Pages

13 మే, 2009

నిత్య కళ్యాణమస్తు !

ఓ చల్లని వేళ

ఓ అందమైన రోజు

కొక్కొరొకో అంటూ తొలికోడి కూత తో

సన్నాయి రాగం వినబడుతూంటే..

వెన్నెల పంచిన జాబిల్లి

వెళ్ళనంటూ మారాం చేస్తుంటే

వెలుగును మోసుకొచ్చిన

సూరీడు వస్తానంటూ తొందరపడుతోంటే....

వేడి వేడి వెచ్చని గాలుల్లో

చల చల్లని నవ్వుల ఝల్లుల్ని కురిపిస్తూ .....

ఓ శుభ ముహూర్తాన

ఒక గూటికి చేరటం కోసమే పుట్టిన

రెండు మనసుల్ని ఏకం చేసేందుకై.......

ఆకాశంలోని నక్షత్రాలన్నీ

ఆ ఇంటి ముందు రంగవల్లులయ్యాయి.

రంగురంగుల ధనువులోని

ఏడు రంగులనూ రంగరించి

రమ్యమైన పూలుగా మార్చి......

పూల తోరణాలు చేసి..

వచ్చే పోయే వారిని

రారమ్మంటూ ఒక్కటౌతున్న ఇద్దర్ని

ముద్దు మురిపాలతో జీవించమని

దీవించమంటూ

ఆశీర్వదించమంటూ...ఆహ్వానిస్తున్నాయి

ముచ్చటగా ముస్తాబై

పెళ్ళికూతురి గా మెరిసిపోతూ

ఓ అల్లరి అమ్మాయి చిలిపి కన్నులతో

కాబోయే తన రాజుని

మనసున్న మారాజుని

కొంటె చూపులతో ఓరగా

చూస్తూ...

నేరుగా చూడలేక

చూడకుండా ఉండలేక

ముప్పు తిప్పలు పడుతుంటే...

ఆ చూపుల బాణాలు గుచ్చుకుని

ఆ రారాజు ఆమె మనసుదోచిన

మహరాజు ....

తప్పించుకోలేక ఇక తప్పదనుకుంటూ

ఆమె గారాల సింగారాలకి

తలవంచి ఆ కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూసి

దొరికిపోయిన దొంగలాగా

ఉలిక్కి పడి .. ఓ చిరునవ్వు పువ్వు

ఆమె బుగ్గలపై విసిరి

గిలిగింతల పలకరింతలతో

ఆమెని పులకరింతల పాలు చేసి.....

సడిచెయ్యని గాలిలాగా సర్దుకున్నాడు.

మేళ తాళాలు మంగళ వాద్యాలు

సందడి చేస్తూ .. ఊరంతా పండగ చేసుండగా

సుతారంగా ఆమె చెయ్యందుకుని

దర్జాగా ధీమాగా ముందడుగేశాడు.....

ఆ బాజాలు భజంత్రీలు ఏటేటా మళ్ళీ మళ్ళీ

అదే సమయానికి మోగుతున్నాయి

ఆ అమ్మాయి అల్లరి చూపుల్ని

ఆ అబ్బాయి చిలిపి చేష్టల్ని

పదే పదే గుర్తుచేస్తున్నాయి

తియ్యటి తినుబండారాలు

కమ్మటి కబుర్లతో పెళ్ళిరోజు పండుగ

కన్నుల విందుచేస్తానంటూ

ఎప్పటిలాగే ఇప్పుడూ వచ్చేసింది

ఆశల ఆకాశంలో స్వేఛ్చగా విహరించే

ఆ పక్షుల జంట

స్వచ్చమైన పువ్వుల పై

మకరందాన్ని గ్రోలుతూ

పరుగులు తీస్తున్న ఆ తుమ్మెదల జోడీ

చిటపట చినుకులకు పరవశించి

నాట్యమాడే ఆ మయూరాలు

పచ్చని చెట్లపై ఊసులాడుకుంటున్న

చిలకా గోరింకలు

మనోహరమైన సెలయేళ్ళలో విహరిస్తోన్న

ఆ హంసల ద్వయం.... మరెవరో కాదు

నా నేస్తాలుగా.. దేవుడు నాకిచ్చిన బంధువులు

ఆనాటి ఆ వేడుకలు చూసే భాగ్యం నాకు లేకున్నా

ఆ కన్నుల కాంతులు కలకాలం

కళకళ లాడాలనీ

చిన్నారుల చిరునవ్వులు వెన్నెలలుగా చిరకాలం

వెలుగులు చిందించాలనీ.....

మనసారా ... కోరుకుంటూ... శుభాకాంక్షలందిస్తున్నాను

నాకు తోడుగా నాతో పాటుగా

నా నేస్తాలను దీవిస్తారా.....

5 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

మీ నేస్త ద్వయానికి అభినందనలు, శుభాకాంక్షలు...

పరిమళం చెప్పారు...

మాటలు రావడం లేదండీ ! అధ్బుతం గా రాశారు ! మీ నేస్తాలకు శుభాకాంక్షలు ..

భావన చెప్పారు...

బాగుందండి పెళ్ళి సందడి. ఒక్కసారి మనసును వెనక్కి అలా తీసుకుని వెళ్ళేరు.
మీ నేస్తాలకు నేను కూడా అందిస్తున్నా శుభాకాంక్షలు.
జీవితాన ఎప్పటికి ఆ తొలి వెలుగుల వెల్లువ నిండాలని
మంగళ వాద్యపు రాగం జీవితాల అనుపల్లవి గా నిలవాలని...

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

శత మానం భవతి శతయుహ్ పురుష శతేంద్రియ
ఆయుష్యే వేంద్రియే ప్రతితిష్తతి!

న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని:!
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్య భాసా సర్వ మిదం విభాతి!!

స్వయం ప్రకాశకమైన బ్రహ్మము వలననే ఈ స్రుస్టి
అంతా ప్రకాసిస్తోంది. అలాగే ప్రేమ వల్లనే ఈ జగత్తు
లో ధర్మం అనేది ఇంకా ఒంటి కాలిమీద నైనా నడుస్తోంది.

అలాంటి మీ ప్రేమ మయమైన మీ జీవితం మూడు పువ్వులు ఆరు
కాయలు గా భాసిల్లాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను.

ఇలాంటి వేడుకలు శతాధికంగా జరుపుకోవాలని "అమ్మలగన్న
యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ" ను వేడుకుంటున్నాను.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

శత మానం భవతి శతయుహ్ పురుష శతేంద్రియ
ఆయుష్యే వేంద్రియే ప్రతితిష్తతి!

న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని:!
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్య భాసా సర్వ మిదం విభాతి!!

స్వయం ప్రకాశకమైన బ్రహ్మము వలననే ఈ స్రుస్టి
అంతా ప్రకాసిస్తోంది. అలాగే ప్రేమ వల్లనే ఈ జగత్తు
లో ధర్మం అనేది ఇంకా ఒంటి కాలిమీద నైనా నడుస్తోంది.

అలాంటి మీ ప్రేమ మయమైన మీ జీవితం మూడు పువ్వులు ఆరు
కాయలు గా భాసిల్లాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను.

ఇలాంటి వేడుకలు శతాధికంగా జరుపుకోవాలని "అమ్మలగన్న
యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ" ను వేడుకుంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి