సున్నిత హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. అనుక్షణం తన ఉనికిని కాపాడుకోవటం ఓ సవాలుగా మారిందని
బెంబేలెత్తిపోతూ నేటి వనిత లోలోపలే క్రుంగిపోతోంది.
.
మానవమృగాలు విచ్చలవిడిగా సంచరిస్తున్న సభ్యసమాజంలో మహిళకి భద్రతలేదు. అతని ఆకలికి పసికందైనా , పడుచైనా, పండుముసలి అయినా బలికావాల్సిందే. ఆడ జన్మ ఎత్తటం మాత్రమే ఆమె చేసిన తప్పా?
గడపదాటితే చాలు తిరిగివచ్చేదాకా వెళ్ళిన ఉత్సాహంతో వస్తుందన్న నమ్మకం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న అంతర్మథనం అంతా ఇంతా కాదు. అరచేతుల్లో పెంచుకుని అత్తారుబత్తెంగా చూసుకున్న బిడ్డ ఎప్పుడు ఎటువంటి ఉచ్చులో పడిపోతుందో , ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో అని ప్రతక్షణం భయంతో బ్రతకాల్సిందే.
మన విద్య మనకు ఎన్నో కొత్త ఆవిష్కరణలు తెచ్చి పెడుతోంది. కానీ ఎంత విఙ్ఞానం పెరిగినా మానవత్వపు మూలాలు మరచిపోతూ మన ప్రవర్తన దిగజారిపోతోంది.
ప్రేమించమని వేధించి చంపేవాడు ఒకడు, ప్రేమ పేరుతో వంచించి చంపేవాడు ఒకడు. ప్రాణాన్ని నీటిలో నానిపోయే నోట్ల కట్టలతో తూచి కర్కశంగా వసివాడని మొగ్గల్ని తుంచే కిరాతకుడు మరొకడు.
ఇంతమంది మనుషుల మధ్య ఉండీ కూడా నిత్యమూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక కుసుమం నేల రాలిపోతోంటే చూస్తూ ఉండి పోవటం తప్ప ఏమో చేయలేక పోతున్నాం. మనతో పాటే బ్రతుకుతున్న సాటి వ్యక్తిని కాపాడుకోలేక పోతున్నాం.
వందల కొద్దీ జనసమ్మర్ధం ఉండె ఓ కళాశాలలో కి ఆగంతకుడు కత్తితో దర్జాగా ప్రవేశిస్తుంటే ఆ కళాశాల కి ప్రహరీ గోడలెందుకు? అంతమంది విద్యార్థుల మధ్య ఒక్కడు చొరబడి ఓ అమ్మాయిని తెగ నరుకుతుంటె మిగిలిన వారు సిత్రాలు చూస్తున్నారా? ఎదురు పడితే ఏమవుతుందో నన్న భయం మనల్ని చేతకాని వాళ్ళని చేస్తుంది.
ప్రియతమ నాయకులు సినిమాలలో రౌడీలని పదిహేను మందిని చితకబాదితే వెర్రి కేకలు వేసి ఆ హీరోయిజానికి జోహార్లర్పిస్తున్న యువశక్తి ఒక్కడిని ఆపలేదా? వందమంది కలిసి ఒక్కడిని ఆపటం ఏమంత కష్టమైన పని?
కళాశాల యాజమాన్యానికి సమయానికి ఫీజులు కట్తించుకోవటం తెలుసుకాని పిల్లలకి రక్షణ కల్పించవలసిన బాధ్యత లేదా? పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లయితే మరి పరీక్షలు రాస్తున్న పిల్లలు ఎందుకు కళ్ళముందే ముక్కలౌతున్నారు?
తెల్లవారితే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తొందొనని భయపడని వారే లెరు ఈ రోజుల్లో. అందరి మనసులు దురాగతాలను చూస్తూ … నిలువునా రగిలిపోతున్నాయి. ఎవరిని కదిపినా ఆవెదన వెల్లువై ప్రవహిస్తోంది. చూడటానికి అంతా మామూలుగా నే ఉన్నా ప్రతి నలుగురు కలిసిన చోటా భవిష్యత్తు ను గురించిన ప్రశ్నలే.
ఎన్నాళ్ళిలా మళ్ళీ మళ్ళి ఎదురవుతున్న దారుణాల్ని భరించటం అంటూ స్త్రీలు సమాజాన్ని ప్రశ్నించే రోజు తప్పక వస్తుంది. అప్పుడు ఇన్నాళ్ళూ చేసిన అలక్ష్యానికి సమాజం మొత్తం మూల్యం చెల్లించుకోకతప్పదు.
కళాశాలల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు:
దాదాపు అన్ని మహిళా కళాశాలల్లో ప్రస్తుత దుర్ఘటనల నేపథ్యంలో ఆడపిల్లల స్వయం రక్షణ పై ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. అపరిచితులతో ప్రవర్తించాల్సిన తీరు తెన్నులు వివరిస్తూ, ఎంత తెలిసిన వారైనా సరే నమ్మరాదంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
కిట్టీ పార్టీల్లో మహిళల చర్చలు:
మహిళలందరు కలిసి సరదాగా తమ అభిరుచులను , అలవాట్లను పంచుకునే కిట్టి పార్టీలు సైతం ప్రస్తుతం మహిళల రక్షణ పై తలెత్తుతున్న ఆటంకాలపై నిశితంగా చర్చిస్తూ , అభిప్రాయ వేదికలు గా మారుతున్నాయి.
బ్లాగుల్లో ఆడవారిపై జరుగుతున్న దౌర్జన్యాలపై తిరుగుబాటు:
మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తూ , అనుక్షణం ఎందరినో కలుపుతున్న బ్లాగులు సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసపై, దౌర్జన్యంపై సమరశంఖాన్ని పూరిస్తున్నాయి.
మహిళా బ్లాగర్ల ఆవేదనకు మద్దతుగా ఎందరో మగవారుకూడా సానుకూలంగా స్పందిస్తూ తమ తోడ్పాటునందిస్తున్నారు. దేశం కాని దేశం లో ఉంటున్నా సరే తమ దేశంలో సాటి మహిళలపై జరుగుతున్న దౌర్జన్యానికి విదేశాలలో వృత్తి రీత్యా నివాసముంటున్న మహిళా బ్లాగర్లు తమ బ్లాగుల్లో ఆవేదనను వెలిబుచ్చుతూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న గృహిణి సుభద్ర కనుమూరి వాలు కొవ్వరి చెట్తు బ్లాగు ఇందుకు చక్కని ఉదాహరణ:
http://vaalukobbarichettu9.blogspot.com
ప్రమదావనం:
మామూలు మహిళా సంఘాలకి భిన్నంగా ఇంటర్నెట్లో బ్లాగర్లు, ఔత్సాహిక మహిళలు కలిసి కొన్ని సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసుకున్న వేదిక ప్రమదావనం. వివిధ వృత్తుల వారు , గృహిణులు ఇంటర్నెట్ ద్వారా నిత్యమూ పలకరించుకుంటూ వారి బావాలను పంచుకుంటుంటారు. అమెరికా నుండి అమలా పురం దాకా , మస్కట్ నుండి మచిలీ పట్నం దాకా ఎక్కడి వారైనా సరే మహిళలు ఇందులో చేరి వివిధ అంశాలపై చర్చిస్తూ ఉంటారు.
ఈ మధ్య కాలంలో ఆడవారిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రమదావనంలో మహిళ లు తమదైన శైలిలో సునిశితంగా చర్చిస్తూనే ఉన్నారు. అసలు సమస్య ఎందుకు వస్తోంది, ఎవరు కారణం అన్న కోణం నుంచి తగిన పరిష్కారాలను సూచించటం జరుగుతొంది.
ఇంటర్నెట్ లో ప్రమదావనం చిరునామా:
http://groups.google.com/group/pramadavanam/
జరుగున్న దుర్ఘటనలను యువతులు పరిశీలిస్తూనే ఉన్నా ఎవరికి వారు సమస్య తీవ్రతను ఇంకా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అమ్మాయిలూ.. జాగ్రత్త పడండి:
1.ఎంత పరిచయస్తులైనా సరే ఎవరినీ పూర్తిగా విశ్వసించకండి.
2.ప్రతి క్షణం ఆపద పొంచి ఉంటుందన్న దృష్టితో ముందు చూపుతో వ్యవహరించండి.
3 ఒంటరిగా ఎక్కడికీ , ఎవరితోనూ వెళ్లటం శ్రేయస్కరం కాదు.
4.సెల్ ఫోన్ ని అత్యవసరంలో ఉపయోగపడేలా బాలెన్స్ కి మెయిన్ టైన్ చెయ్యండి
5.ముందు జాగ్రత్తగా ఎప్పుడు మీ పర్సులలో ఓ రీఛార్జ్ కార్డు , కొంత డబ్బు అదనం గా అట్టే పెట్టుకోండి.
6.ఫోన్లో కూడా మీకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అందుబాటులో ఉండె మీ మితృలు, కుటుంబ సభ్యుల నంబర్లను స్పీడ్ డయల్ లిస్ట్‌లో చేర్చుకోండి.
7.మంచైనా చెడైనా తల్ల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికీ కదలకండి. మీకు ప్రపంచంలో అత్యంత సన్నిహితులు మీతల్లిదండ్రులు మాత్రమే అన్న సంగతి ని గుర్తించండి.
8.ఎంతో జీవితాన్ని చూసిన పెద్దల మాటల్ని పెడచెవిని పెట్టటం వల్ల నష్టపోయేది మీరేనని గ్రహించండి.
9.అమ్మానాన్నలు అన్నదమ్ములు మీరెక్కడున్నారని అడిగితే తప్పైనా ఒప్పైనా నిజం చెప్పి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
10.మీ స్వేచ్చ ఇతరులు హరిస్తున్నారన్న దురభిప్ర్రాయన్ని మొగ్గలోనే త్రుంచండి.
11. తప్పు చేయటం మానవ సహజం. తెలియక చేసిన తప్పులు చిన్నవైనా , పెద్దవైనా నిర్భయంగా ఇంట్లో చెప్పి సరిదిద్దుకోండి. ఒక తప్పు ని కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తే వరుస తప్పులు మీ పాలిత శాపాలవుతాయని తెలుసుకోండి.
12. ఎవరికి పడితే వాళ్లకి మీ ఫోన్ నంబరు ఇవ్వకండి.
13.సరదా కోసం ఆటపట్టించటం కోసం అబ్బాయిల కు ఫోన్లు చెయ్యటం కోరి కష్టాలను తెచ్చుకోవడమే అవుతుంది.
14. స్నేహితులతో సరదా గా కట్టే పందాలు ఎప్పుడో ఒకప్పుడు మీపై ప్రతికార జ్వాలలౌతాయన్న సంగతి తెలుసుకోండి.
15. ఆధునికతను ఇష్టపడటం మోడ్రన్ గా కనిపించాలనుకోవటం తప్పుకాదు.కానీ మీ వస్త్ర ధారణ చూసే వారిలో ఎటువంటి అభిప్రాయాలను కల్పిసుందో ఆలోచించండి.
2 కామెంట్లు:
మీరు కళాశాలలను తిట్టడం ఏమి బాగోలేదు. ఆగంతకుడు ఏమి నా దగ్గర కత్తి ఉంది అని అందరికి చూపిస్తూ రాడు కదండీ. ఇట్లాంటి వారిని ఆపాలంటే ఎప్పటికి అప్పుడు అందరిని తనిఖీ చేయాలి. ఇది ఎంత కష్టమో ఒక సారి ఆలోచించండి. ఒక వేళ చేయగలిగినా, ప్రతి రోజు తనిఖీ చేయడానికి మనం ఒప్పుకుంటామా? కాబట్టి మనుషులు అసలు అలా ఎందుకు తయారు అవుతున్నారో ఆలోచించాలి. వాళ్ళలో మార్పు తేవడానికి కృషి చేయాలి. నేను అనుకున్నది చెప్పాను. తప్పు అయితే క్షమించగలరు.
కళాశాలని నెను తిట్టలేదండీ.
నాకు ఏ కళాశాలపైనా కోపం లేదు.
పరీక్ష హాలుల్లోకి కత్తులతో చొరబడినా ఏమీ చెయ్యలేకపోతే ఎలా చెప్పండి?
మీ అభిప్రాయాన్ని నిర్మిహమాటం గా వెలిబుచ్చాలి. ఇందులో తప్పొప్పుల ప్రశక్తి ఏమిటండీ.
పిల్లల కేరేజీలు తీసుకెళ్ళీనపుడు, స్టడీ అవర్ల నుండి పర్మిషన్ అడిగినపుడు కళాశాల లు తల్లిదండ్రుల్ని లోనికి ప్రవేశించకుండా అడ్డుకుని , గంటల తరబడి వేచి ఉంచుతుంది.అదే రకమైన భద్రత అయినా ( కనీసం ) చూపాలి కదా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి