Pages

5 అక్టో, 2008

౧౦౮ కథలు-

చిటికెటంత పనిచేసి చప్పట్ల కోసం ఎదురుచూస్తున్న మనుషులున్న కాలం ఇది. ప్రతి రోజూ సేవల పేరు మీదో ,పరోపకారం ముసుగులోనో స్వామికార్యం ,స్వకార్యం అన్నట్లుగా చిన్న చిన్న పనులు చేసి వాటిని ఘనకార్యాలుగా ముస్తాబు చేసి వాళ్ళ కీర్తి కిరీటాలలో ఆ మణుల్ని చేర్చుకొని మురిసి పోతూ ఉంటారు.

నిజానికి అలాంటి వాళ్ళు చేసిన ఘనకార్యాలు మహత్కార్యాలు మాత్రం కావని వాళ్ళతో పాటు మనకీ తెలుసు. కానీ మనకి తెలిసో తెలియకో లేక తప్పకో వారిని మునగ చెట్టు ఎక్కించి ఆహా!ఓహో ! అంటాం.వాళ్ళ దాకా ఎందుకు ? ఎదుటివాళ్ళ మెచ్చుకోలు కోసం ప్రతీ క్షణం ఆరాటపడేవాళ్ళు మనలో కూడా చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో!

కానీ ప్రశంసలకీ,ప్రయోజనాలకి దూరంగా ఉంటూ విధి నిర్వహణే ప్రాణంగా వారి వ్యక్తిగత జీవితాన్ని సైతం మానవత్వానికే ధార పోస్తున్న వారు నూట ఎనిమిది సిబ్బంది.(౧౦౮) పగలు-రాత్రి,ఎండ-వాన ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పిలుపు కే పలికి,పరుగులు తీస్తూ వచ్చి, "మీ కోసం మేమున్నామంటూ ఆఘమేఘాల మీద చేరుకొని,ప్రాణాలను నిలబెట్టే సైన్యం ౧౦౮.

దేవుడిచ్చిన ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టడం కోసం వీరు పడే తపన ,ఆవేదన చూస్తే ఆ దేవుడు కూడా శిరసు వంచి సలాం కొట్టాల్సిందే.

ఆ పత్కాలంలో ఆదుకున్న వీరిలోనే దేవుణ్ణి చూసుకుంటారు ప్రాణ భిక్ష పొందిన వాళ్ళు.వీరు మాత్రమ్ బాధితుల ఊరట చూసి "హమ్మయ్య ! ఓ ప్రాణం నిలబెట్టగలిగాం" అనుకుంటూ ఊపిరి పీల్చుకుని, ఓ చిరునవ్వు చిందిస్తారు.

వీరి సేవలకి మనకి తెలిసిన ఉన్న అవార్డులు చాలవు.నిత్యమూ వేలాది ప్రాణాలు వీరి చేతిలో పునర్జన్మ పొందుతున్నాయి. సమాజం కోసం వీరింత శ్రమిస్తూ సేవ చేస్తున్నపుడు కృతజ్నత చెప్పాల్సిన కనీస ధర్మం మనకి ఉంది కదా!

దాదాపు నాలుగు నెలల పాటు నూట ఎనిమిది సేవల విధానాలు, సిబ్బంది పనితీరు గమనించి , వారి అనుభవాలు, ఇబ్బందులు తెలుసుకొని, లబ్ధిదారులు కొందరిని ప్రత్యక్షంగా కలిసి, వారి అభిప్రాయాలు పంచుకొన్న తరువాత వారిపై , వారి సేవా నిరతి పై నాకు కలిగిన అచంచల మైన గౌరవ భావాన్ని, మీతో పంచుకోవాలనిపించింది.

అందుకే ఆ లక్ష్యంతోనే వారు నిలబెట్టిన ప్రాణాల కథలకి అక్షర రూపం తెచ్చి, అందరి హౄదయాలలోనూ ఆ రూపాలకి చోటు కల్పించాలని చేసే చిరు ప్రయత్నమే ఈ

నూట ఎనిమిది కథలు............ఇవి ముమ్మాటికీ నిజాలు.

(pl..గో to next పోస్ట్........)

7 కామెంట్‌లు:

Rajesh చెప్పారు...

నిజంగా 108 అంబులెన్సు వారు ఇంత మంచి పనులు చేస్తున్నారని నాకు తెలియదు. వారి పని తీరుకు, సేవాభావానికి హేట్స్-ఆఫ్. నేను ఇంత వరకు సినిమాలో చూపించినట్టు, గవర్నమెంటు ఆసుపత్రులు వలే అంబులెన్సు కూడా పైసలకే పని చేస్తుందనుకున్నాను. వారి సేవకు ఇదే నా జోహార్లు. తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

నాకు తెలిసి మీరే మొదటి వారనుకుంటాను. చించండి.. వారి సేవా భావానికి జేజేలు.. ఇలా సేవ చేసే వారిని అనునిత్యం వారిని వారి కుటుంబాలని ఆ దేవ దేవుడు కాపాడుతూనే ఉంటాడు

కొత్త పాళీ చెప్పారు...

నాకు సరిగ్గా అర్ధం కాలేదు .. ఈ 108 కథల్ని పుస్తకంగా ప్రచురించారా, ప్రచురించ బోతున్నారా, లేక ఇక్కడ బ్లాగులో ప్రచురించ బోతున్నారా?

ఏదేమైనా, అత్యవసర వైద్య సేవ అందడం మెచ్చుకోవలసిన విషయం.

మీకొక విన్నపం. దయచేసి ఒక పోస్టుని ఒక రంగు అక్షరాల్లోనే రాయండి. పంచవన్నెలు విరజిమ్మితే చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంది.

తెలుగుకళ చెప్పారు...

౧౦౮.(108)emri emergency services వారు నిరంతరం నిర్విరామంగా అందిస్తున్న సేవల ను గురించి ఒక రేడియో జాకీగా ప్రజల కు తెలియజేయాలని వారిని సంప్రదించడం ,ఇంటర్వ్యూ తీసుకోవటం జరిగింది.ఆ తరువాత ఒక పత్రికా విలేఖరి గా వారి ఒక top story (సాక్షిలో) రాయటం కోసం మళ్ళీ వాళ్ళను కలిసాను.
ఒక వర్ధమాన కవయిత్రిగా ప్రేరణ పొంది,కొన్ని కవితలు రాశాను.
ఇక కథల విషయానికొస్తే 108 ఆదుకున్న లబ్ధిదారులని ఒక రోజు పత్రిక ఇంటార్వూ కోసం వెళ్ళినపుడు వారి అనుభవాలు,క్రుతజ్నత చూసి కథలుగా రాయాలని మొదలు పెట్టాను.
పరిచయం ,ఉద్దేశ్యం వరకు ఇచ్చాను.ఇకపై కథ మొదలు పెట్టాలి.ఒకటి సిద్ధంగా ఉంది.ఈరోజే పూర్తి చేస్తాను.మిగిలినవి వీలు వెంబడి.....ప్రయత్నిస్తాను.
మీ వ్యాఖ్యలకు ,సూచనలకు ధన్యవాదాలు.తరచూ ఈ కొత్త బంగారు లోకాన్ని సందర్శిస్తూ ఇలాగే సూచనలిస్తుంటారని ఆశిస్తాను........పద్మకళ.

Bolloju Baba చెప్పారు...

చాలా గొప్ప ఆలోచన. కృషికి అభినందనలు.
108 సేవలు అనన్యమైనవి.

ఇక్కడ వారు చేసేపని ప్రాణాలను నిలబెట్టటం కనుక, వారి పట్ల మనం ప్రదర్శించాల్సిన సెంటిమెంటు అత్యంత నిజాయితీతో కూడినదై ఉంటుంది. ఉండాలి కూడా. ఇందులో ఏ మాత్రం సందేహానికి తావులేదు.

నాకు తెలిసి ఒక 108 వాహనం బాధితులను ఆదుకోవాలని వేగంగావెళుతూ అన్నవరం సమీపంలో ఆక్సిడెంటుకు గురై మరో 108 బస్సుద్వారా రక్షింపబడటం అత్యంత బాధాకరం. దీని ద్వారా ఈ సిబ్బంది బాధితులను కాపాడటానికి ఏ విధంగా శ్రమిస్తున్నారు/ఏస్థాయిలో రిస్క్ తీసుకుంటున్నారు అనే విషయం అర్ధం చేసుకొనవచ్చును.

108 అనే పేరుతో చానాళ్ళ క్రితం ఒక కవిత మొదలెట్టాను. ఇంకా అసంపూర్ణం గానే ఉంది. మీరిచ్చిన ఈ ప్రేరణతో పూర్తిచెయ్యగలననుకుంటున్నాను.

కొత్త పాళీ గారి రంగుల సలహా వీలైతే పాటించండి.

బొల్లోజు బాబా

తెలుగుకళ చెప్పారు...

నమస్కారం! బాబా గారూ !
నా ఆలోచనకి మీ అందరి ప్రోత్సాహం తోడై నాకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది.
అందరి సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తాను.
.క్రమం తప్పకుండా దయచేసి మరిన్ని సూచనలతో నా కొత్త బంగారు లోకానికి మంచి బాట వేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

ambulence ku salam cheyalani pinchindi ane mata adbutam

కామెంట్‌ను పోస్ట్ చేయండి