24 జులై, 2009

మంచిదే… కానీ…

నోరు మంచిదైతే

ఊరు మంచిదౌతుంది

ఆలి మంచిదైతే

ఏమన్నా పడుంటుంది

ఆలి నోరు మూసుకునుంటే

ఊరు మెచ్చుకుంటుంది

కడుపుమండి తిరగబడితే

ఊరంతా ఒక్కటై కోడై కూసి

అభాగ్యురాలిని అయ్యగారి

సాయంతో  పెనం పై అట్టులా

తిరగా మరగా వేసి మరీ

కాల్చుకుని తింటుంది

పిచ్చిమాతల్లి…

తన్నినా తగలేసినా

గడపదాటనంటూ

అందరిమధ్యా

బిక్కుబిక్కు మంటూ

అనాధ గా మారినా

మా లచ్చమ్మ తల్లై

కంటిలో ఒత్తులేసుకుని

ఇంటి దీపమై కరిగిపోతుంది

జన్మ హక్కులు…..

అత్తగార్ని

ఆడిపోసుకోవటం

అల్లుడికి

కోడల్ని

సత్తాయించటం

అత్తగారికి

జన్మ హక్కులు

20 జులై, 2009

అరచేతుల్లో విశ్వం

 

                                                           Baby with puzzle globe.     

 

ఈతరం పిల్లలు పిల్లలు కాదు . పిడుగులు. ఒక్క విషయం చెబితే పది విషయాలు తిరిగి చెబుతారు.

వారి మాటల్లో సమయస్ఫూర్తి , ఆత్మ విశ్వాసం చూస్తే ఒక్కొకసారి పెద్దలు కూడా నివ్వెరపోవాల్సిందే.

ఓ రోజు ఓ పార్కులో ఓ చిన్ని పాపాయి వాళ్ల అమ్మని ఐస్క్రీం కావాలని అడుగుతోంటెతల్లి  చెపుతోంది . ఇప్పుడే కదా రెండు తిన్నావు, రేపు కొనిపెడతానని. పాప మొండికేసింది. ఏమన్నా సరే ఇంకోటి కావాలసిందేనని. తల్లి ఆ పిల్లని మరిపించటం కోసమని చిన్ని తల్లీ మా అమ్మ వు కదా! అదుగో పైన చూడు హెలీ కాప్టర్ .. భలే గుంది కదా !… నాన్న ఊరునించి వచ్చాక నాన్ననడిగి అది కొనుక్కుందామే “ అని. అందుకా గడసరి బుడత ఏ మాత్రం  తడుముకోకుండా….” చా!! … మనకంత సీను లేదులే అంది.అనూహ్యంగా వచ్చిన ప్రతిస్పందనకి బిత్తరపోవటం తల్ల్లి వంతైతే పగలబడి నవ్వటమ్ పక్కనున్న వాళ్ళ వంతైంది.

తరాలు మారే కొద్దీ పిల్లల గ్రాహణ శక్తి, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతున్నాయనడానికి ప్రతి ఇంటా ఎన్నో ఉదాహరణలు. కాకపోతే ఆ తెలివితేటలను సమయానుకూలంగా సద్వినియోగం చేసి, వారి ఆసక్తికి తగ్గట్టుగా వాళ్ళ బుర్రలకు సమాచారాన్ని అందించే తల్ల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు.

పిల్లలకి చేతిలో డబ్బులున్నా లేకపోయినా సరే వందలు , వేలు పోసి ఆటవస్తువులు, బొమ్మలు కొనడానికి తల్లిదండ్రులు ఎంత మాత్రం వెనుకాడటం లేదు. తమ ఇష్టాయిష్టాల సంగతి ప్రక్కన పెట్టి బుజ్జాయిలు ముద్దు ముద్దుగా కురిపించే నవ్వులకోసం వారడిగినవన్నీ కొనిపెడుతున్నారు.కానీ నిజానికి వాళ్లకెం కావాలో వారికి తెలియదన్న సంగతి పెద్దలకి తెలిసినా ఒకసారి పిల్లల కన్ను పడితే చాలు. ఈరోజైనా రేపైనా ఆ వస్తువు కోనేదాకా పెద్దలకి మనశ్శాంతిఉండదు.

బొమ్మల తో పాటు ప్రతి తల్లిదండ్రులూ   పిల్లల కోసం  చుట్టూ ఉన్న ప్రపంచం పై ఒక అవగాహన తెచ్చే వస్తువులను కొనటం చాలా అవసరం.పిల్లలని వారికి నచ్చినట్టు ఆడుకోనిస్తూనే  ఆటలమధ్యలో ఆటపాటలతో పాటుగా  చిన్న విషయాలు నేర్పిస్తూ ఉంటే… వారి మెదడు చురుగ్గా పనిచేయటం తో పాటు ఉత్సాహంగా కూడా ఉంటారు .

ముఖ్యంగా పిల్లలకు స్కూల్లో చెప్పే పాఠాలలో కొంచెం కష్టమనిపించే అంశం. భౌగోళిక స్వరూపాలు. అటు భౌగోళిక శాస్త్రం లోను, చరిత్రలోనూ, పౌరశాస్త్రం లోనూ ఎక్కడో ఓ చోట దేశాలు , రాష్ట్రాలు,  పర్వతాలు, నదులు, వంటి విషయాల నేర్చుకోవడానికి  చాలా మంది పిల్లలు ఆసక్తి చూపరు. దీనికి కారణం వారికి ప్రాథమిక స్థాయిలో ఆయా అంశాలమీద వారికి సరైన అవగాహన ఏర్పడకపోవడమే.  అమూర్తం గా కంటికి కనిపించని విషయాలపై పిల్లలకు బోధింఛటం కంటే   వాటిని కళ్ళ ముందు చూపెడుతూ నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై  కూడా ఉంది.అలాగని  పూర్తిగా పాఠశాలలపై ఆ బాధ్యత వేసేకంటే తల్లి దండ్రులు కొద్ది పాటి శ్రద్ధ చూపటం ద్వారా పిల్లల అభ్యసనా వేగం పెరగడానికి దోహదపడవచ్చు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

ముద్దుముద్దు మాటల వయసులోనే పిల్లలకు ఇందుకు సంబంధించిన తర్ఫీదు నివ్వవచ్చు.పెద్దలకు కొద్ది పాటిశ్రద్ధ ఉంటె చాలు. పిల్లలకి ఒక సంవత్సర కాలంలో నేర్పె విషయాలపై  పెద్దలకి చాలా తక్కువ కాలంలోనే  అవగాహన ఏర్పడుతుంది.  ఒక ప్రక్క పిల్లల కు  నేర్పిస్తూనే పెద్దలూ నేర్చుకోవచ్చు.పిల్లలకోసం కొన్ని నిముషాలు ప్రత్యేకిస్తూ వారి దినచర్యలో , ఆటపాటల్లో భాగంగానే ఆడుతు పాడుతూ  వాటిని నేర్పించొచ్చు.

ఎలా నేర్పించాలి?

మిగతా విషయాలు నేర్పించటానికి మాప్స్, అట్లాస్ ల్లో వివిధ అంశాలను నేర్పించడానికి కొంత తేడా ఉంది. ఈ విషయాలను పిల్లలు ఒక్క సారి ఇష్టపడ్డారంటె  వారికి వారే ఇంకా ఇంకా నేర్చుకోవడానికి సిద్ధప డతారు.పైగా ఇవిన్ేర్చుకోవడానికి పదే పదే చూడటం తప్పించి , బట్తీ కొట్టాల్సిన అవసరం అసలు లేదు.

4 ఏళ్ల లోపు వయసు పిల్లలకు కొనిపెట్టె బొమ్మలతో పాటుగా ఒక చిన్న గ్లోబు (సుమారు100 రూపాయలు ఉంటుంది.) తెచ్చి ఇచ్చి, గిరగిరా దాన్ని తిప్పి చూపిస్తూనే పిల్లలకు సముద్రాలు, ఖండాలు, ధృవాలు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ఉండాలి. ఆ వయసుకి వారికి సముద్రం అంటే  తెలియక పోయినా ఆ వయసులో తెలుసుకున్న అంశాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

ఆసియా ఎక్కడుంది ?నాన్నా?  అమెరికా ఏది చూపించమని మురిపెంగా అడిగితే ముద్దుముద్డు మాటలతో పిల్లలు చూపిస్తారు.

6 ఏళ్ళ వయసులోపు పిల్లలకు రాష్ట్రాల రాజధానులు, ప్రపంచంలోని ప్రధానమైన దేశాలయిన  అమెరికా , ఇండియా, చైనా, గ్రేట్ బ్రిటన్, పాకిస్తాన్, శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ వంటివాటిని  చూఫించి వారితో చెప్పించాలి.మన దేశ భౌగోళీక స్వరూపాన్ని  ఈ వయస్తు పిల్లలు చక్కగా గుర్తుపట్టగలరు.

8 సంవత్సరాల లోపు పిల్లలకు దేశ రాజథానులు, మన రాష్ట్ర రాజధానులను పరిచయం చెయ్యొచ్చు.

వారి పాఠాల్లోని అక్షాంశాలు, రేఖాంశాలు, చంద్రుడు , భూమి కి సంబంధించిన వివరాలను చెప్పవచ్చు.

10 – 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలకి జాతీయ రహదారులు, రైల్వేలు, నదులు, విమాన మార్గాలు  తెలియజేయాలి.వివిధ  ప్రాంతాల్లోని పంటలు, గ్రహాలు, నక్షత్రాలు, సౌరకుటుంబం తో పాటు వివిధ జాతుల నివాస ప్రాంతాలను పరిచయం చెయ్యొచ్చు.

ఇలా దశల వారీగా ఇంట్లోనే నేర్పిస్తే

15 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రపంచం పటంలోని వివిధ ఖండాలపై  పూర్తి  అవగాహన కలుగుతుంది.వివిధ రాజకుటుంబాల్లు, పరిపాలనాంశాలు, పాలకుల చరిత్రలు, పురావస్తు సంబంధ అంశాలను సులభంగా నేర్చుకుంటారు.

ఈ వయస్తులో అంటే 9, 10 తరగతుల పిల్లలకు విశ్వం , పుట్తుక అంతరిక్షం వంతి అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న్న ఆసక్తి కలుగుతుంది.

నేరించటానికి మార్గాలు:  .

  పిల్లలకి మార్కెట్లోల బించే మ్యాప్స్ కొనితెచ్చి ఇంట్లో గోడలకి తగిలించాలి.  అటూ ఇటూ తిరుగుతూనే వాళ్ళు వాళ్లకి తెలియకుండానే ఎన్నో నేర్చుకుంటారు.  ప్రతి   రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేలా ప్రోత్సహించాలి. మాప్ పాయింట్ ప్రాక్టీసుకోసమ్ మార్కెట్లో లభించే పుస్తకాలను పిల్లలు అడిగిన వెంటనే కొనివ్వలి.

చిన్నప్పటి నుండె తెల్ల కాగితం కిందపెట్తి మాప్స్ గీసే అలవాటు పిల్లలకు చెయ్యటం చాలా మంచి అలవాటు.

అట్లాసు,:

పిల్లలందరికీ తప్పని సరిగా అట్లాసు కొనిపెట్టాలి క్రమం తప్పకుండా దాన్ని చూస్తూ నేర్చుకునేలా చూడాలి.

పిల్లల పుస్తకాలతో పాటు తప్పకుండా అట్లాసు ప్రతిరోజూ ఉంటె ఎంతో ఉపయుక్త్రంగా ఉంటుంది.

ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ ఙ్ఙ్జానం:

ఇంట్లో సిస్టం ఉన్నవారు గూగుల్ సెర్చి కి వెళ్ళి గూగుల్ ఎర్త్’  వెబ్సైటుకు వెళ్ళ్ళి ఆ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకుని డెస్క్ టాప్ మీద పెట్తుకుంటే మీరు కావాలనుకున్నపుడు గిరగిరా తిరిగే భూగోళం మీ కంప్యూటర్ పై ప్రత్యక్షం అవుతుంది. దానిపై కర్సర్ ను ఉంచి డ్రాగ్ చేస్తూ పోతే ప్రపంచం లోని ఏ ప్రాంతాన్నైనా అది మీకళ్ల ముందే ఉంచుతుంది. నేరుగా ప్రతి ప్రాంతాన్ని చూడటం ద్వారా పిల్లలు చక్కని అనుభూతిని ప్ందుతారు.

లింక్: http://www.googleearth.com

 

google earth

 

 

 

 

 

వరల్డ్ వైడ్ టెలీస్కోప్:

విశ్వం , గ్రహాలు, నక్షతాలు, తోకచుక్కలు, ఇలా అంతులేని అనంత విశ్వాన్ని, విఙ్ఞానన్ని మీ ఇంటి లో ని చిన్ని తెరపై చూపించటం ద్వారా పిల్లలకు చెప్పలేని ఆనందాన్ని స్తుంది.

దీన్ని కూడా గూగుల్ సెర్చ్ నుండి వరల్డ్వైడ్ టెలీస్కోప్ వెబ్సైట్కు వెళ్ళి ఫ్రీడౌన్లోడ్ చేసుకోవచ్చు. గుడ్దిగా పాఠాలు చదివి బట్తీ కొట్టె కంటె పిల్లలకి వారంలో కనీసం ఒక్క రోజైనా ఇటువంటి వెబ్సైట్లను చూపించాలి.

ఇందుకోసం ఇంటిలో కంప్యూటర్ లేకున్నా సరే ఈ రోజుల్లో ఇంటర్నెట్ల ద్వారా ఎంతో చవకగా ఇటువంటి పరిఙ్ఞానాన్ని పిల్లలకు ఉపయోగించుకోవచ్చు. సినిమాల కోసం షికార్ల కోసం , చిరుతిళ్ళ కోసం మనం చేసే ఖర్చులో పదోవంతును పిల్లల కు ఆనందాన్ని, విఙ్ఞానాన్ని అందించే అంశాలకోసం చేయగలిగితే మీ పిల్లలు తప్పకుండా మేధావులౌతారు.

 

 

maps 3

 

అపోహ:

ఇంటర్నెట్లు పిల్లలకి అలవాటు చేస్తే పిల్లలు చెడిపోతారని, వారి చదువు పాడవుతుందని అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. మోతాదుకు మించని ఏమందయినా దుష్పలితాన్నివ్వదు. కాకపోతే ఇంతర్నెట్లముందున్న పిల్లలు ఏం చేస్తున్నారనే పర్యవేక్షణ  చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే.

ఇంటర్నెట్ సెంటర్ల యజమానులు కూడా ఈ విషయంలో  తమకు ఎంతో కొంత  సామాజిక బాధ్యత  ఉందన్నవిషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం తమ కేఫ్లకు వస్తున్న పిల్లలను కస్టమర్లు గా భావించక్కుండా వారిపై ఓ కన్నెస్ ఉంచాలి. లేదంటె ఎవరి అజమాయిషీ లేదన్న ధైర్యంతో వారు విలువైన సమయాన్ని వృథా చేసుకోవటాంత్ో పాటు  రానున్న కాలంలో అప్రయోజకులుగానూ, అసాంఘిక శక్తులుగానూ మారే ప్రమాదమూ లెకపోలేదు.

12 జులై, 2009

రెక్కలు…..

Copy (2) of Fl 2

నమ్మకం

ఋజువు

అయ్యేది

కష్టాల్లోనే

 

బంగారం మేలిమి అవుతుంది~

కొలిమిలో

11 జులై, 2009

coment please….

chikkala (114)

comment please…..

7 జులై, 2009

సకల బోధన ల సారాంశం

శుభ దినం    -------------  ఈ రోజే

శుభ సమయం--------------- ఈ క్షణమే

మిక్కిలి స్వార్థం-------------- ద్వేషం, ఈసడింఫు

అత్యవసరం---------------ఇంగిత ఙ్ఞానం

నమ్మదగిన మితృడు-----------స్వప్రయత్నం

గొప్ప తప్పు-----------------కాల హరణం

మిక్కిలి బాధాకారి--------------ఎక్కువగా మాట్లాడటం

అతి నీచమైన ఆలోచన-----------అసూయ

అదృష్ట్టవంతుడు------------------పనిలో నిమగ్నమైన వాడు

 

గొప్పగురువు---------------------అనుభవం

వివేకవంతుడు--------------------నమ్మిన దాన్ని ఆచరించేవాడు

అతి అసహ్యమైన పని--------------పరులను విమర్శించుట

దుఃఖాభాజకం-----------------------జీవితం పట్ల నిరాసక్తత

అతి కష్టమైన మంచిపని------------ఇతరులను ప్రశంసించటం

సులభమైన చెడ్డ పని------------------తప్పులు వెదకుట

సర్వ ధర్మ సారం--------------------------సత్యం, విశ్వాసం, విధేయత

 

 

( ఈ ఆణీముత్యాలను నెను ఒక టైప్ ఇన్స్టి ట్యూట్ లో చూసి నచ్చి తెచ్చుకున్నాను. నా స్వంతం కాదు.

6 జులై, 2009

మేమూ మీలాంటి మనుషులమే……

                                           మేమూ మీలాంటి మనుషులమేనంటూ, మామానాన మమ్మల్ని బ్రతకనివ్వండంటూ మహిళాలోకం ఆక్రోశిస్తోంది. గుండెలు పగిలేగా  మౌనంగా రోదిస్తోంది. ప్రతిరోజూ ప్రతి పత్రికా మహిళలపై ఎక్కడో ఓ చోట జరుగుతున్న అమానుషాలను వెలుగులోకి తెస్తుంటే  ఆడవారిపై జరుగుతున్న అమానుషాలను చూస్తూ

సున్నిత హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. అనుక్షణం తన ఉనికిని కాపాడుకోవటం ఓ సవాలుగా మారిందని

బెంబేలెత్తిపోతూ  నేటి వనిత  లోలోపలే క్రుంగిపోతోంది.

          .

      మానవమృగాలు విచ్చలవిడిగా సంచరిస్తున్న సభ్యసమాజంలో మహిళకి భద్రతలేదు. అతని ఆకలికి పసికందైనా , పడుచైనా, పండుముసలి అయినా బలికావాల్సిందే. ఆడ జన్మ ఎత్తటం మాత్రమే  ఆమె  చేసిన తప్పా? 

              గడపదాటితే చాలు తిరిగివచ్చేదాకా వెళ్ళిన ఉత్సాహంతో వస్తుందన్న నమ్మకం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న అంతర్మథనం అంతా ఇంతా కాదు. అరచేతుల్లో పెంచుకుని అత్తారుబత్తెంగా చూసుకున్న బిడ్డ ఎప్పుడు ఎటువంటి ఉచ్చులో పడిపోతుందో ,  ఆమెకు ఎలాంటి కష్టాలు  ఎదురవుతాయో అని ప్రతక్షణం భయంతో బ్రతకాల్సిందే.

 

 

                                                                                     depression    

   

              మన విద్య మనకు ఎన్నో కొత్త ఆవిష్కరణలు తెచ్చి పెడుతోంది. కానీ ఎంత విఙ్ఞానం పెరిగినా మానవత్వపు మూలాలు మరచిపోతూ  మన ప్రవర్తన దిగజారిపోతోంది.

                             ప్రేమించమని వేధించి చంపేవాడు ఒకడు, ప్రేమ పేరుతో వంచించి చంపేవాడు ఒకడు. ప్రాణాన్ని నీటిలో నానిపోయే నోట్ల కట్టలతో తూచి కర్కశంగా వసివాడని మొగ్గల్ని తుంచే కిరాతకుడు మరొకడు.

            

       ఇంతమంది మనుషుల మధ్య ఉండీ కూడా   నిత్యమూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక  కుసుమం నేల రాలిపోతోంటే చూస్తూ ఉండి పోవటం తప్ప ఏమో చేయలేక పోతున్నాం. మనతో పాటే బ్రతుకుతున్న సాటి వ్యక్తిని కాపాడుకోలేక పోతున్నాం.

        వందల కొద్దీ జనసమ్మర్ధం ఉండె ఓ కళాశాలలో కి ఆగంతకుడు కత్తితో దర్జాగా ప్రవేశిస్తుంటే ఆ కళాశాల కి ప్రహరీ గోడలెందుకు?  అంతమంది విద్యార్థుల మధ్య ఒక్కడు చొరబడి ఓ అమ్మాయిని తెగ నరుకుతుంటె మిగిలిన వారు సిత్రాలు చూస్తున్నారా? ఎదురు పడితే ఏమవుతుందో నన్న భయం మనల్ని చేతకాని వాళ్ళని చేస్తుంది.

ప్రియతమ నాయకులు సినిమాలలో రౌడీలని పదిహేను మందిని చితకబాదితే వెర్రి కేకలు వేసి   ఆ హీరోయిజానికి జోహార్లర్పిస్తున్న యువశక్తి ఒక్కడిని ఆపలేదా?  వందమంది కలిసి ఒక్కడిని ఆపటం ఏమంత కష్టమైన పని?  

            కళాశాల యాజమాన్యానికి సమయానికి ఫీజులు కట్తించుకోవటం తెలుసుకాని పిల్లలకి రక్షణ కల్పించవలసిన బాధ్యత లేదా? పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లయితే మరి పరీక్షలు రాస్తున్న పిల్లలు ఎందుకు కళ్ళముందే ముక్కలౌతున్నారు?

           తెల్లవారితే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తొందొనని  భయపడని వారే లెరు ఈ రోజుల్లో. అందరి మనసులు దురాగతాలను చూస్తూ … నిలువునా రగిలిపోతున్నాయి. ఎవరిని కదిపినా ఆవెదన  వెల్లువై ప్రవహిస్తోంది. చూడటానికి అంతా మామూలుగా నే ఉన్నా ప్రతి  నలుగురు కలిసిన చోటా భవిష్యత్తు ను గురించిన ప్రశ్నలే.

  ఎన్నాళ్ళిలా మళ్ళీ మళ్ళి ఎదురవుతున్న దారుణాల్ని భరించటం అంటూ స్త్రీలు సమాజాన్ని ప్రశ్నించే రోజు తప్పక వస్తుంది. అప్పుడు ఇన్నాళ్ళూ చేసిన అలక్ష్యానికి సమాజం మొత్తం మూల్యం చెల్లించుకోకతప్పదు.

    

           కళాశాలల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు:

          దాదాపు అన్ని  మహిళా కళాశాలల్లో ప్రస్తుత దుర్ఘటనల నేపథ్యంలో  ఆడపిల్లల స్వయం రక్షణ పై ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. అపరిచితులతో ప్రవర్తించాల్సిన తీరు తెన్నులు వివరిస్తూ, ఎంత తెలిసిన వారైనా సరే నమ్మరాదంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

 

           కిట్టీ పార్టీల్లో మహిళల చర్చలు:

  మహిళలందరు కలిసి  సరదాగా  తమ అభిరుచులను ,  అలవాట్లను పంచుకునే కిట్టి పార్టీలు సైతం  ప్రస్తుతం మహిళల రక్షణ పై తలెత్తుతున్న ఆటంకాలపై నిశితంగా చర్చిస్తూ ,   అభిప్రాయ  వేదికలు గా మారుతున్నాయి.

 

      బ్లాగుల్లో  ఆడవారిపై జరుగుతున్న దౌర్జన్యాలపై  తిరుగుబాటు:

మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తూ , అనుక్షణం  ఎందరినో కలుపుతున్న బ్లాగులు సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసపై, దౌర్జన్యంపై సమరశంఖాన్ని పూరిస్తున్నాయి.

  మహిళా బ్లాగర్ల ఆవేదనకు మద్దతుగా ఎందరో మగవారుకూడా సానుకూలంగా స్పందిస్తూ  తమ తోడ్పాటునందిస్తున్నారు. దేశం కాని దేశం లో ఉంటున్నా సరే తమ దేశంలో సాటి మహిళలపై జరుగుతున్న దౌర్జన్యానికి  విదేశాలలో  వృత్తి రీత్యా నివాసముంటున్న మహిళా బ్లాగర్లు  తమ బ్లాగుల్లో ఆవేదనను వెలిబుచ్చుతూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు.

           యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న  గృహిణి సుభద్ర  కనుమూరి   వాలు కొవ్వరి చెట్తు బ్లాగు ఇందుకు చక్కని ఉదాహరణ:

             http://vaalukobbarichettu9.blogspot.com

           ప్రమదావనం:

           మామూలు మహిళా సంఘాలకి భిన్నంగా ఇంటర్నెట్లో బ్లాగర్లు, ఔత్సాహిక మహిళలు కలిసి కొన్ని సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసుకున్న వేదిక ప్రమదావనం. వివిధ వృత్తుల  వారు , గృహిణులు ఇంటర్నెట్ ద్వారా నిత్యమూ  పలకరించుకుంటూ వారి బావాలను పంచుకుంటుంటారు. అమెరికా  నుండి అమలా పురం దాకా , మస్కట్ నుండి మచిలీ పట్నం దాకా ఎక్కడి వారైనా సరే మహిళలు ఇందులో చేరి వివిధ అంశాలపై చర్చిస్తూ ఉంటారు.

           ఈ మధ్య కాలంలో ఆడవారిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రమదావనంలో మహిళ లు తమదైన శైలిలో సునిశితంగా చర్చిస్తూనే ఉన్నారు. అసలు సమస్య ఎందుకు వస్తోంది, ఎవరు కారణం అన్న కోణం నుంచి తగిన పరిష్కారాలను సూచించటం జరుగుతొంది.

            ఇంటర్నెట్ లో ప్రమదావనం చిరునామా:

http://groups.google.com/group/pramadavanam/

             జరుగున్న దుర్ఘటనలను యువతులు పరిశీలిస్తూనే ఉన్నా ఎవరికి వారు సమస్య  తీవ్రతను ఇంకా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

      అమ్మాయిలూ..  జాగ్రత్త పడండి:

1.ఎంత పరిచయస్తులైనా సరే ఎవరినీ పూర్తిగా విశ్వసించకండి.

2.ప్రతి క్షణం ఆపద పొంచి ఉంటుందన్న దృష్టితో ముందు చూపుతో వ్యవహరించండి.

3 ఒంటరిగా ఎక్కడికీ , ఎవరితోనూ వెళ్లటం శ్రేయస్కరం కాదు.

4.సెల్ ఫోన్ ని అత్యవసరంలో ఉపయోగపడేలా బాలెన్స్ కి మెయిన్ టైన్ చెయ్యండి

5.ముందు జాగ్రత్తగా ఎప్పుడు మీ పర్సులలో ఓ రీఛార్జ్ కార్డు , కొంత డబ్బు అదనం గా అట్టే పెట్టుకోండి.

6.ఫోన్లో కూడా మీకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అందుబాటులో ఉండె మీ మితృలు, కుటుంబ సభ్యుల నంబర్లను స్పీడ్ డయల్ లిస్ట్లో చేర్చుకోండి.

7.మంచైనా చెడైనా తల్ల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికీ కదలకండి. మీకు ప్రపంచంలో అత్యంత సన్నిహితులు మీతల్లిదండ్రులు మాత్రమే అన్న సంగతి  ని గుర్తించండి.

8.ఎంతో జీవితాన్ని చూసిన పెద్దల మాటల్ని పెడచెవిని పెట్టటం వల్ల నష్టపోయేది మీరేనని గ్రహించండి.

9.అమ్మానాన్నలు అన్నదమ్ములు మీరెక్కడున్నారని అడిగితే తప్పైనా ఒప్పైనా నిజం చెప్పి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

10.మీ స్వేచ్చ ఇతరులు హరిస్తున్నారన్న దురభిప్ర్రాయన్ని మొగ్గలోనే త్రుంచండి.

11.  తప్పు చేయటం మానవ సహజం. తెలియక చేసిన తప్పులు చిన్నవైనా , పెద్దవైనా నిర్భయంగా ఇంట్లో చెప్పి సరిదిద్దుకోండి. ఒక తప్పు ని కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తే వరుస తప్పులు మీ పాలిత శాపాలవుతాయని తెలుసుకోండి.

12. ఎవరికి పడితే వాళ్లకి మీ ఫోన్ నంబరు ఇవ్వకండి.

13.సరదా కోసం ఆటపట్టించటం కోసం అబ్బాయిల కు ఫోన్లు చెయ్యటం కోరి కష్టాలను తెచ్చుకోవడమే అవుతుంది.

14. స్నేహితులతో సరదా గా కట్టే పందాలు ఎప్పుడో ఒకప్పుడు మీపై ప్రతికార జ్వాలలౌతాయన్న సంగతి తెలుసుకోండి.

15. ఆధునికతను ఇష్టపడటం మోడ్రన్ గా కనిపించాలనుకోవటం తప్పుకాదు.కానీ మీ వస్త్ర ధారణ చూసే వారిలో ఎటువంటి అభిప్రాయాలను కల్పిసుందో ఆలోచించండి.

1 జులై, 2009

ప్ర్రతి ఓటమీ ఓ గెలుపుకి నాంది….

 

                                   DEPRESSION_by_optiknerve_gr

 

ప్రతి ఓటమీ ఓ గెలుపుకి నాంది పలుకుతుంది. ఒక్కొక్క ఓటమీ ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది.  జరిగిన పొరపాట్లూ తప్పిదాలూ మళ్ళి జరగకుండా ఉండేందుకు కావలసిన హెచ్చరికలు చేస్తుంది.ఓటమితో స్ఫూర్తిని పొంది జీవితానికి రాచబాటను ఏర్పరచుకునే వారు కొందరైతే ఓటమిని తలచుకుని క్రుంగిపోయి జీవితాన్ని ముగించుకునేవారు కొందరు. జీవితం పై ధీమాని , ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వలేని చదువులెన్ని చదివినా అవి  నిరర్థకమే. 

 

          విద్య అనేది వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న శక్తియుక్తులను వ్యక్తీకరించే దివ్యౌషథమని మహాత్ముడు ఏనాడో చెప్పాడు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత విద్యా విధానం విద్యా కూలీలను తయారు చేస్తోందనేది అందరికీ తెలిసిన సత్యం. అందుకు ఫలితమే రోజురోజుకీ పెరుగుతున్న ఆత్మహ త్యలు. బట్టీ చదువులు పిల్లల్లో  ఎంతవరకు  ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నాయనేది  కూడా ప్రశ్నార్థకమే.చదువు విజ్ఙ్ఞానాన్ని , వినోదాన్ని ఇస్తూనే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే లక్షణాన్ని అలవరర్చాలి.  సమస్యలకు పరిష్కారాన్ని చూపలేని చదువు చదువే కాదు. గెలుపులోని మాధుర్యాన్ని చవిచూడాలంటే అప్పుడప్పుడూ ఓటమి పంచే చేదు అనుభవాల్నీ చవిచూడక తప్పదు.

      జీవితం అనేది ఎవరికీ  వడ్డించిన విస్తరి కాదు.     

             మన కళ్లముందు విజేతలుగా కనిపిస్తున్న ఎందరో వ్యక్తులు ఎన్నో ఆటుపోటులకు ఎదురోడిన వారే. సమస్యలని చూసి భయపడకుండా వాటితో పోరాడి గెలిచిన వారే . 

’ప్రతి విజయానికి  వెనుక ఓ బాధాకరమైన గాథ   ఉంటుంది.ప్రతి బాధాకరమైన కథా ఓ అరుదైన విజయంతో అంతమవుతుంది.’ జీవితం అనుదిన పోరాటం అన్న సంగతి మనం మర్చిపోకూడని అంశం.

 

     ఓటమిని ఎలా ఎదుర్కోవాలి?

ఓటమి ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురుపడక తప్పదు.

  • క్లిష్తమైన సందర్భాలలో మనల్ని మనం నియంత్రించుకోలేము కాబట్టి సాధ్యమైనంత వరకు  ఒంటరిగా ఉండకుండా ఆప్తుల దగ్గర కొన్ని గంటలు గడపాలి.
  • తల్లిదండ్రులు,   తోడబుట్టిన వారితో వీలైనంత త్వరగా ప్రతి చిన్న ఆవేదనను పంచుకోవాలి.మన వ్యక్తిగత విషయాలు వీరితో పంచుకోవటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చె అవకాశం ఉండదు.
  • సమస్య కోణం నుంచి బయటికి వచ్చి చుట్టూ మనం అభిమానించే వారిని మన స్థానం లో ఊహించుకుని వాళ్లయితే ఎలా స్పందిస్తారో అంచనా వేసి దానిని బట్తి మనం చేయవలసిన పనిని నిర్థారించుకోవాలి.

 

     ఓటమి బాధను ఎలా దూరం చేసుకోవాలి?

  • ఓటమి పొందటానికి కారణాలు ఏమిటీ? ఎక్కడ లోపం జరిగిందీ బేరీజు వేసుకోవాలి.
  • జరిగిన దాన్ని గురించి ఆలోచించటం మాని జరగవలసిన కార్యాన్ని గురించి , చెయ్యవలసిన పనిని గురించి ప్రయత్నాలు చేయాలి.
  • మనకోసం ఎంతో సమయాన్ని వెచ్చించి మనకు ఊరటనివ్వాలని ఆరాట పడే వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినిపించుకోవాలి.
  • ముఖ్యంగా మనపై మనం నమ్మకాన్ని కోల్పోకూడదు.
  • కష్టాలు మనిషి సామర్థ్యాన్ని పెంచి, అతన్ని రాటుదేలుస్తాయన్న విషయం మరచి పోకూడదు.
  • మనసు కుదుటపడేవరకు ఇష్టమైన సంగీతాన్ని వినటం, ప్రశాంతమైన ప్రాంతాలలో గడపటం చెయ్యాలి.
  • మంచి పుస్తకాలు చదవటం ద్వారా  గొప్ప ప్రేరణని పొందవచ్చు.

   

పదే పదే  పర్సనాలిటీ డెవలప్మెంట్ (వ్యక్తిత్వనిర్మాణ) పుస్తకాలు చదవటం, కొటేషన్లు బట్టీ పట్టటం కంటే జీవితంలో గెలుపు-ఓటములు సహజమన్న విషయాన్ని గ్రహించి అందుకు తగ్గట్టుగా జీవితాన్ని మలచుకోవాలన్న సత్యాన్ని గ్రహించాలి.

ఎవరెస్ట్ ఎక్కాలంటే ఆక్సిజన్ కంటె ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది తోడుంటే ప్రపంచంలోని ఏ ఓటమీ మిమ్మల్ని ఎక్కువ కాలం విజయానికి చేరుకోకుండా అడ్డుకోలేదు.ఆశావాది సగం నిండిన పాత్రను చూస్తే నిరాశావాది కి అదే పాత్రలో సగం  ఖాళీ భాగం కనిపిస్తుంది . దృశ్యం లో ఎలాంటి మార్పూ లేదు.చూసే వారిలొనే ఆ తేడా ఉంది.

ఎంతో కష్టపడ్డా దానికి తగిన ప్రతిఫలం రాలేదు. ఇక నా వల్ల కాదు అనుకోవటం అస్సలు సరికాదు.మండుటెండలకి మాడుతున్న చిగురాకు కూడా ఓ వాన చినుకు కోసం ఆశగా ఎదురు చూస్తుంది.

ప్రతి మనిషీ  మనుగడ కోసం జరిపే   అనుదిన పోరాటంలో అతనికున్న , ఉండవలసిన ఆయుధం ఆశావాదం. అదిలేని నాడు అతని ప్రయాణం  సజావుగా సాగదు.

          ముఖ్యంగా పరిస్థితులకు అనుగుణం గా మనల్ని మనం ఎప్పటికప్పుడు మలచుకుంటూ ఉండాలి.”విచ్ కెనాట్ బీ క్యూర్డ్ మస్ట్ బీ ఎన్డ్యూర్డ్ “ అని ఆంగ్ల సూక్తి. నివారించలెని వాటిని భరించటం అలవాటు చేసుకోవాలి అని దీని అర్థం. వేసవిలో ఎండలు , వర్షాకాలంలో వానలు….. ఇలా ప్రకృతికి కూడా ఎన్నో విధులున్నాయి . కానీ ఒక్కొక్కసారి  కారణాలేవైనా ప్రకృతీ గతి తప్పుతుంది. ఎండా కాలంలో వానలు, వానా కాలంలో ఎండలు అప్పుడప్పుకు ఇందుకు ఉదాహరణలు. కానీ మనం ఏంచెయ్యగలం ? నిట్టూర్చటం   తప్ప? ఇంకా చెయ్యగలిగితే వాతావరణానికి అనుగుణం గా మన పనులను, మన జీవన విధానాన్ని మలచుకొంటూంటాం. గెలుపు ఓటములు కూడా అంతే.

  

             ’అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎంత గొప్ప భావన?

 

ప్రతి 

ఓటమి

వెనుకా

ఓ గెలుపు

 

చీకటి దాటితే ~

పగలు

------------------------------

               మనిషిగా పుట్టినందుకు తోటివారికి ఉపయోగపడాలన్న భావన  ప్రతి ఒక్కరికీ రావాలి. తల్లిదండ్రుల ఎన్నెన్నో కలల ఫలితం మన జీవితం. మన జీవిత కాలం  లో కనీసం ఒక్క జీవితాన్నైనా నిలబెట్టని వారికి వారి జీవితానికి చరమ గీతం పాడే అర్హత లేదు.

మన దేశంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం గవర్న మెంట్ ఉద్యోగం కోసం ఎగబడటం.

ఏళ్ళ తరబడి కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పోసి మరి  సర్కారీ కొలువుకి ఎగబడతారు. ప్రయత్నించటంలో తప్పులేదు . కానీ  అవసరమైతే దానికి ప్రత్యామ్నాయానికి  కూడా సిద్ధపడి ఉండాలి.

సర్టిఫికేట్లలో , సర్కారు కొలువుల్లో భద్రత ఉందనుకోవద్దు. మీ నిజమైన ఆస్థి మీ తెలివితేటలు, మీనైపుణ్యాలు,మీ వ్యక్తిత్వం. వాటిని నమ్ముకోండి.

 

అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న మనం ఎలాగైనా బ్రతకవచ్చు. ప్రపంచంలో ఏ ఉద్యోగమూ శాశ్వతము కాదు.కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలనుకుంటే మన చుట్టూ ఉన్న ఎంతమంది ఆనందంగా ఉంటారు? ఉండగలరు?……. అధైర్య పడకండి. ….

            గతం , వర్తమానం మిమ్మల్ని చిన్నచూపు చూసినా భవిష్యత్తు మీకు అధ్బుతాల్ని అందించడానికి ఎదురుచూస్తుంది……….

          Wish you all the best………..!

                                         

ఏళ్లతరబడి శ్రమించి సత్ఫలితాలు పొందలేక అంతర్మథనంలో ఉన్న మితృల కోసం ………. (D.Sc.  results…. కొందరికి మిగిల్చిన బాధల నేపథ్యంలో…… )