18 మే, 2009

భళి భళీ .. బాల కృష్ణయ్య…. (భాగవతం- దశమ స్కంధంలోని కృష్ణలీలలు.. వేసవిలో చిన్నారులకు చిరు కానుక)

సృష్టి పరిణామ క్రమం నాలుగు యుగాలుగా జరిగింది. విశ్వగమనంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం కలియుగం అనే నాలుగు యుగాలు నాలుగు చక్రాలుగా వర్ణింపబడ్డాయి.కృత యుగంలో ధర్మం నాలుగు పాదాల పై నడిచింది.

త్రేతా యుగంలో మూడు పాదాలపైనా, ద్వాపరయుగంలో రెండుపాదాల పైనా ధర్మం నిలబడింది. కానీ కలియుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తోంది.

అధర్మం ధర్మాన్ని పీడించినప్పుడు దుష్ట శిక్షణకై భగవంతుడు అవతరిస్తాడన్న సందేశాన్ని ఇచ్చిన హిందువుల పవిత్ర గ్రంథం శ్రీమద్భగవద్గీత అవతరించింది ద్వాపరయుగంలోనే. ద్వాపరయుగంలో రాక్షసాంశతో జన్మించిన రాజులు అమాయక ప్రజలను , సాధుజనులను బాధలకు గురిచేస్తోంటే భూమాత చూస్తూ భరించలేక , ఆ పాప భారాన్ని మోయలేక గోమాత గా మారి బ్రహ్మ దేవుని చేరి తన గోడును చెప్పుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరునితో కూడి పాల కడలిలో శేష శయ్యపై శయనించే విష్ణుమూర్తిని ప్రార్థించగా గగన వాణి ఇలా చెప్పింది.

chikkala (103)

" పరమాత్మ సాక్షాత్తూ దేవకి , వసుదేవుల కు కుమారునిగా జన్మించబోతున్నాడు. దేవతలంతా గోపీ జనాలుగా యదువంశంలో జన్మించి ఆ దివ్య బాలునికి సహకరిస్తారు. అవతార లక్ష్యం నెరవేరే వరకు దేవ గణమంతా వివిధ రూపాలలో భూమిపైనే నివసిస్తారు."

పిల్లలూ ఇక మనం 'భళి భళి బాల కృష్ణయ్య' కథ చెప్పుకుందాం . శ్రద్ధగా వినండి./చదవండి:

యాదవ వంశ మొదటి రాజు యదుమహారాజు పేరుతో ఆయన వంశీకులను యాదవులు అని పిలిచారు. ఉగ్రసేనుడు , దేవకుడు యదువంశ రాజులు. యాదవ రాజ్యాన్ని మధుర, శూర సేన రాజ్యాలు గా విభజించారు. శూరసేన రాజ్యాన్ని ఉగ్రసేనుడు , మధురను దేవకుడు పాలించారు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు, దేవకుని కుమార్తె దేవకి. మధుర రాజ్యంలోనే అంధకము అనే యదు వంశశాఖ లో శూరుడు అనే రాజు కుమారుడు వసుదేవునికి తన చెల్లెలు దేవకీదేవిని ఇచ్చి వైభవంగా వివాహం జరుపుతాడు కంసుడు. వివాహానంతరం బంగారు రథంపై తన చెల్లెలిని , బావను ఆమె అత్తవారింటికి పంపుతూ రథానికి తానే సారథ్యం వహిస్తాడు . సరిగ్గా అదే సమయంలో అశరీరవాణి అతన్ని ఇలా హెచ్చరిస్తుంది:

"కంసా ! నీవెంత గానో ప్రేమించే నీ సోదరి ఎనిమిదవ సంతానం నీకు మృత్యువు కానున్నది"

ఆ మాటలు విన్న కంసుడు నిలువునా భయకంపితుడై , కోపోద్రిక్తుడయ్యాడు. ఆ క్షణంలో తన ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యంగా తోచింది. వెంటనే అల్లారు ముద్దుగా చూసుకున్న తన చెల్లెలిని జుట్టు పట్టి లాగి ఆమె ను చంపబోగా వసుదేవుడు అడ్దుపడి అబల అయిన స్త్రీని చంపడం , అందునా నవ వధువుని చంపటం మహా దోషమని చెప్పి , కంసుడికి ప్రాణ భయంలేకుండా తమకు పుట్టిన సంతానాన్ని పుట్టీ పుట్టగానే అప్పగిస్తాననీ చెప్పి ఆమె ను వదిలిపెట్టమని వేడుకుంటాడు.

వసుదేవుడి మాటపై నమ్మకంతో కంసుడు ఆమె ను విడిచిపెట్టి ఇద్దరినీ ఇంటికి తీసుకుని వెళతాడు.కొంతకాలానికి దేవకీ వసుదేవులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనికి కీర్తిమంతుడనే పేరు పెట్టుకుం టాడు వసుదేవుడు.. అన్న మాట ప్రకారం వసుదేవుడు ఆ బాలుని కంసునికి అప్పగించగా ఎనిమిదవ సంతానం వల్ల మాత్రమే ప్రమాదమని భావించి ఆ బాలుని వసుదేవునికి తిరిగి ఇచ్చేస్తాడు కంసుడు.

narada

ఒకరోజు లోక సంచారం చేస్తూ నారదుడు భూలోకం లో కంసుని దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలడిగి మాటల మధ్యలో దేవకీ దేవి ప్రస్తావన తెస్తాడు. దేవకీ దేవి కి పుట్టబోయే బిడ్డ తప్పకుండా రాక్షసాంశతో పుట్తిన కంసుని సంహరిస్తాడని చెప్పి అతనిని భయానికి గురిచేస్తాడు. ఆ మాటలు విన్న కంసునికి ఆకాశవాణి పలుకులు కూడా గుర్తుకు వచ్చి ప్రాణాలపై నున్న అమితమైన ప్రేమతో చెల్లెలిని , బావను ఇనుప సంకెళ్లతో బంధిస్తాడు.వద్దని వారించిన తండ్రి ఉగ్రసేనుడిని కూడా కారాగారం పాలు చేస్తాడు.తరువాత దేవకీ వసుదేవుల కు పుట్టిన పసి గుడ్దులను ఆరుగురిని పుట్టీ పుట్టగానే నిర్దయతో చంపేస్తాడు.

దేవకీ వసుదేవులు భగవంతునిపై భారం వేసి కాలం గడుపుతున్నారు. మహా విష్ణువు యోగ మాయను పిలిచి దేవకీ దేవి గర్భంలో సప్తమ శిశువును ఆకర్షించి నంద గోకులంలోని రోహిణీ దేవి గర్భంలోకి చేర్చమని ఆదేశిస్తాడు. అలా దేవకి ఏడవ సంతానం పుట్టకుండానే రోహిణీ గర్భంలోకి చేరుతుంది. రోహిణీకి పుట్తిన శిశువు ఆదిశేషుని అవతారం. అలా దేవకీ గర్భంలోని శిశువుని యోగమాయ సంకర్షించటం వల్ల పుట్టిన శిశువును సంకర్షణుడని ,బలశాలి అయినందువల్ల బలరాముడనీ అన్నారు.తరువాత యోగమాయ విష్ణువు ఆదేశం పై గోకులంలోని నందుని భార్య యశోదగర్భంలో ప్రవేశిస్తుంది.

అక్కడ కంసుని కారాగారంలో బందీగా ఉన్న దేవకీ దేవి గర్భంలో శ్రీ మహా విష్ణువు ప్రవేశించగా ఆమె ఆ తేజస్సు వల్ల ఉదయిస్తున్న సూర్యుని లాగా ప్రకాశిస్తోంది. అది గమనించిన కంసుని విచారం రోజురోజుకీ పెరుగుతోంది. శిశువు ను పుట్టకుండానే సంహరించాలా లేక పుట్టగానే చంపాలా ? అన్న ఆలోచనలో పడ్డాడు. ఒక స్త్రీని అందునా గర్బిణి ని చంపటం వల్ల సంపద నాశనమౌతుంది. సంపద కోల్పోవటమంటూ జరిగితే లోకం తనను గౌరవించదు.కీర్తిని, ఐశ్వర్యాన్నికోల్పోయిన తరువాత జీవించటమే వ్యర్థం అనుకొని ఆ ఆలోచనను మానుకున్నాడు.ఒక నాడు పరమ శివుడు, పరబ్రహ్మ సకల దేవగణసమేతంగా వచ్చి దేవకీ గర్భంలొ ఉన్న అవతారపుతుషుని వేవేల స్తుతించి …. దేవకీ వసుదేవులను దీవించి, లోకంలో మర్కట కిశోర న్యాయం ,మార్జాల కిశోర న్యాయం అని రెండు రకాల న్యాయాలు ఉంటాయని చెపుతారు.

మొదటిదాని లో పురుష ప్రయత్నం ఉంటే.. రెండవ దానిలో ఆత్మార్పణం ఉంటుందనీ పిల్లి పిల్ల పూర్తిగా తన భారాన్ని తల్లి పై వేసి రక్షింపబదుతుందని చెప్పి అదేవిధంగా భారమంతా భగవంతునిపై వెయ్యమని చెప్పమాయమౌతారు.పరమాత్మ శ్రీకృష్ణావతరంలో అవతరించే సమయం అసన్నమయింది. రోహిణీ నక్షత్రయుక్త పవిత్ర లగ్నంలో ప్రకృతి పులకరింతలతో ఆ స్వామికి స్వాగతం పలికింది. అగ్నిహోత్రాలు జ్వలించాయి. దేవదుందుభి నాదాల తో దేవ గంధర్వ , యక్ష, కెన్న, కింపురుష జయజయ ధ్వానాల మధ్య పద్మంలోని రేకుల వంటి కన్నులతో , శంఖు , చక్ర గదాది ఆయుధాలతో మహాతేజస్సంపన్నునిగా జన్మిస్తాడు. అదే సమయానికి యోగమాయ కూడా జన్మిస్తుంది. దేవకీ వసుదేవులు ఆ మహా తేజస్సును ,తేజో మూర్తిని చూసి నమస్కరించి కీర్తించారు.

kannayya 9

దేవకీ వసుదేవుల ప్రార్థనలకు సంతోషించి భగవానుడు ఈ విధంగా పలికాడు. " దేవకీ దేవీ! గత జన్మలో మీరిరువురి పృశ్ని, సుతపులనే దంపతులు . నా పై అచంచల మైన భక్తితో నా సాక్షాత్కారానికై మహా తపస్సుచేయగా నేను ప్రత్యక్షమై వరముకోరుకోమనగా నా మీది వాత్సల్య భావముతో నా వంటి కుమారుని వరంగా ఇమ్మని మూడుసార్లు కోరారు. మీ కోరిక తీర్చటం కోసం ఆ జన్మలో పశ్ని గర్భుడనే పేరుతో మీకు పుత్రునిగా జన్మించాను. తరువాతి జన్మలో మీరు అదితి , కశ్యపులుగా పుట్టగా నేను మీకు ఉపేంద్రునిగా జన్మించి , వామనునిగా బలి చక్రవర్తిని అంతమొందించాను. ఈ జన్మలో దుష్ట శిక్షణ కోసం అవతరిస్తూ మీ మూడవ కోరిక తీర్చటం కోస నేటి మీ కష్టాలను కలిగించాను."

"కంసుని గురించి మీరు చింతించ వలసిన పనిలేదు. ఈ క్షణమే నన్ను వ్రేపల్లెలోని నందయశోదల వద్దకు చేర్చి అక్కడ నాతో పాటు జన్మించిన శిశువును ఇక్కడకు తీసుకుని రండి" అని చెప్పాడు.

kannayya7

వసుదేవుడు ఆ ఆదేశాన్ని శిరసా వహించి, అతనికి నమస్కరించి దేవకి సహాయంతో ఆ శిశువును ఒక చిన్న బుట్టలో ఉంచి వ్రేపల్లెకు బయలుదేరుతాడు. అతని కాళ్ళకున్న సంకెళ్ళు వాటికవే వీడిపోతాయి.చెరసాల తాళాలు పగిలి ద్వారాలు తెరుచుకున్నాయి. కాపలా కాస్తున్న భటులంతా స్పృహ కోల్పోయారు. కారు మేఘాలు ముసిరి గర్జనలతో పెను వర్షం కురుస్తూండగా వసుదేవుని తలపై నున్న చిన్ని కృష్ణునికి ఐదు తలల ఆదిశేషుడు గొడుగుపట్టాడు.

kannyya8

యమునా నది ఒక ప్రక్క వాసుదేవుని దర్శించిన ఆనందంతో ఉరకలెత్తుతూ వెనుకగా వచ్చి వ్రేలాడుతున్న చిన్ని చిన్ని పాదాలను ముద్దాడి, మరొక ప్రక్క వసుదేవునికి దారినిచ్చింది.నందుని గోకులాన్ని చేరుకుని వసుదేవుడు నిద్రిస్తున్న యశోదమ్మ పక్కలోని పాపాయిని తీసుకుని చిన్ని కృష్ణుణ్ణి ఆమె వద్ద ఉంచి వెనుదిరిగాడు.

యథావిధిగా తిరిగి కంసుని కారాగారానికి రాగా తలుపులు తెరుచుకున్నాయి. ఏడుస్తున్న చిన్నారి గొంతు విన్న సైనికులు కంసుడికి దేవకి ప్రసవించిందని చెప్పగా కంసుడు హుటాహుటిన వచ్చి ఆడ శిశువును చూసి మరింత ఆగ్రహంతో లాక్కొన్నాడు. దేవకి "నీవనుకున్న విధంగా నీకు హాని తలపెట్టటానికి ఇది మగ శిశువు కాదు. కాబట్టి నిన్ను ఏమీ చేయదు. మాపై దయ ఉంచి ఈ చిన్నారిని విడీచిపెట్టు" అని ప్రార్థించింది. ప్రాణాలపై నున్న తీపి వల్ల ఆమె మాటలు అతని చెవికెక్కలేదు.నిర్దయుడై ఆ శిశువును ఒడిసి లాగి కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి అక్కడే ఉన్న పెద్ద బండపై మోదాడు. ఆ శిశువు నింగికి ఎగిరింది. ఎనిమిది చేతులతో ఆయుధాలను చేతపట్తిన శక్తి రూపిణి గా యోగమాయ ఆవేశంతో ఇలా అంది:

" మూర్ఖా ! కంసా ! పసిపాపలని కూడా చూడకుండా దేవకి బిడ్డలను నీ కరవాలానికి బలిచేశావు. నిన్ను అంతం చేసేందుకు అవతరించిన బాలుని చేతిలో నీ చావు తప్పదు."

అని చెప్పి అంతర్ధానమైంది.

కంసుడి దుఃఖానికి అంతులేదు. ఎలాగైనా సరే ఆ బాలుడిని కనిపెట్టి తన మృత్యువును జయించాలని నిశ్చయించుకున్నాడు . తన సైనికులను పంపించి రాజ్యమంతా వెదికించి అప్పుడే పుట్తిన పసికందులను తుదముట్తించాడు. కానీ గోకులం అంతటా మధుర కు భిన్నమైన వాతావరణంలోఉంది. రేపల్లె సంతోష సంభ్రమాలలో మునిగి తేలుతోంది.నందుడు భార్యా సమేతంగా పూజాదికాలు నిర్వర్తించి , చిన్ని కృష్ణుని పేర దాన ధర్మాలు చేశాడు. యాదవులు తమ రాజు నందునికి , చిన్నారి బాలునికి రకరకాల కానుకలు సమర్పించుకున్నారు. కంసుని కి సామంతరాజులందరూ ప్రతిసంవత్సరం కానుకలు సమర్పించుకుంటారు. ఈ సారి కూడా అలాకానుకలిచ్చేందుకు నందుడు మధురకు బసచేయగా అక్కడికి వసుదేవుడు చేరుకుని చిన్నారుల యోగక్షేమాలు తెలుసుకుని కంసుని ఆగ్రహాన్ని గురించి చెప్పి త్వరగా ఇంటీకి పోయి బాలకులను కాపాడుకోమని చెబుతాడు. అది విన్న నందుడు భయభ్రాంతుడై హుటాహుటిన రేపల్లెకు చేరుకుంటాడు.

ఫూతన సంహారం:

అప్పటికే కంసుడు ఏ రూపాన్నయినా ధరించే శక్తి గల పూతన అనే రాక్షసిని పిలిచి నందుని కొడుకులను సంహరించమని పంపిస్తాడు. పూతన మామూలు మహిళ గా రూపం ధరించి నందుని ఇంటికి వచ్చి యశోదమ్మనడిగి ఏడుస్తున్న బాల కృష్ణుణ్ణి ఎత్తుకుని పక్కకు తీసుకెళ్ళ్లి విషపూరితమైన పాలివ్వబోయింది. మన అల్లరి కృష్ణుడేం తక్క్కువ తిన్నాడా? పాలుతాగుతూనే ఆమె ను బిగబట్టి ఉక్కిరి బిక్కిరి చెయ్యటం మొదలుపెట్టాడు. పూతన చిన్ని కృష్ణుడితో సహా ఆకాశానికి ఎగిరి బాలుణ్ణి విసిరి వెయ్యాలని ప్రయత్నించింది. గడుగ్గాయి కృష్ణుడు ఆమెను ఓ పట్టు పట్టి ప్రాణాలు తీశాడు. అమె అంతఎత్తునుండి నేలకొరిగింది. ఒకొఏసారి పెద్ద చప్పుడు కాగా యశోదమ్మ పరుగెత్తుకుంటూ .. కన్నయ్యా ! .. అని పెద్ద పెద్ద కేకలు పెడుతూ వచ్చి చూసేసరికి పెద్ద రాక్షసి నేలకూలింది. భయంకరమైనా ఆ రూఫంపై చిన్నారి బాలుడు ఆడుకుంటూ కనిపించేసరికి .. కంగారుగా పిల్లవాడ్ని గుండేలకు హత్తుకుని ఎన్నెన్నో దిష్టులు తీసింది.

putana

శకటాసుర భంజనం:

యశోదమ్మ ముద్దుల కన్నయ్య బోర్లా పడటం మొదలుపెట్టటంతో గోపజనాల ఆనందానికి అవధులులేవు. ఊరంతా పండుగ చేసుకున్నారు. నందయశోదలు పూజాదికాలు నిర్వహిసున్నారు. కృష్ణుడికి మంగళ స్నానాలు చేయించి యశోద ఆరుబయట ఉయ్యాల వేసి పడుకోబెట్టి లోనికి వెళ్ళింది. దబ్బుమన్న చపుడు వినబడి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఉయ్యాలలో కన్నయ్య ఆడుకుంటూ కనిపించాడు. కానీ పక్కనే ఉన్న బండి మాత్రం ముక్కలు ముక్కలై కనిపించింది. అప్పటికే చుట్తుపక్కల జనం గుమిగూడి వింతగా చూస్తూ చిన్ని కృష్ణయ్య కాలి దెబ్బకి అంత పెద్ద బండి ఎలా ముక్కలైందో అనుకుంటూ ఏదో గాలి సోకిఉంటుంది పిల్లాడికి అని చెప్పేసరికి యశోదమ్మ కంగారుగా పిల్లాడ్ని తీసుకుని లోనికి పరుగుతీసింది.కానీ చిన్ని కృష్ణయ్య తనను చంపటం కోసం కంసుడు పంపించగా వచ్చి తన మీదికి దూసుకొచ్చి తన కాలి దెబ్బకు ముక్కలైన శకటాసురుడిని చూసి ఓ చిరునవ్వు నవ్వాడు.

తృణావర్తుడు:

ఓ రోజు కంసుని ఆఙ్ఞపై తృణావర్తుడనే రాక్షసుడు వ్రేపల్లెకు వచ్చాడు.ఆ క్షణంలో యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చొన బెట్టుకుని ఆడిస్తున్నది. తృణావర్తుని గమనించిన మన బాలకృష్ణయ్య ఒక్క సారిగా తన బరువును పెంచేసరికి యశోద ఒక్క సారి పిల్లవాడ్ని అరుగు మీద కూర్చొనబెట్టి పనిమీద ఇంటిలోకి వెళ్ళింది. ఇక దొరికిందే సందుగా తృణావర్తుడు సుడిగాలిగా మారి విజృంభించి చిన్నారి చిన్నారి బాలునిపై విరుచుకుపడ్డాడు. పెనుధూళులు , రాళ్ళవాన, వీటికి తోడు చిమ్మ చీకట్ల తో ఆ ప్రాంతమంతా అంధకార మైపోయింది. ఇది గమనించిన యశోద గాభరాగా వచ్చి , అకాల మార్పుకు భయపడి బిడ్డ కోసం వెదికి కనిపించకపోయేసరికి గొల్లుగొల్లుమంటూ భోరున ఏడ్వసాగింది. గోపబాలికలు , గోపాలురు వచ్చి ఆమెకు ధైర్య వచనాలు పల్కుతున్నారు.ఒక్కసారిగా అందరినీ కలవరపాటు పాలుచేస్తూ ఆకాశం నుండి ఒక నల్లని భీకర ఆకారం పెను కేకలు పెడుతూ నేల కూలింది. దాని చేతిని గట్టిగా పట్తుకుని నందనందనుడు వ్రేలాడుతున్నాడు. గోపగోపీజనానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుఅయ్యింది. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళి అల్లరి కృష్ణుణ్ణి తీసుకొచ్చి తల్లికిచ్చారు." ఏ జన్మలో ఏ నోము నోచానో .. ఏ సిద్ధుని దర్శించామో, ఎవరికి ఏమి పెట్టానో ఆపుణ్య ఫలమే నేడు నాబిడ్డను కాపాడింది." అనుకుంటూ బిడ్డను హత్తుకుంది.

వెన్నదొంగ:

చిన్నారి కన్నయ్య ఓ రోజు ఆటలాడుతూ మన్ను తినటం చూస్తాడు బలరాముడు. వెంటనే వెళ్ళీ పనిలో ఉన్న యశోదను వెంటపెట్టుకొచ్చి చూపిస్తాడు.ఆమె కన్నయ్యను ప్రశ్నిస్తుంది. అమాయకంగా చూసి నేను తినలేదని చెప్పుతాడు కన్నయ్య.నోరు చూపించమని అడిగిన తల్లికి చిన్ని నోటిలో విశ్వాన్ని,కోటానుకోట్ల జీవరాశుల్ని చూపిస్తాడు.

పులకించిన యశోద వాసుదేవుని విశ్వరూపాన్ని చూసి తరించింది.

ఒక రోజు కన్నయ్య పెరుగుబాన పై ఓ బండరాయి విసిరి దాన్ని పగులగొట్టి ఆనందిస్తుండగా అదిచూసిన తల్లికి కోపం వచ్చి బరబరా ఈడ్చుకెళ్ళి ఓ లావుపాటి తాటితో ఒక రోటికి బంధిచింది. కృష్ణయ్య ఆ రోటితో పాటు ప్రాకులాడుతూ మద్ది చెట్ల మధ్య నుండి వెళ్ళగా పెద్ద చప్పుడు చేసుకుంటూ చెట్లు నేలకూలిపోతాయి. వాటి స్థానం లో శాప విమోచనం పొందిన గంధర్వులు కృష్ణుని వేనోళ్ళ స్తుతించి మాయమౌతారు. పిల్ల వాడికి పెద్ద ప్రమాదం తప్పిందనుకుంటూ యశోద కన్నయ్యనెత్తుకుని లోనికి పరుగులు తీసింది.

ఇక కన్నయ్య అల్లరి గోపికల ఇళ్ళకి చేరింది. చాటుమాటుగా వారి ఇళ్ళలో ప్రవేశించి పాలు, పెరుగు, వెన్న దొంగిలిచటం, మధ్యమధ్యలో తన్నులు తినటం జరుగుతుంది.

వారి ఇళ్ళలో ముంతలు పగులగొట్టి వాళ్ళ తిట్లు తినడం మామూలైపోయింది.

ఒకరోజు కృష్ణుని ఆగడాలు భరించలేక గోపికలంతా చేరి యశోదకు కన్నయపై ఫిర్యాదు చేస్తారు. మా కన్నయ్య అమాయకుడని వాళ్ళపై తిరిగి పోట్లాడుతుంది యశోద.

బలరామ కృష్ణులు పెరిగి పెద్దయ్యారు. గోపబాలురతో పాటు గోవులను మేపేందుకు గోవర్ధన గిరికి వెళ్లి గోవులు మేస్తుండగా ఆటపాటలలో తేలియాడేవారు.

గోపాలుని మధురమైన వేణుగానానికి పశువులు పరవశించ సాగాయి.

వత్సాసుర వధ:

అలా మేపుతుండగా ఒక రోజు వత్సాసురుడనే రాక్షసుడు కంసుని ఆదేశంపైన ఒక దూడగా మారి గోవుల మందలో కలిసిపోతాడు.అది గమనించిన కృష్ణుడు బలరామునికి సైగ చేసి ఆ దూడ రూపంలోని రాక్షసుని వెనుకకాళ్ళు పట్టి గిరగిరా తిప్పి చెట్టు కేసి బాదుతాడు.ఇక వత్సాసురుని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

బకాసుర వధ:

ఒక రోజు గోపబాలురతో బలరామ కృష్ణులు ఆడుకుంటుండగా ఒక పెద్ద బకము అంటే కొంగరూపంలో వచ్చిన రాక్షసుడు తటాలున వచ్చి కృష్ణుడిని మింగేస్తాడు. కొంగ గొంతులో చిక్కిన కృష్ణుడు దాని గొంతులో, దవడలమీద బాదటంతో అది నేల కూలింది.

అఘాసుర వధ:

ఒకరోజు గోపబాలురతో కలిసి గోపాలుడు ఆటలాడుతూ దోబూచులాడుతూంటే అక్కడికి వచ్చిన అఘాసురుడనే రాక్షసుడు తన అక్క పూతనను, అన్న బకుని చంపిన కృష్ణు ని ఎలాగైనా అంతం చేయాలని తలపెట్టి ఒక పెద్ద కొండచిలువగా మారి కృష్ణుని , గోపాలురని మింగాలని చూసింది. అది గమనించిన కృష్ణుడు దాని నోటిలో దూరిఒక్క సారిగా శరీరాన్ని పెంచేసరికి ఊపిరాడక గిలగిల కొట్తుకుంటూ చచ్చిపోతుంది.

బ్రహ్మ పరీక్ష:

ఒకరోజు కృష్ణుడి మహిమలను పరీక్షించదలచి సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు భూమిపైకి వచ్చి మేత మేస్తున్న గోవులను మాయం చేస్తాడు. ఆ సమయంలో గోపాలురంతా పచ్చికబయళ్ళపై గుమిగూడి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ చద్దిముద్దలు ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు. విషయం తెలిసిన కొందరు పరుగులు తీయబోగా , భోజనం మధ్యలో లేవడం తగదని వారిని వారిస్తాడు కృష్ణుడు. నే వెళ్ళీ చూస్తానని చెప్పి వెళ్ళి వెతుకగా గోవుల జాడ కానరాక వెనుదిరిగి వచ్చి గోపాలురు కూడా కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతాడు. అంతా విధాత మాయగా గ్రహించి చిరునవ్వుతో గోపబాలురను, గోవులను మళ్ళీ సృష్టిస్తాడు. దాదాపు ఒక సంవత్సరం గడిచినా వ్రేపల్లెలో ఎటువంటి మార్పూలేకపోయే సరికి బ్రహ్మ నిశ్చేష్టుడై కృష్ణుని ముందుకు వచ్చి వేవేల కీర్తించి మన్నించమని ప్రార్థిస్తాడు.

ధేనుకాసుర సంహారం:

ఒక రోజు గోపబాలురు ఆటలాడుతూ ఒక పెద్ద తాళవనంలోకి ప్రవేశించారు. నోరూరించే ఆ వనంలోని తాటిపళ్ళు తినాలని ఆశపడితే అక్కడున్న ధేనుకుడనే రాక్షసుడు గార్ధబ రూపంలో తనపరివారంతో నివసిస్తూ గోపాలుకులని భయపెట్టేసరికి అంతా వచ్చి కృష్ణుడికి వివరిస్తారు. బలరామకృష్ణులక్కడికి వెళతారు. బలశాలియైన బలరాముడు తాటి చెట్టును బలంగా కదిపితే పళ్ళు జలజలా రాలుతాయి. ఆ చప్పుడుకి ధేనుకాసురుడూ వచ్చి కృష్ణ బలరాములపై దాడిచేస్తాడు.మీదబడి కాళ్ళెత్తిన గాడిదను బలరాముడు ఒడిచి పట్తి గిరిగిర తిప్పి ఓ పెద్ద చెట్తుకేసి బాదుతాడు.అది అంతం కాగానే గోపాలురు ఆనందోత్సాహాలతో తాటిపళ్లను తనివితీరా తింటారు.

కాళీయమర్దనం:

ఒకరోజు గోవులను కాసి, ఆటలాడి అలసిపోయిన గోపాలురు సమీపంలోని యమునానదిలో నీరు తాగడానికి పోయి అందులోని విష సర్పం కాళీయుని విషజలం వల్ల ప్రాణాలు కోల్పోతారు.యమునా జలాలు నీలి రంగులోకి మారిపోవటం సమీపంలో పక్షులు కుప్పలుగా చచ్చిపోవటం , చెట్లన్నీ మాడిపోయికనిపించటంతో బాల కృష్ణుడు రంగంలోకి దిగుతాడు. తటాలున మడుగులోకి దూకి కాళిందిపై దాడి చేస్తాడు. అది మహాకోపంతో విషపు కోరలతో కృష్ణుడిపై ఎదురుదాడి చేస్తుంది.కృష్ణుడిని చుట్టిపడేయాలని ఎగబడిన కాళింది తోకపట్టి దాని శిరసుపైకెగిరి తాండవం చేస్తాడు. చిన్ని పాదాలైనా తలపై తగిలే దెబ్బలతాకిడికి తాళలేక సర్పం విషం , రక్తం కక్కుతుంది.

ఇక ఆ బాధచూడలేక కాళీయుని భార్యలు కృష్ణుని ప్రార్థిస్తారు.ఇకపై యమునా సమీపంలో కనిపించరాదని , సాగరానికి పొమ్మని ఆదేశించి దానిని వదిలిపెడతాడు.

గోవర్థనోద్ధరణం:

సకాలంలో వర్షాలు కురిపిస్తూ పాడిపంటలను ప్రసాదిస్తున్నందుకు గోపజనం ప్రతి సంవత్సరం ఇంద్రుడీకి యాగం చేసి హవిస్సులర్పిస్తారు. ప్రతిసంవత్సరం లాగే ఈసారి కూడా యాగానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ కృష్ణుడికి ఆ సంగతి చెబుతారు. ప్రకృతి సహజంగానే దాని ధర్మాన్ని నిర్వర్తిస్తుండగా ప్రత్యేకించి ఇంద్రపూజ చేయవలసిన అవసరం లేదనీ పశువులకు నిత్యమూ ఆశ్రయాన్నిచ్చే గోవర్థనగిరిని పూజించమని చెబుతాడు. దానితో ఆ సంవత్సరం ఇంద్రాది దేవతలకు బదులుగా గోపజనం గోవర్థన గిరిని పూజిస్తారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అవమానంగా భావించి ఆగ్రహించి వరుణాది దేవతలను పిలిచి తనను నిర్లక్ష్యం చేసిన వెర్రి బాలకులకు బుద్ధి చెప్పాలని , విర్రవీగుతున్న బుడతడు కృష్ణుడి గర్వాన్ని అణచాలనీ అందుకోసం ప్రళయాగ్నిని తలపించే రీతిలో జడివానలు కురిపించమనీ ఆదేశిస్తాడు.

అకస్మాత్తుగా చెలరేగిన వడగళ్ళవానకు రేపల్లె అంతా చెల్లాచెదరు అవుతుంది.ఆబాలగోపాలం సుడిగాలులకి , ఉరుములు , మెరుపులకి అల్లాదిపోతూ శరణు శరణంటూ

శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తుంది. అకాల వర్షానికి ఇంద్రుడి ఆగ్రహమే కారణమని గ్రహించి నందనందనుడు తన్ను శరణన్న వారికి అపాయం కలుగదని చెప్పి ఇంద్రుని అహంకారాన్ని పటాపంచలు చేయాలని తలచి అంతపెద్ద గోవర్థన గిరిని అవలీలగా చిటికెన వ్రేలిపై నెత్తి గొడుగు గా చేసి గోపజనాన్ని రక్షించాడు. దానితో ఇంద్రుడి గర్వం అణగి భగవంతునిగా కృష్ణుని గుర్తించి శరణు వేడుకుంటాడు. అతనిని క్షమించి సంపదతో గర్వం వస్తుందనీ తక్శణమే తాను ఆ సంపదలు దూరం చేసి కనువిప్పు కలిగిస్తానని అంటాడు.

అప్పుడు కామధేనువు కృష్ణుడిని చేరి మహాత్మా ! నీ వల్ల నాకులమంతా ఇంద్రుని బారినుండి రక్షించబడింది. ఎవరైతే రక్షకుడో అతనే ఇంద్రపదవికి అర్హుడు. నేను నిన్ను మాత్రమే ఇంద్రునిగా భావించి అభిషేకిస్తాను.ఇకపై నీతోనె ఉంటాను అనిపలికి కృష్ణు ని ఆకాశ గంగా జలాలను కలిపి తనపాలను ధారగా కురిపించి అభిషేకిస్తుంది

గోపాలుని వేణుగానామృతం:

నందకిశోరుని వేణుగానం ఆద్యంతం అమృతమయమై ఆబాలగోపాలన్నీ మైమరపింపజేస్తూ ఉండటంతో గోపికలు కృష్ణుడే లోకంగా సర్వం కృష్ణమయంగా భావించి జీవించసాగారు.

గోపికా వస్త్ర్రాపహరణం:

శరత్కాల పూర్ణీమ నాడు చల్లని వెన్నెలలో గోపికలు వస్త్రాలను గట్టుపై పెట్టి నది లోజలకాలాడుతుండగా వెన్నదొంగ అక్కడకు చేరి వారి వస్త్రాలను దాచిపెట్తి వారిని ఆటపట్టిస్తాడు.గోపికలందరూ గతజన్మలో కృష్ణుని సాంగత్యం కోసం తపస్సు చేసిన మునివర్యులే.

నారదుని రాక:

నారదుడు కంసుని చేరి కంసుని కి రానున్న ఆపదను గురించి మరలా హెచ్చరిస్తాడు. దేవకీ వసుదేవులు నందయశోదల దగ్గర పెరిగిపెద్దయ్యారని త్వరలోనే వారు కంసునిపై దండెత్తి వచ్చి అతనిని సంహరిస్తారని చెబుతాడు. అది విని ఆందోళన పడిన కంసుడు వివిధ రకాల ప్రయత్నాలతో బలరామకృష్ణులను అంతం చేయాలని చూసి విఫలుడౌతాడు.చివరికి ఒక పన్నాగం తో అకౄరుడిని కృష్ణుడి దగ్గరికి రాయబారిగా పంపి కృష్ణ బలరాముల జన్మ వృత్తాంతం చెప్పి ,తాను చేయబూనిన ధనుర్యాగానికి రాకుమారులను సాదరంగా మధురకు ఆహ్వానించాలని రేపల్లెకు పంపిస్తాడు.

అకౄరుడు నందయశోదలకు విషయం చెప్పి , నచ్చజెప్పి వారిని తనతో తీసుకెళతాడు. కృష్ణుడి ని వీడవలసి వచ్చేసరికి రేపల్లె శోక సముద్రమైపోతుంది.

కొన్ని ఏళ్లపాటు రాకుమారులను కోల్పోయిన దుఃఖంలో ఉన్న మధుర కృష్ణ బలరాములు వస్తున్నారన్న శుభవార్తతో పులకించి, వారికోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

మధురలో కృష్ణయ్య:

మధురకి రాగానే అన్నదమ్ములకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఒక సాలె వాడు ఎదురుపడి క్రుష్ణుడికి చిత్రవిచిత్రాలైన వస్త్రాలను బహూకరించాడు.తరువాత సుదాముడనే వాని కోరికపై అతని ఇంటికి వెళ్ళీ అతని పూజాదికాలందుకున్నారు.

కుబ్జ శాపవిమోచనం:

మధురపురవీధులలో విహరిస్తుండగా గూని యై అందవికారముగా ఉన్న ఒక స్త్రీ రాజాంతఃపురానికి సుగంధ పాత్రలను మోసుకుంటూ వెళుతుండగా కృష్ణుడామెను పిలిచి " సుందరీ! ఈ సుగంధాలు మాకూ ఇస్తా వా? అని అడుగుతూ ఆమెను తాకి ఆమె వైకల్యాన్ని పోగొడతాడు.

కంసుని అవస్థలు:

మధుర చేరిన బలరామకృష్ణులను చంపాలని కృష్ణుడు నిద్రాహారాలు మాని కుట్రలు పన్నడం మొదలుపెడతాడు.ఒక విశాలమైన వేదికపై మల్ల యుద్ధాన్ని అందుకు సరిఅయిన మార్గంగా ఎంచుకుని వారికి కబురంపుతాడు.

ఛాణూరముష్టికాసురులను కృష్ణుడిపైకి మల్ల యుద్ధానికి పంపించగా వారిద్దరూ ఆ రాక్షసులని అవలీలగా మట్టి కరిపించారు. ఇక ఆవేశాన్ని ఆపుకోలేక కంసుడు రంగప్రవేశం చేసి వారిపై దుముకుతాడు.కృష్ణుడతని మెడపట్తి కిరీటాన్ని విసిరి నేలపై ఈడ్చి అతనిని సంహరించాడు.

మధుర వాసుల జయజయ ధ్వానాలమధ్య దేవకీ వసుదేవులను బంధనాలనుండి విముక్తి చేశాడు.

4 వ్యాఖ్యలు:

హరే కృష్ణ . చెప్పారు...

చాలా బావుంది మీ వర్ణన ..మీకు అభినందనలు..పుణ్యం ఈ విధం గా పంచుతున్నందుకు మీకు కృతఙ్ఞతలు..

తెలుగుకళ చెప్పారు...

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మంచి పని చేస్తున్నారు.కృష్ణుని బొమ్మలకోసం నాబ్లాగు లీలామోహనం http://vijayamohan59.blogspot.com చూడండి

durgeswara చెప్పారు...

బాలా గోపాలకృష్ణా ! పాహి పాహి

అజ్ఞాత చెప్పారు...

thanks to you and i need the history of yadavas before krishna and after krishna please put it in your blog

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి