు నేను చేసింది సరిఅయినదే. ప్రాణం పోదుకదా అని మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అక్కడ ఆ స్థితిలో ఉంటే వదిలేస్తామా? చెప్పండి? ఇంతా మీకు చెప్పింది.. నన్ను మెచ్చుకోమని కాదు. ఈ మాటలు గుర్తుంచుకుని సాటి మనిషి అసహాయస్థితిలో ఉన్నప్పుడు స్పందించమని. దయచేసి ప్రాణాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనుషులు చేసిన తప్పులకు అతని ప్రాణాలు కాపాడి తర్వాత తగిన శిక్ష వెయ్యండి అంతే కానీ చిన్న తప్పుకి పెద్ద శిక్ష వెయ్యకండి. "To Err is Human , To Forgive is Divine" " తప్పు చేయటం మానవ సహజం. క్షమించటం దైవత్వం." నిజంగా మీకు మనసుంటే మీ జీవితంలో కనీసం ఒక్క వ్యక్తిని అతనికున్న వ్యసనాన్నుండి విముక్తుడ్ని చెయ్యండీ. మంచి మాటలతో....... నమస్కారం!

3 జూన్, 2009

మానవ మృగాలు

మనిషి గా పుట్టిన మృగాలు జీవావరణంతో పైశాచిక క్రీడలాడుతున్నాయి. ఈరోజు ఒక పత్రిక లో నేను చూసిన ఒక వార్త నా మనసును ఎంతగానో బాధించింది.

పాము కరచిన కోడి మాంసం రుచి ఎక్కువని చైనీయులు ఎగబడి మరీ కొనుక్కోవటంతో గిరాకీ బాగా పెరిగిందట.

చీ.. మనిషి నాలుక రుచి కోసం ఏమైనా చేస్తాడా అనిపిస్తుంది.........

ప్రకృతి తో ఆడలాడుతూ వికటాట్టహాసం చేస్తున్న మనిషిపై ఏహ్యభావం కలుగుతోంది.