ఓ మితృలారా ! నన్ను గుర్తుపట్టారా?
మీ సిఎమ్మ్ గారూ… కుయ్ కుయ్ అంటూ…కూసి మరీ నన్ను పిలుస్తారు..
జనం నన్ను చూసి ఎంతో గౌరవంతో దారిచ్చి నన్ను అందరికంటే ముందే పంపిస్తారు.
నా వల్ల సాయం పొంది, ప్రాణాలు దక్కించుకున్న వారు నన్ను నడిచే దేవాలయం అంటూంటారు.
తమ దాకా వచ్చేసరికి నన్నాడిపోసుకున్న వాళ్ళు సైతం నాకు జోహార్లు చెప్పి లెంపలేసుకున్నారు.
ప్రాణాల మీద కొచ్చిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కోదేవుణ్ణి తలచుకుంటే అందరూ కలిసి తల్చుకునేది మాత్రం నన్నే.

గుర్తు పట్టారా? నేనే మీ 108 వాహనాన్ని.
మీరు గమనించారో లేదో .. ఈ మధ్య నా మనసు చెప్పలేనంత ఆవేదనతో భారమౌతోంది.
కారణం మీకు తెలియంది కాదు. తెలిసినా తెలియక పోయినా చెప్పటం నాధర్మం.
మీరు అందుకు ఎలా స్పందిస్తారో నాకనవసరం.
ఎందుకంటే మందులు సృష్టించి హెచ్చరించటం వరకే పరిశోధకుల వంతు. వాటిని సద్వినియోగ పరచుకోలెకపోతే ఆ నష్టానికి ఎవరూ బాధ్యులు కాదు.
నా విషయంలో కూడా ఈ మధ్యకాలంలో మీరు ప్రవర్తిస్తున్న తీరు ఇలాగే ఉందన్న సంగతి ఇప్పుడు మీకు నేను చెప్పదలచుకున్నాను. మీకు తప్పనిపించినా ఒప్పనిపించినా చెప్పక తప్పదు.
ఒకవేళ నేను ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడు ఇన్ని ముప్పు తిప్పలు పెడుతున్న మీరే రేపు నన్ను తప్పుపడతారు.
అవును మరి నరుడి నాల్కకి ఎముక లేదు కదా!
మీ సమస్య లు తీర్చడానికి నేనొస్తే నాకు మీరు సమస్యగా మారి నన్ను సమస్యల వలయం లోకి నెట్టేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే:
108 నిన్న మొన్నటి దాకా చాలా ధైర్యంతో పరుగులు తీస్తూ, ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఎందరినో అత్యవసర వైద్యం అందించింది. అలగే ఇప్పుడూ , ఇకపైనా చెయ్యాలనే ఉన్నా మీరు చేసే పనులు భవిష్యత్తులో నా మర్యాదని మంటగలుపుతాయనే భయంతో వణికిపోతున్నాను.
ఎందుకంటారా? అదీ చెబుతాను. గతంలో ఎవరైనా చావు బ్రతుకుల మధ్య కొట్తు మిట్తాడుతుంటే వెంటనే నన్ను పిలిస్తే ఆఘమేఘాల మీద పరుగెత్తే దాన్ని. చెమటలు కక్కు కుంటూ మా పైలట్లూ, ఈఎమ్టీలూ తినీ తినకా , తినేవారు ఎక్కడివక్కడ పడేసి ’అమ్మో ప్రాణం !” అనుకుంటూ హడలిపోయేవారు.
ఆ ప్రాణం నిలబడితే కానీ నేను , నా సిబ్బంది గాలి పీల్చుకు నే వాళ్లమే కాదు.
జనం కూడా నేను ఎక్కడైనా ఆగితే చాలు. ఏమైందాని వింతగా చూసేవారు.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీ అమాయకత్వమో/ అతి తెలివితేటలో తెలియదుకానీ
నన్ను నా సేవల్ని చాలా తేలికగా / చవకగా వస్తున్నాయని భావించి కాబోలు;
ఇష్టమొచ్చినట్తు వాడుకుంటూ అసలు సమస్యల్లో ఉన్నవారికి చేరనీయకుండా అడ్దుకుంటున్నారు.
ఎంత గవర్నమెంటు సొమ్మయితే మాత్రం మరీ అంత దుబారా చేసేస్తారా మీరు?
చిన్న చిన్న గాయాలు తగిలినా, కాస్త ఒంట్లో నలతగా ఉన్నా సరే.. 108 అంటూ పొలికేక ( ఫోన్ కాల్) తో నన్ను నన్ను గాభరా పెట్టేస్తున్నారు. ఒక సైకిల్ , ఒక మోటార్ సైకిల్ గుద్దుకుని చిన్నగా మోకాలు చిప్ప పగిలినా /కాస్త తలతిరిగి కళ్ళు తిరిగి పడ్డా / కాలో చెయ్యో వాచి సలపరం చేసినా / ఇలాగే చిన్న సమస్యలకే నన్ను పిలుస్తూ, అది మా హక్కు నువ్వున్నదెందుకంటూ నన్నే ప్రశ్నిస్తున్నారు.
ఆటో ఖర్చు కలిసివస్తుందని కొందరు, దర్జాగా ప్రయాణం చెయ్యొచ్చని కొందరు, ఉచితంగా కట్లు కట్టి, ఇంజక్శన్ ఇస్త్తారని కొందరు… పర్యవసానం విలువైన ఓ ప్రాణం ఎక్కడో సహాయం అందక నేల రాలిపోతుంది.
మీకు నా సేవలు ఉచితమే కావచ్చు. కానీ ప్రతీ కాల్ కీ ప్రభుత్వం దాదాపు 3 , 4 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నదన్న సంగతి మీకు తెలియదు. మీరు తెలుసుకోవాలనుకోరు.
ఆ భారం మర్లా ధరలు , పన్నుల రూపంలో మీకే.
పైగా నిధులు అనవసరపు కాల్స్ తో దుర్వినియోగం చేశారంటూ నా వాళ్ళకె విమర్శలు.
పోనీ అనుమానం ఉన్న కాల్స్ కి వెళ్ళకుండా మానేద్దమనుకుంటే తెల్లారి మీరే మళ్ళీ పేపరోళ్ళకి చాడీ లు చెబుతారు. 108 సకాలానికి రాలేదని.. అప్పుడు మాకు పైనుండి చీవాట్లు.
ఇక మా సిబ్బందికే మో ఇలాంటి కేసులు చూసీ చూసీ విసుగెత్తిపోతోంది. ఏం చేస్తాం తప్పదుకదా అనుకుంటూ అయిష్టంగా వాళ్ళు వెనుదిరిగుతూంటే నా మనసు చివుక్కుమంటోంది.
నా భయమేమిటంటే.. ఈ తంతు ఇలాగే జరిగితే 108 కి ఇతర టాక్సీలకి తేడా ఏమిటిలే అని జనం నిర్లక్ష్యం చేస్తారనీ.. చూసి చూసి ఎప్పడైనా నేనూ నా సిబ్బంది ’ నాన్నా పులి’ కథలాగా స్పందించలేకపోతామేమో ..
మీ తప్పుకి ఎవరికో శిక్ష పడుతుందేమో… జనం ఆ ఏముందిలే… అయితే అన్ని కేసులూ ఎమర్జెన్సీలు కావు’ అంటూ నా దారికి అడ్దుగా నిలబడతారేమో నని .
ఆలోచించండి……
ఆలోచించండి…
ఆలోచించండి…
ఈ తప్పు మీరు చేసి ఉండకపోవచ్చు .. కానీ చేస్తున్న వారిని చూసి కూడా మందలించకపోతే ఆ తప్పులో మీకూ భా గం ఉన్నట్టే.
ఇది మీ సొత్తు. దాన్ని పొదుపుగా అవసరమైనప్పుడే వాడుకోండి.
గుర్తుంచుకోండి 108 విలాస వస్తువు కాదు. మీరు కావాలనుకున్నప్పుడు విహరించడానికి.
విలువైన ప్రాణాలను కాపాడే ఓ అరుదైన వస్తువు!