Pages

6 మార్చి, 2009

తార్ మార్ తక్కిడి మార్...................

వీరీ వీరీ గుమ్మడిపండూ... ..... వీరిపేరేమిటి? బుజ్జి ! బుజ్జీ ! బుజ్జీ !........ ముక్కుగిల్లి పారిపో.................... వీరీ వీ గుమ్మడిపండూ .......... వీరి పేరేమి ? బాబి ! బాబీ ! బాబీ ! ముక్కు గిల్లి పారిపో ............................. తార్మార్ తక్కిడి మార్........ తార్మార్ తక్కిడి మార్....... తార్మార్ తక్కిడి మార్.................. వీడియో గేములూ, జెటిక్సులూ , టామన్ జెర్రీలు లేని కాలంలో పిల్లలు ఆనందంగా హాయిగా ఆడుకునే ఆటల్లో ముఖ్యమైన ఆట ’ వీరీ వీరీ గుమ్మడి పండు’ .( దాగుడుమూతలాట) ఇప్పటి పిల్లలకి అంత ఆశక్తి, తీరిక ఎక్కడుంది? ఖాళీ దొరికితే చాలు వాళ్ళు దొరికేది టీ.వీ. ల ముందో లేకపోతే క్రికెట్ ఆడుతూనో...... వీరీ వీరీ గుమ్మడిపండు ఆట మధ్య లో కళ్ళు మూయించుకున్న వారు మిగిలిన వారిని గుర్తుపట్టే వీలు లేకుండా మధ్య మధ్యలో తార్ మార్ తక్కిడి మార్.... అని అంటూ అటు ఇటు మార్చేవారు. వీరీ వీరీ గుమ్మడి పండాట కస్తా దాగుడుమూతలాట గా ఎక్కడో ఓ చోట బ్రతికే ఉన్నా ఇప్పటి పిల్లలకి తార్మార్ తక్కిడి మార్... అన్న మాటలోని గమ్మత్తు తెలియదు. అటువారిటు ఇటువారటు అని దాని అర్థం. పిల్లలు మర్చిపోయిన ఈ గమ్మత్తుల్ని గుర్తుకు తెప్పించటానికి సినిమా వాళ్ళు- రాజకీయనాయకులు కంకణం కట్టుకున్నట్టున్నారు. రాజకీయనాయకులు చక్కగా రంగులుపూసుకుని సినిమాల్లో ఒకటో అరో పాత్రలైనా ధరించటానికి మోజుపడుతుంటే... సినిమావాళ్ళేమో ఉన్న రంగుల్ని మార్చుకుంటూ ... కొత్తరంగులకోసం అదేనండి బాబు.... రాజకీయపు రంగుల వలయంలో గింగిరీలు కొట్టాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళు రాజకీయంలోకి వస్తే నీకేంటటా? అంటూ నన్ను మాత్రం ప్రశ్నించొద్దు. ప్లీజ్ ! ఎందుకంటే నేను కూడా ఓ ధనికురాల్నే కదా ... (ఓటు ఉన్నదాన్ని ) లాభనష్టాల లెక్క చూడాలి కదా! ఏదో సంఘసేవ చేయాలని ఉబలాటంతో రాజకీయాల్లోకి వచ్చే సంతోషమే. వచ్చాక వచ్చిన పని గుర్తుపెట్టుకుని పనిచేస్తే మరీ సంతోషం. అంతేకానీ పోటీపడి మరీ పరుగులు తీయటానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో భాగంగా తలతిక్క పనులు చేస్తే మాత్రం జనం ఊరుకోరన్న సంగతీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎన్నికల హడావుడిలో అందరికీ పని పెరిగింది . ఒక్క సినిమా ఫీల్డుకి తప్ప. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా మొత్తం తెలుగు సినిమా ప్రపంచం మొత్తం ౩ వర్గాలు గా చీలిపోబోతోంది. ఈ మూడు వర్గాల వారూ తమ శక్తి యుక్తుల్ని వారి వారి అభిమాన నాయకులకి ( పైసే మే పరమాత్మా హై ) ధారపోసి మరీ వారిని గెలిపించాలనే స్వామి భక్తి (వేలం వెర్రి ) కనబడుతోంది. ఇందుమూలం గా యావత్ తెలుగు ప్రేక్షకులకూ ఒక్క మనవి. మళ్ళి మేనెల దాటేవరకు కొత్త సినిమా లపై ఆశలు పెట్టు కోవద్దు.ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎన్నికల ప్రచారాలతో బిజీ బిజీ అయ్యిపోతోంది కాబట్టి. ఇండస్టీలోని నటులు , దర్శకులు మూకుమ్మడిగా ఎల (కలె)క్షన్ సెలవుతీసుకున్నా ఆశ్ఛర్యపడనక్కర్లేదు. ఎందుకైనా మంచిది ఓ చోట సినిమావాళ్ళ పేర్లు , నాయకుల పేర్లు రాసిపెట్టుకుంటే సరి. తార్మార్ తక్కిడి మార్ కదా.... ఎలక్షన్లయ్యాక ఎవరు రాజో? ఎవరు బూజో?.............. ఎన్నికల తర్వాత తార్మార్ తక్కిడిమారంటూ రాజకీయనాయకులు సినిమాల్లోకి వచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఆల్ ద బెస్ట్......................... ఆంధ్ర ప్రేక్షకా ! ( సినిమా అయినా రాజకీయమైనా కళ్ళు , నోరు తెరచి చూడటం తప్ప ఏమీ చెయ్యలేని పూర్ ఫెలో.....)

5 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

బావుందండీ !:) :)

కొత్త పాళీ చెప్పారు...

చిన్నప్పటి ఆటని నేటి సినీజకీయానికి భలే అన్వయించారు.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

రాజకీయము నందు"తారా"జకీయ
మెక్కువాయె! వారసులు యెక్క గద్దె!
నాయకులయిన వారికి మాయ మర్మ
ములును తెలియక సర్వభా ధలు పడుదురకట!

సినీ తారలు తమ టక్కు టమార విద్యలతో అందలం ఎక్కాలని
అనుకుంటూ ఉన్నారు! విపరీత వ్యక్తి దూషణలకు దిగుతున్నారు.
రాజకీయం ఉత్త రొచ్చు అనుకుని నిజమైన నాయకులు వైదొలగుతున్నారు!
ఈ పరిస్తితి లో వొటరు మరింత అయోమయ స్తితికి లోనవుతున్నాడు!
ఈ దేశం ఎటుపోతుందో! ఏ "దేశం" ఎటుపోతుందో! ఎవరికి తెలుసు?

తెలుగుకళ చెప్పారు...

అవును అంతా గందరగోళం.

Nrahamthulla చెప్పారు...

ఏకగ్రీవ ఎన్నిక
ఈ పద్దతి వలన లాభాలు

1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.
మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి