Pages

23 నవం, 2009

అవకాశవాద ప్రపంచం

ఇది పనిదొంగల ప్రపంచం. పనిచేసేవారికన్నా చేసామనిపించుకునేవారే పనిమంతులుగా చలామణీ అవుతున్నారు. ప్రతి పని చుట్టూ ఎన్ని సంకెళ్ళో .. పని చేసేందుకు  పడే కష్టం కంటే చేసిన పనిని ఏ మచ్చా లేకుండా ప్రదర్శించుకునేందుకు పడే కష్టం చాలా  ఎక్కువ. ఆ పని ఫలితం పదిమందికీ అందించేందుకు పడరాని పాట్లూ పడాల్సిరావటం ఇంకా పెద్ద సమస్య.

ఎవరికి వారు తమతప్పుల్ని సర్దిపుచ్చుకునేందుకు ఉన్న అన్ని రకాల మార్గాల్ని ఆయుధాగారాలుగా , ఇంకా చెప్పాలంటే రక్షణ కవచాలుగా మలచుకుంటున్న తీరు వర్ణనాతీతం.

దేశమెందుకు బాగుపడటం లేదు రా అని మేథావులందరు కలసి ఒకరోజు ఒకచోట చేరి చర్చించి ఒక తీర్మానాన్ని చేశారట. అదేమిటంటే అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో లాగా కాకుండా మన దేశంలో తరతరాలుగా ఒక సంప్రదాయం ఉందిట. ఇక్కడి వారు పనిచెయ్యని వాడితో పనిచెయ్యించరు కానీ నిజంగా పనిచేశ్తున్న వాడిని మాత్రం ప్రశాంతంగా పనిచెయ్యనివ్వరట.

నిజమే మరి. ఇది ప్రస్తుత సమాజంలో ప్రతి చోటా మనం చూస్తున్నదే.గత కాలంలో పండిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా  మనం ఆ సామెతని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా ఆ సామెత ఇప్పట్లో అవసరం ఉండదమో.. ఎందుకంటే మనం ఏ చెట్టుని సహజంగా ఎదగనిస్తున్నాం కనక?  మరి ఎదగ కుండా మనం తింటున్న పళ్ళెక్కడివంటారా? ఆ బదులూ నా దగ్గర లేకపోలేదు సుమా !… మనం తినే పళ్లన్నీ అన్ సీజన్ వీ , ఆఫ్ ద సీజన్ వీనూ .. కాదంటారా?

నూటికి తొంభైశాతం మందులు (…… ఇక్కడ వర్తించే పదాలు మీరే పెట్తుకోవాలిమరి)  తో ఎదిగినవి, మనం కావాలనుకున్నట్టుగా సంకర  లక్షణాలతో తయారు చేసుకున్నవే  కదా.

కాబట్టి మన స్వార్థం కోసం తెలిసి తెలిసి ఏ చెట్టునీ పచ్చగా ఎదగ నిచ్చే ఔదార్యమైతే నిజానికి మనలో చాలా మందికి లేదనేది మీకూ తెలుసు. మరి పచ్చని చెట్లు సహజంగా ఎదిగే పరిస్థితి లేనప్పుడు, అవి ఆహ్లాదకరమైన వాతావరణంలో పుష్పించలేనపుడు.. ఇక ఫలాలెక్కడివి?

                 కానీ ఏమున్నా లేకపోయినా చెట్టుకు మాత్రం రాళ్ళదెబ్బలు తప్పవు.. ఇన్నినోళ్ల మధ్య నోరులేని చెట్టు ఆ దెబ్బల్ని మౌనంగా భరిస్తూ భానుడి ప్రతాపాన్ని తన కొమ్మల చాటున బంధించలేనని తెలిసి కూడా   తాను బ్రతికి ఉన్నంత కాలం జనానికి నీడనివ్వాలనే ఆరాటపడుతుంది.  కానీ పిచ్చి చెట్టు కి తెలియదు నీడనిస్తాను మొర్రో అంటూ మొత్తుకుంటున్నా మనిషి చుట్టూ గొడ్డళ్లతో కాచుక్కూచున్నాడనీ, ఏదో ఒక క్షణం గొడ్డళ్ళ వేటు తప్పదనీ . అయినా తన సహజత్వంపై  ఒకే ఒక్క నమ్మకం. ఏదో ఒక రోజు  చెట్టు విలువ ప్రపంచానికి తెలియకపోతుందా? అని.

ఇప్పటికే తెలిసినా తెలియకున్నా ప్రతి ఒక్కరూ  తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటుంది.

ఏ పరిస్థితుల్లోనైనా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనిపించినా , అలా చెయ్యాల్సిన పరిస్థితి తలెత్తినా అందుకు  ఆ తప్పుల్ని ఇతరుల పై నెట్టాల్సిన పనిలేదు. చెయ్యని తప్పుకి ఇతరులను బాధ్యులను చెయ్యటం సరికాదు.

వెయ్యిమంది దోషులు వదిలివెయ్యబడ్డా ప్రపంచానికి నష్టం లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని పూజ్య బాపూ ఎప్పుడో చెప్పారు. పనిచెయ్యని వారిని, బద్ధకస్తులని , మొక్కుబడిగా పనులు చేసే వారిని ఎంత పొగిడినా ఎలాంటి నష్టమూ ఉండదు. ఏదో ఒక రోజు ఆ పొగడ్తలే అతన్ని దారిలో పెడతాయి. ఏమీ చెయ్యకుండానే ఇంత ఆదరిస్తుంటే బాగా చేశ్తే ఎంత ఆదరిస్తారో అన్న ఆశతో అతను ఎప్పుడో ఒకప్పుడు మారతాడు.

కానీ పద్ధతిగా పనిచేసే వాళ్లని , పని లో ప్రపంచాన్ని చూసేవారిని చేసే  ఒక్క అవమానం అయినా సరే జీవితాంతం అతను చేసే ప్రతి పనిలోనూ గొంతులో ముల్లు గా మారి బాధపెడుతూనే ఉంటుంది. ఫలితం అతను ఏ పనీ మునుపటి లా చేసే సమర్థత కోల్పోతాడు. సమర్థులు మన చుట్టూ ఉంటారు. వారి సమర్థత ని గుర్తించకుండా వారిని అనుక్షణం తేలిక పాటి మాటలతో తీసిపారేస్తే ఆ నష్టం పూరించలేనిది.

సమకాలీన సమాజం ఏ వ్యక్తి గొప్పదనాన్నీ గుర్తించకపోయినా కాలం మాత్రం తన గుండెల్లో వారి ప్రతిమల్ని భద్రపరచుకుంటూనే ఉంటుంది.ఆ  ప్రతిమలను కొందరు  ఆయా వ్యక్తులున్నపుడే గుర్తించి, గౌరవిస్తారు. మరి కొందరు వారు మాయమయ్యాక ఒప్పుకుంటారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు సంధించటంలో కొందరు నేర్పరరులు అయి ఉండవచ్చు  కానీ అధికారం వల్లో, అక్కసుతోనో,  ఎల్లకాలం ఇతరుల నోరు మూయించటం సాథ్యం కాదు.  ఆంగ్లంలో ఒకసామెత ఉంది.    ‘Every Dog has it’s own day’ .. ప్రతి కుక్క కీ ఒక రోజు వస్తుంది. కానీ ఆ రోజు వచ్చేదాకా ఆగగల ధైర్యం ఎందరికి ఉంటుంది?

… ప్రతి క్షణం గాయపరిచే అవకాశవాదుల నుండి ఎలా కాపాడుకోవాలి?… ఆత్మ సాక్షి లేని అవకాశవాదులని దాటి  ఎలా ముందుకు సాగిపోవాలి?  … నిలకడ లేని భావాలకు దూరంగా ,  నిజాయితీ లేని మనస్తత్వాలని తప్పించుకుని ప్రధానంగా అవకాశవాద పిశాచానికి  ఎదురోడే స్థైర్యం ఎలా వస్తుంది?………… ఈ ప్రశ్నల కి బదులివ్వడం చాలా కష్టం.ఎందుకంటె ఈ ప్రపంచం నడుస్తోంది అవకాశవాదుల మధ్యనే కదా……..

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"వెయ్యిమంది దోషులు వదిలివెయ్యబడ్డా ప్రపంచానికి నష్టం లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని పూజ్య బాపూ ఎప్పుడో చెప్పారు"

- ఈ విషయ౦ తో నేను ఏకిభవి౦చన౦డీ. వదలి వేయబడ్డ వెయ్యిమ౦ది దోషుల దృష్టిలో సమాజ౦ ఒక చేతకాని సమూహ౦గా కనబడుతు౦ది. వారు రెట్టి౦చిన ఉత్సాహ౦తో తమ దుష్కార్యాలను కొనసాగిస్తారు. ఉన్న మ౦చి వాళ్ళు కూడా వీరిని చూసి నిదాన౦గా నైనా స్పూర్తిపొ౦ది అదే దుర్మార్గానికి మరలుతారు. అ౦దుకే మన సమాజ౦ ప్రస్తుత౦ మీరు వివరి౦చిన ఈ స్థ్రితిలో ఉ౦ది.

amma odi చెప్పారు...

మంచి విషయం ఫోకస్ చేసారు. నెనర్లు!

నాగప్రసాద్ చెప్పారు...

సరిగ్గా ఇటువంటి టాపిక్ మీదనే నేను కూడా ఒకటపా రాద్దామని అనుకున్నాను. కాకపోతే, నేను రాద్దామనుకున్నది భారతీయ కంపెనీల్లోని పని సంస్కృతి (work culture) గురించి. అది కూడా దాదాపు ఇలానే ఉంటుంది. :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి