"నువ్వెక్క దల్చుకున్న బస్సు ఒక జీవితకాలం పాటు మిస్సు ." అన్నారు ఆరుద్ర గారు.
ఒక్కోసారి ఈ బస్సుల కోసం వేచి వేచి విసిగి వేసారి పోయి అసలు మనమే స్వయంగా ఓ కొత్త సర్వీసు ఎందుకు నడపకూడదు ? అనిపిస్తుంది.
లాభాల బాట లో దూసుకెళ్తున్న ఆర్.ట్.సి. మరిన్ని బస్సులు నడిపితే ప్రజలకి సౌకర్యంతో పాటు విలువైన కాలం కూడా ఆదా అవుతుంది కదా!
కానీ వాళ్ళా పని చేయరు.
ప్రొద్దున్నే లేచి హడావుడిగా తినీ తినక పరుగులెత్తి చురకపెట్టే ప్రొద్దుటెండలో ఇలా నిలబడితే ఉన్న ఓపిక కాస్తా బస్ స్టాప్ లోనే ఖతం.
ఆఫీసుకో ,స్కూలుకో ,బ్యాంకుకో ఎక్కడికయినా సరే పనిచోటుకు చేరాక నీరసం.
టైం కి చేరగలమో లేదో అన్న ఒత్తిడిలోంచి బయటపడి పనిచెయ్యాలంటే కొంత సమయం తీసుకుంటుంది.
దాని వల్ల పనిసామర్థ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది.
అసలు మన 70,80 ఏళ్ళ జీవితంలో సుమారు ఒక వంతు బస్టాపుల్లోనే గడిచి పోతుందేమో కదా!
’ఆశ - నిరాశ’ అనే వ్యంగ్య వ్యాసం లో శ్రీ నండూరి రామ మోహన రావు గారు ఇలా అంటారు.
"బస్సును గురించి ఎదురు చూసేటపుడు నిరాశ చాలా ఉపయోగపడుతుంది.మనం ఎదురు చూసే బస్సురానపుడు ’వచ్చే బస్సు మన నంబరు బస్సు కాదు,
వేరే నంబరు బస్సు అని అనుకుంటూ మనమేదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉంటే మన నంబరు బస్సే వచ్చేస్తుంది."
అవును. ఈ అనుభవం నాకు చాలా సార్లు అయ్యింది. ఆ వచ్చేది మన బస్సే ! హమ్మయ్యా ! అనుకున్నప్పుడల్లా అది ఖచ్చితంగా వేరే బస్సే అయ్యితీరుతుంది.
ఈ అనుభవం రోడ్డెక్కిన ప్రతివారికీ ఎప్పుడో ఒకప్పుడో అవుతూనే ఉంటుంది. నాకయితే ఇంట్లో చేయటానికి టైం చాలని చాలా పనులు బస్ స్టాపుల్లో చేసుకోవచ్చేమో అనిపిస్తుంది.
ఆ ఒక్క అవుడియా కూడా ఇచ్చేయనా?
పేపర్ తెరిచి అందులో మునిగితే ఇక మనకి ప్రపంచంతోనే పని ఉండదు.బస్సు హారన్ మోగినప్పుడు ఓ లుక్కేసి, బస్సులోకి గభాల్న ఎక్కేయవచ్చు.
మగవాళ్ళు అయితే నెలవారీ ఇంటి లెక్కలు, రోజు వారీ చెయ్యాల్సిన పనుల చిట్టా, వారాంతపు పనుల ను గురించిన సన్నాహాలు,
వృత్తి లో చెయ్యవలసిన పనులు, చేసి న పనుల ఫలితాలు ........
ఇలా ఆలోచనలో పడితే మన బస్సు రాకపోతుందా?
అలాగే స్టుడెంట్స్ అయితే కష్టమయిన ఫార్ములాస్, ఈక్వేషన్స్, బిట్స్, కొటేషన్స్ చిన్న చిన్న స్లిప్స్ప్ పై రాసుకుని ఆ టైం లో చేతిలో పెట్టుకుని మధ్యమధ్యలో చూసుకుంటూ బట్టీ కొట్టేస్తే సరి.
ఇంకా ఇవన్నీ చెయ్యలేని వారు చక్కగా ఇష్టమయిన మ్యూజిక్ (ఐ పాడో,గియ్ పాడో (ఏదో ఒక పాడు)) లేదా fm వింటూ ఉంటే సరి.
ఇలా ఆలోచిస్తే చాలా ఉంటాయి. వ్యవస్థని మనం ఎలాగూ మార్చలేం. కాబట్టి మనకనుగుణంగా పరిస్థితుల్ని, సమయాన్ని మలచుకోవటం నేర్పరుల లక్షణం అనేది నా అభిప్రాయం.
ఇదంతా సమయంతో పరుగులు తీసే వారికే సుమా !
(గడియారంతో జనం పోటీ పడి ఎక్కడయితే పనిచేస్తారో అక్కడే అభివృద్ధి కూడా పోటీ పడుతుంది.) ఉన్న సమయాన్ని కబుర్లతో వృథాగా గడిపే వారు, సోది అంటూ విషయాన్ని అర్థం చేసుకోలేని వారికి
ఈ విషయాలు వర్తించవు, రుచించవు కూడా.
Time is more precious than any other . Make each and every minute useful and meaningful.
ఇష్టమయినా కాకపోయినా కొన్ని కొన్నిసార్లు కాలంతోను, పరిసరాలు, పరిస్థితులతో రాజీ పడాల్సిందే.తప్పదు.
ఏం చేస్తాం చెప్పండి ? కూటి కోసం కోటి పాట్లు.
3 కామెంట్‌లు:
బొమ్మలతో పాటు ఏదయినా మ్యాటర్ రాయవలసిందేమో ...
ఉందండి.
కొంచెం వీలువెంబడి రాస్తాను.
ధన్యవాదాలు.
good one....
కామెంట్‌ను పోస్ట్ చేయండి