శ్రీ వైభవ లక్ష్మీ అవతారం
పసిడి కాంతుల పాలవెల్లి, కరుణించి కాపాడే బంగారు తల్లి ,చల్లని చూపుల జాబిల్లి అమ్మలగన్నయమ్మ విజయవాడ కనక దుర్గమ్మ శరన్నవరాతృల సందడిలో ఆనందతాండవమాడింది. నేల ఈనినట్లు సుదూరతీరాలనుండి అశేష భక్తజనులు తరలి వచ్చి గంటలకొద్దీ బారులు తీరి, వేచి వేచి ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా దర్శించి తరించారు.
కోరిన కోర్కెలు తీర్చే ఆ తల్లికి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
కనక దుర్గమ్మ
పొంగిపొరలే భక్తి ప్రవాహాన్ని, భక్తజన సందోహాన్ని ఏమాత్రం నిరాశపెట్టకుండా రోజంతా ఆ జగదాంబ చెదరని చిరునవ్వుతో అందరినీ పలకరించింది. తన భక్తుల కోసం నవరాతృలూ నిద్ర లేకుండా గడిపింది.
రోజు రోజుకీ కొత్త కొత్త అలంకారాలు, వేలాది మంది భక్తులు సమర్పించుకొన్న పూలమాలలు, రత్న, మాణిక్య , వజ్ర, వైఢూర్యాది ఆభరణాలతో కన్నులపండువ చేసి ఆమె మాత్రం ఆ భారం మోసి మోసి అలసిపోయింది. ఇంతా చూస్తున్న ఆమె నెచ్చెలి కృష్ణమ్మ ఉండబట్టలేక పోయింది.కొండపై నున్న ఆ మహారాణిని ఈ అలివేణి కృష్ణవేణి చేతులు చాచి సాదరంగా తన ముంగిట్లోకి ఆహ్వానించింది.
ఈయమ్మ ఆహ్వానాన్ని మన్నించి ఆయమ్మ రాజరాజేశ్వరిగా రాజసంతో సకలపరివారంతో భక్తజనావళి జేజేల మధ్య కొండదిగి వచ్చింది. కృష్ణవేణీ జలాలతో జలకాలాడి కృష్ణా తరంగాలపై స్వైరవిహారం చేసింది.
ఎప్పుడూ తనను చూడడానికి తరలి వచ్చే వేలాదిమంది భక్తుల ముందుకు వచ్చి నగరంలో పర్యటించి, నదీతీరంలో సేదతీరింది.
కృష్ణా నదిపై జలవిహారం చేస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ
అసంఖ్యాకమైన ప్రజానీకం ఆ అంబ జలవిహారాన్ని కన్నులారా చూడాలని తరలి వచ్చింది. అయినా ఎక్కడా సడి లేదు.కృష్ణాతరంగాల సవ్వడులు తప్ప.ఆ సన్నివేశపు శోభ అత్యధ్భుతం.అందరి కళ్ళూ రెప్పవాల్చకుండా హంస వాహనంపై బంగారు సింహాసనంపై విరాజితురాలై మందహాసం చేస్తున్న ఆ తల్లి ముఖబింబం పైనే.
హంస వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సమేత దుర్గాభవాని అమ్మవారు
హంస గమన గజగమన, మందగమన గా పేరుగన్న అమ్మవారి నడకలు హంసను అధిరోహించడంలోని ఆంతర్యం లోకక్షేమం కోసం హింసను జయించి దుష్ట శిక్షణ ద్వారా శాంతిని నెలకొల్పి అహింసా తత్వాన్ని బోధించడమే అంటూ అర్చకస్వాములవారిఅమృతవాక్కులు ఇంద్రకీలాద్రి ప్రాంతం ,కృష్ణాతీరమంతా మారుమ్రోగిపోయాయి.
హంస వాహనంపై విహరిస్తున్న హంసగమన హరుని మనోహరి
విశ్వశ్రేయస్సుకై చెడును అంతం చేసే మహంకాళికి మహిషాసురమర్దినంలో కలిగిన క్రోథాన్ని కృష్ణమ్మ తన చల్లని జలాలాతో చల్లార్చింది. ఇష్టకామేశ్వరిగా కోరిన కోర్కెలు ఈడేర్చే ఆ తల్లి భవాని మాలధారుల దీక్ష,దక్షతలను చూసి పులకించి పోయింది. ఎటుచూసినా ఎర్రదనం ధైర్యానికి ,సౌభాగ్యానికి ప్రతీకగా దర్శనమిచ్చింది.
108 శక్తి క్షేత్రాలలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ క్షేత్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యతీర్థంలో కృష్ణమ్మ ఆతిథ్యం స్వీకరించి ఆమె ఒడిలో సేద తీరుతూ అన్నపూర్ణమ్మ అడిగింది ఇలాగే నిత్యమూ పరవళ్ళుతొక్కుతూ నిండుగా ప్రవహిస్తూ బిడ్డలకి ఆకలి బాధ లేకుండా చేయమనీ అనునిత్యం ప్రాణదానం చేయమనీ. అందుకు కృష్ణమ్మ సరేనంది.
’కృష్ణా జలాలు అమృతప్రాయంగా పారి, విస్తారంగా పంటలు పండాలి. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. ఏ పొరపొచ్చాలు లేకుండా ఉత్సవాల పేరిట తన దర్శనానికి వచ్చి సంఘటితం కావాలి. పేదా గొప్పా భేదాలు మరచి తన నట్టింట్లో సహ పంక్తి భోజనాలు చేయాలి.’ ఏడాదిపాటు ఎడబాటులో ఉన్న ఆ నారీ మణులు ఇలా ఓ గంటపాటు ముచ్చట్లాడుకున్నారు.కృష్ణమ్మ ,దుర్గమ్మ చెట్టపట్టాలేసుకుని ఆడిపాడి పరవశించారు.
వెంటపడుతున్న ప్రజాప్రతినిధులు ,ప్రముఖులు,మీడియా వారి నుండి తప్పించుకుంటూ హంస తన గమనాన్ని, వేగాన్ని మారుస్తూనే ఉంది.అయినా వాళ్లు వదల్లేదు. మళ్ళీ ఆ అవకాశం రావాలంటే ఇంకో వసంతం దాటాలికదా! అందుకే వెంటపడ్తూనే ఉన్నారు. ఆ అధ్భుత దృశ్యాలని ఆగిపోయినవారి కోసం వివిధ కారణాల వల్ల అక్కడికి చేరుకోలేక పోయిన వారికోసం
తమ కెమెరాలలో బంధిస్తూనే ఉన్నారు.
4 కామెంట్లు:
very nice
Padama ji,
Please give a comment/ situation/location of each photo. That will be impressive.
last two photos are resembling "Kolakata Kali" style Pandals. Is it really held in our Vijayawada? Or you got some photos of Kali Pandals?
The first photo one is very impressive. Thanx for gathering.
Its excellent and very nice to see and go through the articles.
Please keep writing.
Sanju & Srinivas
కామెంట్‌ను పోస్ట్ చేయండి