Pages

17 మే, 2009

భళి భళీ బాలకృష్ణయ్య ! ... వేసవిలో చిన్నారుల కోసం భాగవతంలోని దశమ స్కంధం.. కృష్ణ లీలలు

సృష్టి పరిణామ క్రమం నాలుగు యుగాలుగా జరిగింది. విశ్వగమనంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం కలియుగం అనే నాలుగు యుగాలు నాలుగు చక్రాలుగా వర్ణింపబడ్డాయి.కృత యుగంలో ధర్మం నాలుగు పాదాల పై నడిచింది. త్రేతా యుగంలో మూడు పాదాలపైనా, ద్వాపరయుగంలో రెండుపాదాల పైనా ధర్మం నిలబడింది. కానీ కలియుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తోంది. అధర్మం ధర్మాన్ని పీడించినప్పుడు దుష్ట శిక్షణకై భగవంతుడు అవతరిస్తాడన్న సందేశాన్ని ఇచ్చిన హిందువుల పవిత్ర గ్రంథం శ్రీమద్భగవద్గీత అవతరించింది ద్వాపరయుగంలోనే. ద్వాపరయుగంలో రాక్షసాంశతో జన్మించిన రాజులు ప్రజలను , సాధుజనులను బాధలకు గురిచేస్తోంటే భూమాత చూస్తూ భరించలేక , ఆ పాప భారాన్ని మోయలేక గోమాత గా మారి బ్రహ్మ దేవుని చేరి తన గోడును చెప్పుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరునితో కూడి పాల కడలిలో శేష శయ్యపై శయనించే విష్ణుమూర్తిని ప్రార్థించగా గగన వాణీ ఇలా చెప్పింది. " పరమాత్మా ! సాక్షాత్తూ దేవకి , వసుదేవుల కు కుమారునిగా జన్మించబోతున్నాడు. దేవతలంతా గోపీ జనాలుగా యదువంశంలో జన్మించి ఆ దివ్య బాలునికి సహకరిస్తారు. అవతార లక్ష్యం నెరవేరే వరకు దేవ గణమంతా వివిధ రూపాలలో భూమిపైనే నివసిస్తారు." పిల్లలూ ఇక మనం 'భళి భళి బాల కృష్ణయ్య' కథ చెప్పుకుందాం . శ్రద్ధగా వినండి. యాదవ వంశ మొదటి రాజు యదుమహారాజు పేరుతో ఆయన వంశీకులను యాదవులు అని పిలిచారు. ఉగ్రసేనుడు , దేవకుడు యదువంశ రాజులు. యాదవ రాజ్యాన్ని మధుర, శూర సేన రాజ్యాలు గా విభజించారు. శురసేన రాజ్యాన్ని ఉగ్రసేనుడు , మధురను దేవకుడు పాలించారు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు, దేవకుని కుమార్తె దేవకి. మధుర రాజ్యంలోనే అంధకము అనే యదు వంశశాఖ లో శూరుడు అనే రాజు కుమారుడు వసుదేవునికి తన చెల్లెలు దేవకీదేవి ఇచ్చి వైభవంగా వివాహం జరుపుతాడు కంసుడు. వివాహానంతరం బంగారు రథంపై తన చెల్లెలిని , బావను ఆమె అత్తవారింటికి పంపుతూ రథానికి తానే సారథ్యం వహిస్తాడు . సరిగ్గా అదే సమయంలో అశరీరవాణి అతన్ని ఇలా హెచ్చరిస్తుంది: "కంసా ! నీవెంత గానో ప్రేమించే నీ సోదరి ఎనిమిదవ సంతానం నీకు మృత్యువు కానున్నది" ఆ మాటలు విన్న కంసుడు నిలువునా భయకంపితుడై , కోపోద్రిక్తుడయ్యాడు. ఆ క్షణంలో తన ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యంగా తోచింది. వెంటనే అల్లారు ముద్దుగా చూసుకున్న తన చెల్లెలిని జుట్టు పట్టి లాగి ఆమె ను చంపబోగా వసుదేవుడు అడ్దుపడి అబల అయిన స్త్రీని చంపడం , అందునా నవ వధువుని చంపటం మహా దోషమనీ చెప్పి , కంసుడికి ప్రాణ భయంలేకుండా తమకు పుట్టిన సంతానాన్ని పుట్టీ పుట్టగానే అప్పగిస్తాననీ చెప్పి ఆమె ను వదిలిపెట్టమని వేడుకుంటాడు. వసుదేవుడి మాటపై నమ్మకంతో కంసుడు ఆమె ను విడిచిపెట్టి ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళతాడు.కొంతకాలానికి దేవకీ వసుదేవులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనికి కీర్తిమంతుడనే పేరు పెట్తుకుంటాడు. అన్న మాట ప్రకారం వసుదేవుడు ఆ బాలుని కంసునికి అప్పగించగా ఎనిమిదవ సంతానం వల్ల మాత్రమే ప్రమాదమని భావించి ఆ బాలుని వసుదేవునికి తిరిగి ఇచ్చేస్తాడు కంసుడు. ఒకరోజు లోక సంచారం చేస్తూ నారదుడు భూలోకం లో కంసుని దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలడిగి మాటల మధ్యలో దేవకీ దేవి ప్రస్తావన తెస్తాడు. దేవకీ దేవి కి పుట్టబోయే బిడ్డ తప్పకుండా రాక్షసాంశతో పుట్తిన కంసుని సంహరిస్తాడని చెప్పి అతనిని భయానికి గురిచేస్తాడు. ఆ మాటలు విన్న కంసునికి ఆకాశవాణి పలుకులు కూడా గుర్తుకు వచ్చి ప్రాణాలపై నున్న అమితమైన ప్రేమతో చెల్లెలిని , బావను ఇనుప సంకెళ్లతో బంధిస్తాడు.వద్దని వారించిన తండ్రి ఉగ్రసేనుడిని కూడా కారాగారం పాలు చేస్తాడు.తరువాత దేవకీ వసుదేవుల కు పుట్టిన పసి గుడ్దుల్ని ఆరుగురిని పుట్టీ పుట్టగానే నిర్దయతో చంపేస్తాడు. దేవకీ వసుదేవులు భగవంతునిపై భారం వేసి కాలం గడుపుతున్నారు. మహా విష్ణువు యోగ మాయను పిలిచి దేవకీ దేవి గర్భంలో సప్తమ శిశువును ఆకర్షించి నంద గోకులంలోని రోహిణీ దేవి గర్భంలోకి చేర్చమని ఆదేశిస్తాడు. అలా దేవకి ఏడవ సంతానం పుట్టకుండానే రోహిణీ గర్భంలోకి చేరుతుంది. అలా రోహిణీకి పుట్తిన శిశువు ఆదిశేషుని అవతారం అలా దేవకీ గర్భంలోని శిశువుని యోగమాయ సంకర్షించటం వల్ల పుట్టిన శిశువును సంకర్షణుడని ,బలశాలి అయినందువల్ల బలరాముడనీ అన్నారు. (ఇంకా ఉంది)

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మంచి పని చేస్తున్నారు.కృష్ణుని బొమ్మలకోసం నాబ్లాగు లీలామోహనం http://vijayamohan59.blogspot.com చూడండి పాత పోస్టులు.

Unknown చెప్పారు...

తెలుగుకళ లో పద్మకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అన్ని విషయాలను అందరి చేత ఆలోచింపచేస్తున్న మీకృషికి అభినందనలు


రామకృష్ట (సింగపుర)

కామెంట్‌ను పోస్ట్ చేయండి