Pages

24 సెప్టెం, 2009

సలలితముగ మాయమ్మ శ్రీలలితమాతయై… అరుదెంచెనే భువికి ఈ వేళ ...

Durgamma..5

శ్రీలలితా ! శివ జ్యోతి సర్వ కామదా !

శ్రీగిరి నిలయా ! నిరామయా ! సర్వమంగళా !

 

 

 

అలివేణి కన్నులు కలువరేకుల్లు

విరిబోణి కురులు నీలాల ఝరులు

మారాణి  చూపులు పండువెన్నెలలు… !

 

త్రిశూల ధారిణి్వై శ్రీలలిత మాతవై

శరన్నవరాత్రులలో అల్లనల్లన మముచేర వచ్చి

కొలువుతీరిన మా ఇలవేలుపువీవె శ్రీమన్మహారాఙ్ఞి ! !

 

కుంకుమ పూజలకు మురిసేవు

ముదమార   పసుపును మోముపై పులిమేవు

త్రిశూల ధారిణివై  , దీనజనోద్ధరిణివై ఇల అవతరించేవు !

 

పాపాల తొలగించు పావన గంగవై

కమనీయ కావ్యాల వరాల గోదావరివై

కరుణించి కాపాడు కృష్ణాతరంగానివై

పలుకుతేనెల తల్లి పెన్నా ప్రవాహానివై

చల్లని దీవెనలిడు వెన్నెల కావేరివై

అభయహస్తంబుతో దర్శనమిచ్చు తుంగభద్రమ్మవై

పాశాంకుశ పుష్పబాణ చాప హస్త వై

నీ క్రీగంటి చూపుకై పరితపించే త్రిమూర్తులను

మరచి మమ్ము బ్రోవగ వచ్చితివా శ్రీచక్ర రాజ నిలయా

శ్రీలలితా  మహాత్రిపురసుందరీ పరదేవతా !

నమస్త్రే ! నమస్తే ! నమస్తే ! నమః

 

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి

శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి !

 

కళ్యాణి ! కాత్యాయనీ ! కనకదుర్గా ! కామేశ్వరీ !

కాలహంత్రీ ! పాహిమాం ! పాహిమాం !       పాహి !పాహి !

 

 july...2 039

23 సెప్టెం, 2009

వేద స్వరూపిణి శక్తి దాయినీ గాయత్రీ మాతా జయహో !

Sri Gayathri Devi

ఓం భూర్భువస్సువః తత్సద్విదుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !

 

ప్రణతులు లివే ప్రాణదాత్రీ ! శ్రీ గాయత్రీ !

పరిపాలించవే పరదేవతా ! దీవించవే దాక్షాయణీ !

 

ప్రణవ స్వరూపిణియై పంచవర్ణములతో

పంచముఖి గా ప్రభవించిన  పరమేశ్వరి !

పంచభూతములు ప్రణతులు చేయ

పంచాగ్నుల పవిత్ర హారతులు గైకొనుచు

ఇంద్రకీలాద్రి పై  మము కరుణించి కావగ వేంచేసినావమ్మా !

 

గాయత్రి, సావిత్రి , సరస్వతివై త్రిసంధ్యలలో 

త్రిమూర్త్యాత్మకంగా దర్శనమిచ్చే పరంధాత్రి

నవరాత్రి పూజలందుకొనగ నిండుగ దసరా నాలుగవనాడు

మా కన్నుల పండుగ చేయుచు అల్లపుగారెలు అందుకుని

బుద్ధి దాయనివై శక్తి ప్రదాయనివై నీదు కరుణాకటాక్షవీక్షణముల వర్షించుమమ్మా!

 

 

జై శ్రీ గాయత్రీ మాతకీ జై !

21 సెప్టెం, 2009

ప్రాణ శక్తి , ప్రేమమూర్తి …. అన్నపూర్ణాదేవీ నిను అర్చింతుమమ్మా!

Sri Annapurna Devi

 

’ అన్నపూర్ణే సదాపూర్ణే  శంకర ప్రాణ వల్లభే !

  ఙ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి ! ’

 

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయికవై

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణగ అవతరించి

అక్షయపాత్రతో ఆకలిదప్పులు తీర్చి

జీవకోటికి ప్రాణ భిక్ష పెట్టే మాతృస్వరూపిణీ ! అన్నపూర్ణమ్మా !

అన్నదానమనే మహాదానమును చేసిన

నీ అమృతమయ హస్తాల సాక్షిగా

లోకాన క్షామమును తొలగించి

మమ్ము కరుణించి దీవించి

అక్ష్రరము, అనంతమైన ఙ్ఞానములనీయగ తరలివచ్చినావా? అన్నపూర్ణమ్మా!

 

 

స్థిరమైన బుద్ది, సత్ప్రవర్తన, సచ్చీలత, ధార్మికత,

సద్వాణి సదా మాకు ప్రసాదించి దీవించవమ్మా !

తెల్లని పుష్పాల పూజింపబడే జగజ్జననీ !

దధ్యన్నం కట్టెపొంగలులు అందుకొని

ప్రేమతో మా తప్పులను మన్నించుమమ్మా !

 

అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మా !

మా మనవి ఆలించి మముబ్రోవుమమ్మా !

బంగరు తల్లీ ! బాలా త్రిపురసుందరీ.. !

Sri Bala Tripura Sundari

 

 

బంగరు తల్లీ ! బాలా త్రిపురసుందరీ !

భక్తుల కోర్కెలీడేర్చంగ .. బాలా మణివై

భవభయ హారిణి దురిత విమోచని భవానీ

ప్రాభవంబుగను నీ బిడ్డలకు మోదమందించుటకై

దసరా శుభపర్వదినములలోన శోభాయమానమైన

రెండవదినమున మా గుండెలు నిండగ కన్నుల పండుగ జేసికొనగ

మనోబుద్ధ్యహంకార చిత్తాలకధి దేవతవై అక్షరమాల ను చేబూని

షోడశ విద్యలధినాయకురాలివై అక్షమాల ధరించి

నిత్యసంతోష ప్రదాత్రివై ప్రేమతో మేము పెట్టే పాయసానికై

పాయసాన్న ప్రియవై అరుదెంచావా తల్లీ !

 

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమ:

20 సెప్టెం, 2009

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

Kanakadurgamma

 

 

 

వైభవంబుగ దసరా వచ్చినది

శరన్నవరాత్రుల సంరంభములకై

విజయవాటిక వేదికయైనది

వాడ వాడలా ఆనంద కర్పూర నీరాజనాలతో

భక్త జనావళి గొంతెత్తి పిలువగా

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవియై

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

తొలిరోజు కన్నుల పండుగ చేసింది

ధగధగద్ధాయమానమైన ముకుపుటక ను ధరించి

కదలి వచ్చిన కనకదుర్గమ్మ పసిడి చాయ మోముపై

పండువెన్నెల చిరునవ్వులు చిందిస్తూ

ఆబాల గోపాలాన్ని చల్లని చూపులతో దీవించింది

సింహ వాహనా రూఢియై శంఖు , చక్ర , గదా, శూల ,

పాశ, మహా ఖడ్గ , పరిఘాది ఆయుధాలతో శక్తి స్వరూపిణియై

అవతరించి అన్యాయాన్ని, అధర్మాన్ని అంతం చేస్తానని విజృంభించింది

పులిహోర ప్రసాదంతో ప్రసన్నురాలై , పసుపు అక్షతలు, పూలతో పూజలందుకుని

సుదూర తీరాల చేర వచ్చిన బిడ్డలను ప్రేమతో సాదరంగా మందస్మితయై పలకరించింది.

 

కనకదుర్గమ్మా ! అమ్మా కనికరించమ్మా!………..

7 సెప్టెం, 2009

విలువైన బాల్యం రోడ్లపాలు

cultural - february 146 cultural - february 147

 

ఇదండీ .. సంగతి !

అపురూపమైన బాల్యం ఇలా రోడ్లపై ఈడ్చుకుపోతోంది.

ఎండావానా లేకుండా ఇలా ఊరేగుతోంది.

అన్నీ కళ్ళముందు కళకళలాడుతూ కనిపిస్తూనే ఉంటాయి.

పాపం ! వీళ్ళ చేతికి ఒక్కటీ అందదు.

వీళ్ళు చేసుకున్న పాపమేమిటో…?

6 సెప్టెం, 2009

నా తొలిగురువు.. కల్పతరువు

kanchi...... swamy     , .... pets  ..may 7th 151

 

ముద్దుమాటల వయసులో

మువ్వన్నెలకి  అర్థం  చెప్పి

మూడు రంగుల జెండా చేతిలో పెట్టి

వీధి వీధినా నన్నూ నాతో పాటుగా నా నేస్తాల్నీ

ఊరేగిస్తూ, మా బులి బులి పాదాల్లో తన  పాదాలు కలుపుతూ

కమ్మని కోకిలగా ఆ స్వరంలో అమృతాన్ని మాపై వెదజల్ల్లుతూ

నిద్రిస్తున్న బద్ధకస్తుల చెవులు చిల్లులు పడేలా… ఊరంతా వినబడేలా..

అలుపుతెలియని శ్రామికుడై గొంతు అరిగేటంత వరకు.. ప్రతి ఏటా పాడిన పాటలే

అయినప్పటికీ  ఆ గానం ఎప్పటికీ అలాగే కొన సాగాలనేలా …. ప్రతి చెవినీ పరవశింప జేసి

దేశమంటే మట్టి కాదోయ్.. నిన్ను మించిన దేశమేదోయ్… ? అంటూ నరనరాల్లో దేశభక్తిని నూరిపోసిన

నా తొలి గురువు.. నిజంగా కల్పతరువు ! ఆ మహనీయుడు పెట్టిన భిక్షే నేటి నా మహోన్నత వ్యక్తిత్వం.

 

 

 

ఇప్పటికీ  నా మనసులో చెరగని ముద్ర వేసిన ఈ మహాను భావుడు నాకు 3 వ తరగతి ఉపాధ్యాయుడు.పేరు శ్రీ తిరుపతిరావు గారు.

ఒకటవ తరగతి నుండీ పదుల సంఖ్యలో పంతుళ్ళూ , పంతులమ్మల్నీ నియమిస్తూ ఉన్న ప్రస్తుత కాలపు దౌర్భాగ్య విద్యావిధానం పుట్టకముందు నా అదృష్టం కొద్దీ ఆయన చేతిలో పడ్డాను.

 

( 1 వ తరగతి నుండే సబ్జెక్టు టీచర్లు ఉంటే నీకేమి నష్టం అనుకునేరు. ఇంకా సబ్జెక్టు అంటే ఏమిటో తెలియని పిల్లాడికి 6+ 1 డ్రాయింగు, 1 మ్యూజిక్కు, 1డాన్సూ, 1కంప్యూటరూ, 1డ్రిల్లూ ఇలా లెక్కపెడితే ఇంకా ఈ అంకె పెరుగుతుంది సుమా! ఇంత మంది పేర్లు, ఎవరు ఏం చెబుతారో తెలుసుకుని గుర్తు పట్టే సరికి ఆ ఏడు గడిచే పోతుంది.అల్లాటిది వాళ్ల మనస్తత్వాలేమిటో , వారి ముందు ఎలా ప్రవర్తించాలో తెలియక  ఓపక్క, అందరూ ఏక దమ్మున ఇచ్చిన హోమ్ వర్కు చెయ్యలేక మరోపక్క పిచ్చి పిల్లలు కుస్తీ పడుతున్న సంగతి విఙ్ఞులు మీకు తెలియదా చెప్పండి?)

మా అమ్మా నాన్న పుణ్యమా అని అప్పట్లో అప్పుడే పుట్తుకొచ్చిన కాన్వెంటుల కేసి కనీసం కన్నెత్తి అయినా చూడకుండా నన్ను ఆ బోర్డీ స్కూలులోనే ( చిన్నపుడు అలాగే అనేవాళ్ళం) ఉంచారు. ఒక సంవత్సరం పాటు మా కదలికల్ని , మా అలోచనల్ని గమనించే అవకాశం మా మాస్టారుకీ , మా మాస్టారు గారి గొప్పతనం, వ్యక్తిత్వాలను తెలుసుకునే అవకాశం వెర్రి వెంగళప్పల మైన మాకూ కలిగిందనే చెప్పాలి.

 

ప్రతి సంవత్సరం .. ఆగస్టు 15 న మా స్కూల్లో ఉన్న సందడి అంతా ఆయనదే. జెండాలు కట్టటం నుంచి దించేదాకా అన్నీ పనులే ఆయనకి.

ముఖ్యంగా ఆయన పాడిన పాటలు ఇప్పటికీ సంవత్సరాలుగా ప్రతి ఏటా ఒక ఉపాధ్యాయురాలిగా నా విద్యార్థులకు  నేర్పిస్తూ ప్రతి ఏటా అనుకునేదాన్ని “మాస్టారు దేవుడు. ఎలాగున్నారో” అని

అటు వంటిది నా అదృష్టం కొద్దీ నేను మా స్వంత ఊరు వెళ్ళీ తిరిగి వస్తుంటే రైల్వే స్టేషన్లో. “అమ్మాయ్ ! పద్మకళా! .. ఇటు ఇటు రా !.. ఇలా …ఇక్కడా… “ అంటూ ఓ ఆత్మీయ స్వరం నన్ను ప్రేమతో పిలిచింది. నా చెవిని సోకిన ఆ స్వరం .. “ నిజంగాఅ అదే.. అమృత ధార!… అవును .. అనుకుంటుండగానే కిటికోలొంచి బైట పడి , పిలుస్తున్న చెయ్యీ, రాలేక అక్కడే ఆగిపోయి నేను ఆయన్ని చూస్తానో చూడనో అన్న సంశయంతో మా మాస్టారి ముఖం.

ఇక ఒక్క ఉరుగుకున పరుగెత్తాను .. వెళ్ళీ వెళ్ళగానే మనస్ఫూర్తిగా ( మధ్యలో ఈ మనసేమిటి ?అది ఉందని తెలియని వయసులోనే మా మాస్టారు మాకు తల్లిదండ్రుల ప్రేమను రుచి చూఫించితేను..?) ఒక్క సారిగా కాళ్లపై పడ్డ్డాను.నాగురించి చెప్పాను . మాస్టారి వివరాలు తెలుసుకున్నాను.గుప్త దానం అంటే మాస్టారికి ఇష్టం.ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

నా అభిప్రాయాలు , ఆలోచనలు పంచుకున్నాను. మాస్టారి కళ్లల్లో ఆనందం. ఆ ఆనందానికి అర్థం నాకు మాత్రమే తెలుసు.రైలు సాగిపోతోంది.

ఆగస్టు 15 నేడేనోయ్.. అందరికి స్వరాజ్య మిదియేనోయ్..

భారత మాతకు జేజేలు .. బంగరు భూమికి జేజేలు          ( ఒట్టు. ఈ పాట సినిమాలో కంటే మా మాస్టారు    పాడితేనే          బాగుంటుంది)

ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా.. మా ఐక్య జెండా.. జాతీయ జెండా/…!

బలే తాత మన బాపూజీ ! బాలల తాతా బాపూజీ..!

మాస్టారితో కలిసి చిన్నప్పటి పాటలు మళ్ళీ పాడుతుంటే జనం మురిసిపోతుంటే నేను గర్వించాను. ( నా గురువు గురించి ). మాస్టారిని అడిగాను నాకు ఏవన్నా నాలుగు ముక్కలు చెప్పండి మాస్టారూ అని.ఆయన ఏమీ నొచ్చుకోకుండా చాలా సహజంగా చిన్నప్పుడు నా సందేహాలు తీర్చినట్టే ఇలా చెప్పారు.

శీలం లేని విద్య నిరర్థకం

మనిషిని ప్రేమించు మతాన్ని కాదు

నువ్వు చల్లగా ఉండాలని తపించటం కాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థించు

సమాజం అశాంతితో ఉంటే నీ బ్రతుకులోకి శాంతి ఎలా వస్తుంది?

అందరూ భయపడితే సమాజాన్ని ఎవరు నడిపిస్తారు?

……………………

ఆయనకి బాగా ఇష్టమైన పద్యం ఒక్కటి చెప్పారు:

 

నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క

గడన సేయుటకు ఆశ పడను నేను

ఆలు బిడ్డలకునై ఆస్థిపాస్థులు కూర్ప

కడత్రోవలో పాదమిడను నేను

నేనాచరింపని నీతులు బోధించి

రాని రాగము తీయగలేను నేను

సంసార యాత్రకు చాలినంతకు మించి

గుడ్ది గవ్వను కోరుకోను నేను.

 

( అయ్యా౧ దయచేసి చందస్సు పంక్తుల జోలికి పోకండి. ఆయనకు నచ్చిన పంక్తులు ఇవి. చివరిలో కొన్ని మాయమై ఉండవచ్చు.) జాషువా రచన అని మాత్రం చెప్పారు. ఎప్పటికైనా పట్తుకుంటాను ఆ పద్యాన్ని.)

అంత మహనీయునికి ఈ రోజు కెవలం కవితానీరాజనాలు ఇవ్వాలనే తలంపుతో ఈ గురుపూజోత్సవ దినోత్సవాన ఆలస్యం చేసి ఆ భాగ్యం కోల్పోయాను. ఎప్పటికైనా ఈ పోస్టు చదువుకుంటారన్న నమ్మకం నాకుంది.

 

ఓ చదువుల తండ్రీ! నీకివే పాదాభివందనాలు. జన్మ జన్మలకీ మీ శిష్యురాలిని……