1 జులై, 2009

ప్ర్రతి ఓటమీ ఓ గెలుపుకి నాంది….

 

                                   DEPRESSION_by_optiknerve_gr

 

ప్రతి ఓటమీ ఓ గెలుపుకి నాంది పలుకుతుంది. ఒక్కొక్క ఓటమీ ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది.  జరిగిన పొరపాట్లూ తప్పిదాలూ మళ్ళి జరగకుండా ఉండేందుకు కావలసిన హెచ్చరికలు చేస్తుంది.ఓటమితో స్ఫూర్తిని పొంది జీవితానికి రాచబాటను ఏర్పరచుకునే వారు కొందరైతే ఓటమిని తలచుకుని క్రుంగిపోయి జీవితాన్ని ముగించుకునేవారు కొందరు. జీవితం పై ధీమాని , ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వలేని చదువులెన్ని చదివినా అవి  నిరర్థకమే. 

 

          విద్య అనేది వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న శక్తియుక్తులను వ్యక్తీకరించే దివ్యౌషథమని మహాత్ముడు ఏనాడో చెప్పాడు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత విద్యా విధానం విద్యా కూలీలను తయారు చేస్తోందనేది అందరికీ తెలిసిన సత్యం. అందుకు ఫలితమే రోజురోజుకీ పెరుగుతున్న ఆత్మహ త్యలు. బట్టీ చదువులు పిల్లల్లో  ఎంతవరకు  ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నాయనేది  కూడా ప్రశ్నార్థకమే.చదువు విజ్ఙ్ఞానాన్ని , వినోదాన్ని ఇస్తూనే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే లక్షణాన్ని అలవరర్చాలి.  సమస్యలకు పరిష్కారాన్ని చూపలేని చదువు చదువే కాదు. గెలుపులోని మాధుర్యాన్ని చవిచూడాలంటే అప్పుడప్పుడూ ఓటమి పంచే చేదు అనుభవాల్నీ చవిచూడక తప్పదు.

      జీవితం అనేది ఎవరికీ  వడ్డించిన విస్తరి కాదు.     

             మన కళ్లముందు విజేతలుగా కనిపిస్తున్న ఎందరో వ్యక్తులు ఎన్నో ఆటుపోటులకు ఎదురోడిన వారే. సమస్యలని చూసి భయపడకుండా వాటితో పోరాడి గెలిచిన వారే . 

’ప్రతి విజయానికి  వెనుక ఓ బాధాకరమైన గాథ   ఉంటుంది.ప్రతి బాధాకరమైన కథా ఓ అరుదైన విజయంతో అంతమవుతుంది.’ జీవితం అనుదిన పోరాటం అన్న సంగతి మనం మర్చిపోకూడని అంశం.

 

     ఓటమిని ఎలా ఎదుర్కోవాలి?

ఓటమి ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురుపడక తప్పదు.

  • క్లిష్తమైన సందర్భాలలో మనల్ని మనం నియంత్రించుకోలేము కాబట్టి సాధ్యమైనంత వరకు  ఒంటరిగా ఉండకుండా ఆప్తుల దగ్గర కొన్ని గంటలు గడపాలి.
  • తల్లిదండ్రులు,   తోడబుట్టిన వారితో వీలైనంత త్వరగా ప్రతి చిన్న ఆవేదనను పంచుకోవాలి.మన వ్యక్తిగత విషయాలు వీరితో పంచుకోవటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చె అవకాశం ఉండదు.
  • సమస్య కోణం నుంచి బయటికి వచ్చి చుట్టూ మనం అభిమానించే వారిని మన స్థానం లో ఊహించుకుని వాళ్లయితే ఎలా స్పందిస్తారో అంచనా వేసి దానిని బట్తి మనం చేయవలసిన పనిని నిర్థారించుకోవాలి.

 

     ఓటమి బాధను ఎలా దూరం చేసుకోవాలి?

  • ఓటమి పొందటానికి కారణాలు ఏమిటీ? ఎక్కడ లోపం జరిగిందీ బేరీజు వేసుకోవాలి.
  • జరిగిన దాన్ని గురించి ఆలోచించటం మాని జరగవలసిన కార్యాన్ని గురించి , చెయ్యవలసిన పనిని గురించి ప్రయత్నాలు చేయాలి.
  • మనకోసం ఎంతో సమయాన్ని వెచ్చించి మనకు ఊరటనివ్వాలని ఆరాట పడే వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినిపించుకోవాలి.
  • ముఖ్యంగా మనపై మనం నమ్మకాన్ని కోల్పోకూడదు.
  • కష్టాలు మనిషి సామర్థ్యాన్ని పెంచి, అతన్ని రాటుదేలుస్తాయన్న విషయం మరచి పోకూడదు.
  • మనసు కుదుటపడేవరకు ఇష్టమైన సంగీతాన్ని వినటం, ప్రశాంతమైన ప్రాంతాలలో గడపటం చెయ్యాలి.
  • మంచి పుస్తకాలు చదవటం ద్వారా  గొప్ప ప్రేరణని పొందవచ్చు.

   

పదే పదే  పర్సనాలిటీ డెవలప్మెంట్ (వ్యక్తిత్వనిర్మాణ) పుస్తకాలు చదవటం, కొటేషన్లు బట్టీ పట్టటం కంటే జీవితంలో గెలుపు-ఓటములు సహజమన్న విషయాన్ని గ్రహించి అందుకు తగ్గట్టుగా జీవితాన్ని మలచుకోవాలన్న సత్యాన్ని గ్రహించాలి.

ఎవరెస్ట్ ఎక్కాలంటే ఆక్సిజన్ కంటె ముందు కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది తోడుంటే ప్రపంచంలోని ఏ ఓటమీ మిమ్మల్ని ఎక్కువ కాలం విజయానికి చేరుకోకుండా అడ్డుకోలేదు.ఆశావాది సగం నిండిన పాత్రను చూస్తే నిరాశావాది కి అదే పాత్రలో సగం  ఖాళీ భాగం కనిపిస్తుంది . దృశ్యం లో ఎలాంటి మార్పూ లేదు.చూసే వారిలొనే ఆ తేడా ఉంది.

ఎంతో కష్టపడ్డా దానికి తగిన ప్రతిఫలం రాలేదు. ఇక నా వల్ల కాదు అనుకోవటం అస్సలు సరికాదు.మండుటెండలకి మాడుతున్న చిగురాకు కూడా ఓ వాన చినుకు కోసం ఆశగా ఎదురు చూస్తుంది.

ప్రతి మనిషీ  మనుగడ కోసం జరిపే   అనుదిన పోరాటంలో అతనికున్న , ఉండవలసిన ఆయుధం ఆశావాదం. అదిలేని నాడు అతని ప్రయాణం  సజావుగా సాగదు.

          ముఖ్యంగా పరిస్థితులకు అనుగుణం గా మనల్ని మనం ఎప్పటికప్పుడు మలచుకుంటూ ఉండాలి.”విచ్ కెనాట్ బీ క్యూర్డ్ మస్ట్ బీ ఎన్డ్యూర్డ్ “ అని ఆంగ్ల సూక్తి. నివారించలెని వాటిని భరించటం అలవాటు చేసుకోవాలి అని దీని అర్థం. వేసవిలో ఎండలు , వర్షాకాలంలో వానలు….. ఇలా ప్రకృతికి కూడా ఎన్నో విధులున్నాయి . కానీ ఒక్కొక్కసారి  కారణాలేవైనా ప్రకృతీ గతి తప్పుతుంది. ఎండా కాలంలో వానలు, వానా కాలంలో ఎండలు అప్పుడప్పుకు ఇందుకు ఉదాహరణలు. కానీ మనం ఏంచెయ్యగలం ? నిట్టూర్చటం   తప్ప? ఇంకా చెయ్యగలిగితే వాతావరణానికి అనుగుణం గా మన పనులను, మన జీవన విధానాన్ని మలచుకొంటూంటాం. గెలుపు ఓటములు కూడా అంతే.

  

             ’అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎంత గొప్ప భావన?

 

ప్రతి 

ఓటమి

వెనుకా

ఓ గెలుపు

 

చీకటి దాటితే ~

పగలు

------------------------------

               మనిషిగా పుట్టినందుకు తోటివారికి ఉపయోగపడాలన్న భావన  ప్రతి ఒక్కరికీ రావాలి. తల్లిదండ్రుల ఎన్నెన్నో కలల ఫలితం మన జీవితం. మన జీవిత కాలం  లో కనీసం ఒక్క జీవితాన్నైనా నిలబెట్టని వారికి వారి జీవితానికి చరమ గీతం పాడే అర్హత లేదు.

మన దేశంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం గవర్న మెంట్ ఉద్యోగం కోసం ఎగబడటం.

ఏళ్ళ తరబడి కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు పోసి మరి  సర్కారీ కొలువుకి ఎగబడతారు. ప్రయత్నించటంలో తప్పులేదు . కానీ  అవసరమైతే దానికి ప్రత్యామ్నాయానికి  కూడా సిద్ధపడి ఉండాలి.

సర్టిఫికేట్లలో , సర్కారు కొలువుల్లో భద్రత ఉందనుకోవద్దు. మీ నిజమైన ఆస్థి మీ తెలివితేటలు, మీనైపుణ్యాలు,మీ వ్యక్తిత్వం. వాటిని నమ్ముకోండి.

 

అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న మనం ఎలాగైనా బ్రతకవచ్చు. ప్రపంచంలో ఏ ఉద్యోగమూ శాశ్వతము కాదు.కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలనుకుంటే మన చుట్టూ ఉన్న ఎంతమంది ఆనందంగా ఉంటారు? ఉండగలరు?……. అధైర్య పడకండి. ….

            గతం , వర్తమానం మిమ్మల్ని చిన్నచూపు చూసినా భవిష్యత్తు మీకు అధ్బుతాల్ని అందించడానికి ఎదురుచూస్తుంది……….

          Wish you all the best………..!

                                         

ఏళ్లతరబడి శ్రమించి సత్ఫలితాలు పొందలేక అంతర్మథనంలో ఉన్న మితృల కోసం ………. (D.Sc.  results…. కొందరికి మిగిల్చిన బాధల నేపథ్యంలో…… )

3 వ్యాఖ్యలు:

పరిమళం చెప్పారు...

మంచి పోస్ట్ అని ఒక్క మాటతో వెళ్ళిపోవడానికి మనసు రాలేదండీ ....
కానీ అంతకంటే మాటలూ రావట్లేదు రాద్దామంటే .....
చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది .

BALA-JAYA చెప్పారు...

there is no words for comment to your blog any way exlent ఏళ్లతరబడి శ్రమించి సత్ఫలితాలు పొందలేక అంతర్మథనంలో ఉన్న మితృల కోసం ...........

BALA-JAYA చెప్పారు...

ఏళ్లతరబడి శ్రమించి సత్ఫలితాలు పొందలేక అంతర్మథనంలో ఉన్న మితృల కోసం
మనిషిగా పుట్టినందుకు తోటివారికి ఉపయోగపడాలన్న భావన ప్రతి ఒక్కరికీ రావాలి exlent there is no telugu words to comment your blog

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి