3 ఆగ, 2013

రోడ్డు పై కాగితం ముక్క

ఇంత మండుటెండల్లో ఒంటిపై
అతుకుల బిళ్ళలే'సిన
ఆ కంబళెందుకో  ?
ఎవరికీ లేని చలితో ఒంటరి పోరాటమా?
చలిచాటున
కండలు కరిగింగించే ఆకలిని
దాచుకోవటమా ?
లోలోపలి వెతల్ని, తన్నుకొచ్చే వేదనల్ని
అణచుకుంటున్నట్లు
ఆ మేకపోతు గాంభీర్యమేమిటో?

దుమ్ము పట్టిన దేహం
తెగ మాసిన తల
చూపుల్లో వైరాగ్యం
వెరసి, సాఢువుగా
పరిత్యాగిగా
తన్ను తాను దర్శించుకుంటున్నాడా?
ఆశ నిరాశలకి అతీతుడయ్యాడా?
ఆకలిని జయించి అమరుడయ్యాడా?
నిలువునా నిండిన ముసుగులోంచి
భారంగా కదిలే జత పాదాలు
ఇక తప్పదన్నట్టు
ముందుకు కదులుతుంటే
నీవెంటే నేనంటూ
అతని కాలికంటిన దుమ్ము

పెద్దోళ్ళని తాకి అపవిత్రం చెయ్యకుండా
అతను నడిచిన బాటను
శ్రద్ధగా శుభ్రం చేస్తున్న
కంబలి కొనను
ఏమాత్రం లక్ష్య పెట్టకుండా
గమ్యమెరుగని పయనంలో
గాలివాటున ఎగిరే
కాగితం ముక్కలా
అతను సాగిపోతున్నాడు.....
మండుటెండలో
వెచ్చదనాన్ని పెంచే
నల్ల కంవళిని కావళించు కుంటూ.........
కబళించిన దారిద్రయాన్ని ప్రేమించుకుంటూ....

                                                        --- Padmakala

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి