19 జన, 2009

మనసులని కలిపే మహా మంత్రం సారీ..........

’సారీ ’ అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో.........

ఆత్మీయతాను రాగాలని అందించగలదు

స్వాభిమానాన్ని పెంచి పోషించగలదు

దురహంకారాన్ని సైతం మటుమాయం చెయ్యగలదు

బద్ధ శత్రువులని కూడా ప్రాణ మిత్రులని చెయ్యగలదు

మానవత్వాన్ని మేల్కొలిపి అందరినీ మన వారిగా మార్చగలదు

మాటల్లో చెప్పలేని భావాల్ని , మనుషుల్లో పూడ్చలేని అగాథాల్ని సున్నితమైన రెండక్షరాల మాట, సుతారంగా గుండెలోతుల్లోంచి పుట్టుకొచ్చే ఓ అందమైన మాట మృదువుగా మనసుపొరల్ని స్పృశించి ఆ వెచ్చదనంతో అంతరంగాలలో గడ్డకట్టిన మూర్ఖత్వాన్ని గూడు కట్టుకున్న దుర్మార్గాన్ని కరిగించి విడదీయలేని బంధాలని వీడిపోలేని అనుభూతులని కానుకలుగా అందించే మహా మంత్రం సారీ !.......

చాలా సందర్భాల్లో నేను చెప్పే సారీ నా మనసుకు ఎంతో హాయినిస్తుంది.

౧ . పూలకోయటానికి ఇష్టపడని నేను రోజూ పూజకై పూలు కోస్తూ పొరపాటున మొగ్గల్ని తుంచినప్పుడు చెట్టుకి :

అమ్మా వికసించని నీ బిడ్డల్ని పొరపాటున త్రుంచిన పాపిని మన్నించమ్మా ! .....అంటూ నేచెప్పే సారీ......

౨.ఆదమరచి హాయిగా నిద్రిస్తున్న మూగజీవి ( ఓ కుక్క పిల్ల అనుకోండి) నా చప్పుడుకి ఉలిక్కి పడి లేచి కంగారుగా అటూ ఇటూ పరికించి చూసి ముడుచుకుని కూర్చుని అమాయకంగా మూతి బిగించిమళ్ళీ నిద్రలోకి జారుకుంటుంటే ....

అపరాధ భావంతో నాకళ్ళు దాని కాళ్ళను వెతుక్కుని , పిచ్చితల్లీ చెట్టంత ఎత్తుకి ఎదిగినా నీ చిన్ని దేహానికి ఇబ్బంది కలగజేశానే ఏం చేస్తే నాకు బుద్ధొస్తుందో ....నన్ను క్షమిస్తావా? అంటూ నే చెప్పే సారీ..........

ప్రతిరోజూ నే వస్తానని ప్రేమతో స్నానం చేయిస్తానని (అభిషేకం) ఎదురుచూసే నా శివయ్య ( మీదృష్టిలో శివలింగం) , గణేష్, బుజ్జమ్మ( ఇది నాపేరే బుజ్జి- అమ్మవారు), బాబా ,కన్నయ్య, అంజి గాడు ( ఆంజనేయుడు) ...ఈ నా పూజ మందిరంలోని ఈ గ్యాంగ్ పనికి మాలిన పనులతో నేను ఒక్కోసారి రెండురోజులైనా వాళ్ళని పట్టించుకోనప్పుడు ఒసేయ్ రాక్షసీ !.....మమ్మల్ని మర్చిపోయావా? అంటూ కసిగా నాకేసి చూస్తుంటే ...

అమ్మో ! ఎంతమాట ? మిమ్మల్ని మర్చిపోవటమేమిటి? అంటూ గబుక్కున పరుగెత్తుకుంటూ వెళ్ళి బుల్లి బక్కెట్టులో నీళ్ళుతెచ్చి బుడిగి బుడిగి మని వాళ్ళని నీళ్ళలో ముంచి , నెత్తిపై నీళ్ళు కుమ్మరించి గంధం బొట్టూ పెట్టి, పూలతో ముస్తాబు చేసి........ హడావుడిలో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను అంటూ గోముగా నేచెప్పే స్వచ్చమైన సారీ..

కార్యాలయానికి పరుగెత్తే సమయంలో ఖంగారుగా నా వాహనరాజాన్ని (మరీ రాజం అని ఊహించుకోవద్దు.. ద్విచక్రమే.. నాకది చాల్లెండి) శర వేగంగా నడుపుకుంటూ రివ్వున దూసుకెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అడ్డదారిలో మరో బండి ( దానిపై ఎవరున్నా ఐ డోంట్ కేర్) అడ్డకోలుగా వచ్చి నాకు అడ్డు తగిలితే మామూలుగా రావాల్సిన కోపానికి బదులుగా పెదాలపై పూసిన చిరునవ్వుపువ్వుతో సారీ !.......( అసలు నేచెప్పాల్సిన అవసరం లేకున్నా యథాలాపంగా వాళ్ళకంటే ముందే చెప్పేస్తా !)

ఇలా చెయ్యటం వల్ల ( తప్పు లేకున్నా మన్నించమని అడగటం వల్ల అసలు తప్పుచేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుంటారు. వాళ్ళు సారీ చెప్పకున్నా ఆ భావం మనకి స్పష్టంగా తెలిసిపోతుంది.

నిజానికి సారీ చెప్పినంత మాత్రాన మన సొమ్ము , పరువు , ప్రతిష్టా , గొప్పతనం ఏ మాత్రం తగ్గవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. (పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టు.) చెప్పలేకపోవటానికి ఒక్కోక్కరికీ ఒక కారణం ఉండవచ్చు. చెప్పటం వల్ల మాత్రం ఎవరికైనా సరే ఒకేరకమైన ఫలితం . అది ఎదుటివారి మనసు గెలుచుకోవటం. అంతటితో ఆగదు. వారి హృదయంలో మనకంటూ ఓచిన్ని గూడు సంపాదించుకోగలగటం.

ఒక్క సారి మనం కోరే మన్నింపు మనకి ఏ స్థాయి గౌరవాన్నిస్తుందంటే మనం తేరుకోలేని తప్పు చేసినప్ఫుడు కూడా మనల్ని సమాజం అర్థం చేసుకుంటుంది.అడక్కుండానే మనల్ని క్షమిస్తుంది.

ప్రముఖ గజల్ గాయకుడు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాట నాకింకా గుర్తుంది:

"క్షమించిన వాడు గొప్పవాడుకాదు.

క్షమాపణ అడిగిన వాడు గొప్పవాడు." అని ఈ అక్షరాలు ఈ కాలానికి అవసరమైన లక్షణమైన లక్షల మూటలు.

చిరంజీవి సినిమా శంకర్ దాదా MBBS లో ముసలి పనివాడికి సారీ చెప్పిన సీన్ నాకు చాలా ఇష్టం.

నేస్తాలూ ! ఒక్కసారి ఆలోచించండి:

అందరిలో మనల్ని చూడగలిగిన నాడు మనకి ఎలాంటి భేషజాలూ కలగవు. తప్పు చెయ్యటం సహజం . అది చిన్నదైనా , పెద్దదైనా . దాన్ని సరిదిద్దుకోవటం మాత్రం మన బాధ్యత. ఎందుకంటారా? అదీ చెప్తాను:

ఉదాహరణకి:మా పక్కింటి గుమ్మంలో ఒక కుక్క పిల్ల ఎవరినీ రానివ్వకుండా మొరుగుతూనే ఉంటుంది. ఆఖరుకి దాన్ని ఎంతో ముద్దు చేసే నన్ను చూసినా గట్టిగా మొరుగుతూ మీదికి ఎగబడుతూంది.నేను విసుక్కుందామంటే పక్కావిడ చేత్తో ఓ బ్యాట్ తో వచ్చి దాన్ని తప తపా బాదుతుంటే పాపం పిచ్చిది (కుక్కపిల్ల) నోర్మూసుకుంటుంది.నా కైతే గుండె పగిలినట్టై గట్టిగా ఏడ్వాలనిపిస్తుంది. తీరా ఆమె లోనికి వెళ్ళాక పిచ్చిమొహం మళ్ళీ మామూలుగా అరుస్తుంది.( అప్పటికి దానికి సారీ ...తెలియదులెండి పాపం)

ఇక ఏమీ చెయ్యలేక దాన్ని బాధ పెట్టటం ఎందుకులే అని ఈ మధ్య వదిలేసి నేనే సర్దుకొని ఎలాగో తిప్పలు పడుతున్నాను.

మొన్నామధ్య ఓరోజు

ఓ రోజు మధ్యాహ్నం మొక్కలకి నీళ్ళు పోస్తూంటే నా వైపే ఆశగా చూస్తూ కనిపించింది.దగ్గరికి వెళ్ళి నీళ్ళ బకెట్టు దాని దగ్గర పెట్టాను. అది ముందు మోమాటపడినా తర్వాత దాహాన్ని దాచుకోలేక నేపెట్టిన నీళ్ళని తాగింది. అందులో విశేషం ఏముందిలే అని మీరు నిట్టూర్చకండి. అసలు కథ ఇక్కడే ఉంది.

ఏమనుకుందో ఏమిటో గానీ ( బహుశా అది కూడా సారీ ...ఫీలై ఉంటుందని నాఅభిప్రాయం.) ఆ రోజు మొదలుకొని అది పిచ్చిగా మొరగటం మాని బుద్ధిమంతురాలిలాగా ( ఆల్ మోస్ట్ నాలాగే ) ఉండటం మొదలెట్టింది. అది కూడా నన్ను చూసినప్పుడు మాత్రమే అలా ప్రవర్తించటం భలే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

పశువుకే అపరాధ భావన కలిగి పరివర్తన చూపినప్పుడు

మనుషులం మనం ఎంత మారాలో ఆలోచించండి..........

ఎదుటివారిని చక్కగా అర్థం చేసుకుని చిన్న చిన్న త్యాగాలకు సిద్ధపడినపుడు, మనతో పాటు ఇతరుల్ని కూడా గౌరవించటం అలవాటు చేసుకున్నపుడు ప్రతి క్షణం మన్నించటానికి , మన్నించమని అడగటానికి సిద్ధ పడినపుడు అందరూ మనవారే. మనమూ అందరివారమే.............

3 వ్యాఖ్యలు:

Tekumalla Venkatappaiah చెప్పారు...

సారీ అని ఒక సారి చెప్తే పోయేదానికి ఇరు వైపుల వారు చిన్న చిన్న తగాదాలకు భీష్మించుకుని, అగాధాలను స్రుస్టించుకుంటున్నారు. నిజమేనంటారా? అసలు ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్ ఎలా వస్తాయో మీకు.

అజ్ఞాత చెప్పారు...

ఆ.. ఆ రోజు .. ??

అజ్ఞాత చెప్పారు...

"సారీ" చెప్పిన ప్రతీసారీ నేను మనిషినన్న విషయం గుర్తు తెచ్చుకున్నట్టుంటుంది. అహంభావం వల్ల నేను పోగొట్టుకున్న బంధాలను, సంతోషాలను ఇప్పటి "సారీ" ఇంకోసారి నా ముందుకు తెచ్చిపెట్టడం నేను అనుభవ పూర్వకంగా తెలుసుకుంటున్నాను. ఎంతో మంది నాలాంటివాళ్ళు తెలుసుకోవలసిన విషయం మీదైన శైలిలో చెప్పారు బాగుంది.

-రామేశబాబు @ sreeramesh1971@yahoo.co.in

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి