21 జన, 2009

బ్లాగ్లోకంలో ముగ్గులపోటీ.... ఆత్మీయులందరికీ ఆహ్వానం !

’అయ్యయ్యో ! ఇదెక్కడి చోద్యమమ్మా !’అంటూ ముక్కున వేలేసుకోకండి. మీరు విన్నది అక్షరాలా నిజం ! మనసుంటే మార్గం ఉండకపోదు. నాకు తోచిన ఈ సద్సంకల్పానికి మీ చేయూత తోడైతే విజయం తథ్యమని నా విశ్వాసం.

బ్లాగ్బంధువుల్లారా !

          సంక్రాంతి సంబరాలు  ఐపోయాయి కదా అని నిట్టూర్చకుండా మీ వంతు ప్రోత్సాహాన్ని అందించండి.

      ఇందుకోసం మీరు  ఎవరికీ పైసా చెల్లించక్కరలేదు. మీరు ఉన్న చోటునుండి ఎక్కడికీ కదలనక్కరలేదు.

       మీరు చెయ్య వలసిందల్లా ఓ రెండు మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా తెలుగుకళ కు వచ్చి అందులో జరిగే ముగ్గుల పోటీ ముగ్గులను చూసి నిర్మొహమాటంగా మీకు నచ్చిన ముగ్గు ఏదో చెబితే చాలు. (ఓ చిన్ని వ్యాఖ్య చాలు.)

       సాధారణ ముగ్గుల పోటీకీ న్యాయనిర్ణేతలు ఇద్దరో ముగ్గురో మాత్రమే ఉంటారు. కానీ మన బ్లాగ్ముగ్గుల పోటీకి విచ్చేసిన అతిథులందరూ న్యాయనిర్ణేతలే.

  కాకపోతే పోటీలో మీ అభిప్రాయం తెలిపేటపుడు ముఖ్యంగా ముచ్చటగా 3  అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అవి:

  1. క్రింద ఇచ్చిన విభాగాల లో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ముగ్గుని ఎంపిక చేయాలి.
  2. పాల్గొన్న అభ్యర్థులు కూడా తమ ఓటు నిరభ్యంతరంగా వెయ్యొచ్చు. దొంగ  ఓటు వెయ్యడానికి ప్రయత్నిస్తే ఆన్లైన్ వ్యవహారం గాబట్టి దొరికిపోయే ప్రమాదం ఉందన్న సంగతి గమనించాలి.
  3. ఎవరి అభిప్రాయాన్ని కించపరచకూడదు.

మొత్తం 5 కేటగిరీలలో పోటీ ఉంటుంది.

1.చుక్కల ముగ్గు: ఇష్టం వచ్చినన్ని చుక్కలు వాడుకోవచ్చు.

2.సృజనాత్మక ముగ్గు:గీతల (ఫ్రీ స్టయిల్) తో కళాత్మకంగా

3.రంగుల ముగ్గు : రంగులు, పువ్వులు , చమ్కీలు...ఇష్టం వచ్చిన పదార్థాలుపయోగించి రంగవల్లులు తీర్చిదిద్దవచ్చు.

4.సాదా ముగ్గు: కేవలం తెల్లని గీత మాత్రమే కనబడాలి. రంగులు వాడకూడదు.

5.చిత్రాల ముగ్గు: దేవుళ్ళ బొమ్మలు , మిక్కీ మౌసులు,జెండాలు....... మీ ఓపిక.

అభ్యర్థులకి సూచనలు:

మీరు పంపే ముగ్గులు blogmuggulasandadi@gmail.com అన్న మెయిల్ కి (వేగుకి) పంపాలి.

ముగ్గు మీరు ఎప్పుడు ఎక్కడ వేసినదైనా సరే . ఫోటో కావచ్చు, ప్రింట్ కావచ్చు. తెల్ల కాగితంపై గీసి రంగులుదిద్దినా సరే.

కంప్యూటర్ సహాయంతో గీసి పంపినదైనా సరే.

అందమైన ముగ్గు తెరపై కనిపిస్తే చాలు.

ఆడాళ్ళు రాజ్యాలేలుతున్న ఈ కాలంలో ఉత్సాహవంతులైన పుణ్య పురుషులకి కూడా పోటీలకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకేం చూడండి అబ్బాయిలు తలచుకుంటే కానిది లేదంటూ ముగ్గులేస్తున్న ఈ కళాకారుని స్ఫూర్తిగా తీసుకోండి మరి:

saakshi1 164

  మీకు వచ్చినట్టు సరదాగా ముగ్గుగీసో , వేసో పోటీకి పంపండి.

 

చివరిగా :

మీరే మననంటే ఇంత కష్టపడి మీరు గీసి పంపే ముగ్గులకి ప్రతిఫలం వెలకట్టలేని అభినందనల వెల్లువ మాత్రమే నని విన్నవించుకుంటున్నాను.

సరదాగా నేను చేస్తున్న ఈ ప్రయోగానికి అందరి మద్దతూ లభిస్తుందని ఆశిస్తాను.

   బ్లాగ్ముగ్గుల పోటీలో కలుద్దాం........ సెలవు.

5 వ్యాఖ్యలు:

జ్యోతి చెప్పారు...

నేను పంపేసాను...

psmlakshmi చెప్పారు...

నేను జడ్జినమ్మా. అందరికీ ఆల్ ది బెస్ట్.
psmlakshmi
psmlakshmi.blogspot.com

Tekumalla Venkatappaiah చెప్పారు...

మీ ముగ్గుల పోటీ కి నా దగ్గర ఉన్న దీపావళి ముగ్గు పంపిస్తున్నాను.మీ ముగ్గుల పోటీ కి అనూహ్య స్పందన రావాలని కోరుకుంటున్నాను.

తే!గీ!! ఆంబరమె మన హద్దని సంబరాన
ముగ్గు పోటీన కాంతల నిగ్గు తేల్చి
బ్లాగు ముగ్గుల పోటీన బాగు గాను
ఎంచు కొనరండి ముగ్గును పంచు కోండి

Tekumalla Venkatappaiah చెప్పారు...

మీ ముగ్గుల పోటీ కి నా దగ్గర ఉన్న దీపావళి ముగ్గు పంపిస్తున్నాను.మీ ముగ్గుల పోటీ కి అనూహ్య స్పందన రావాలని కోరుకుంటున్నాను.

తే!గీ!! ఆంబరమె మన హద్దని సంబరాన
ముగ్గు పోటీన కాంతల నిగ్గు తేల్చి
బ్లాగు ముగ్గుల పోటీన బాగు గాను
ఎంచు కొనరండి ముగ్గును పంచు కోండి

అజ్ఞాత చెప్పారు...

అయ్యో ఈ ముక్క ముందే తెలిసుంటే మా వూర్లో ముగ్గులపోటిలో బహుమతి వచ్చిన ముగ్గు ఫొటో తీసి పంపేసి వుందును
అయ్యో ............అయ్యో.......అయో.......

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి